ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నవ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం వేగంగా వెళ్తున్న లారీ బస్సును ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సఫీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్దోయ్-ఉన్నావ్ రహదారిపై జమాల్దీపూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోగా, అధికారులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది.
ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన11 మందిని హుటాహుటిన కాన్పూర్ ఆస్పత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన వారిని ఉన్నవ్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. వారిలో చిన్నచిన్న గాయాలు అయిన వారికి ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జి చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టుగా పోలీసులు వెల్లడించారు.
ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్ పారిపోయాడని చెప్పారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..