శివసేనను దువ్వె ప్రయత్నం చేస్తోన్న బీజేపీ

మహారాష్ట్రలో చేజారిన అధికారాన్ని తిరిగి దక్కించుకునేందుకు భారతీయ జనతాపార్టీ అడుగులు వేస్తోంది.. ఇందుకోసం ఓ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతోంది.. ఒకప్పటి మిత్రపక్షమైన శివసేనను దువ్వె ప్రయత్నం మొదలు పెట్టింది..

శివసేనను దువ్వె ప్రయత్నం చేస్తోన్న బీజేపీ
Follow us

|

Updated on: Sep 29, 2020 | 12:02 PM

మహారాష్ట్రలో చేజారిన అధికారాన్ని తిరిగి దక్కించుకునేందుకు భారతీయ జనతాపార్టీ అడుగులు వేస్తోంది.. ఇందుకోసం ఓ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతోంది.. ఒకప్పటి మిత్రపక్షమైన శివసేనను దువ్వె ప్రయత్నం మొదలు పెట్టింది.. ఇప్పటికే శివసేనతో సంప్రదింపులు ఆరంభించింది. ఇందులో భాగంగానే కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అథవాలే ముంబాయికి వెళ్లారు.. అక్కడ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు.. రాష్ట్ర రాజకీయాల గురించి ఆరా తీశారు. స్థానిక రాజకీయ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఏదో చిన్న పొరపొచ్చాల కారణంగా తమతో విభేదాలు పెట్టుకున్న శివసేనను మళ్లీ ఎన్‌డీఏలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని మీడియాకు చెప్పారు రామ్‌దాస్‌ అథవాలే! శివసేన ఎన్‌డీఏలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి ఉద్దవ్‌ థాక్రేకే అప్పగిస్తామని, శివసేనకు కేంద్రంలో కొన్ని కీలక పదవులను కూడా ఇస్తామని అథవాలే చెప్పుకొచ్చారు. శివసేన కాదంటే మాత్రం ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ను సంప్రదిస్తామని, పవార్‌ కూడా నిరభ్యంతరంగా ఎన్‌డీఎలో చేరవచ్చని అన్నారు అథవాలే! మహావికాస్‌ ఆఘాడీ నుంచి శరద్‌పవార్‌ బయటకు వచ్చి బీజేపీతో చేతులు కలపాలని అభ్యర్థించారు. ఎన్‌సీపీ మద్దతు ఇస్తే మహారాష్ట్రలో తిరిగి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు.. బీజేపీకి ఎన్‌సీపీ మద్దతు ఇవ్వడం ఇప్పుడున్న పరిస్థితులలో చారిత్రక అవసరమని అన్నారు.. ఒకవేళ బీజేపీతో చేతులు కలిపితే శరద్‌పవార్‌ కేంద్రంలో కీలక పదవి కేటాయిస్తామని తెలిపారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్‌డీఏ నుంచి శిరోమణి అకాలీదళ్‌ బయటకు వచ్చేసింది.. ఆ ప్లేస్‌ను శివసేనతో భర్తీ చేయాలన్నది బీజేపీ ఆలోచన. శివసేన కాదంటే ఎన్‌సీపీనైనా ఎన్‌డిఏలో చేర్చుకోవాలనుకుంటోంది.. ఇదిలా ఉంటే గత వారం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌తో రహస్యంగా సమావేశమయ్యారు.. వారిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ.. .. బీజేపీ పెద్దల సూచన మేరకే సంజయ్‌ రౌత్‌తో ఫడ్నవిస్‌ సమావేశమయ్యారని ఇన్‌సైడ్‌ సమాచారం.. శివసేనను మళ్లీ తమవైపుకు తిప్పుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ ఉందట! ఉద్దవ్‌ థాక్రేతో దోస్తీ కోసం బీజేపీ ఇంతకు ముందు కూడా గట్టిగానే ప్రయత్నించింది.. కాకపోతే కమలదళంతో చేతులు కలపడానికి శివసేన అంగీకరించడం లేదు.. తమ ప్రతిపాదనను కాదని, ఇంకా బెట్టు చేస్తే మాత్రం శివసేనను వదిలిపెట్టేసి ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ను తమవైపుకు తిప్పుకోవాలన్నది బీజేపీ అధిష్టానం ఆలోచన. శరద్‌పవార్‌కు కూడా కేంద్ర పదవి ఇస్తానని ప్రామిస్‌ చేసింది.. అయితే పవార్‌ కూడా ఈ ఆఫర్‌ను తిరస్కరించారు. ఇప్పుడు మళ్లీ రామ్‌దాస్‌ అథవాలే ముంబాయికి వెళ్లడం, బహిరంగంగానే శివసేన, ఎన్‌సీపీలకు ఆహ్వానం పలకడం సంచలనం సృష్టిస్తోంది.. బీజేపీ ప్రతిపాదనలను అంగీకరించే పరిస్థితి లేదని మహావికాస్‌ ఆఘాడీ నేతలు అంటున్నారు..