Farmers protest: సాగుచట్టాలకు వ్యతిరేకంగా మలిదశ ఉద్యమం.. బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామన్న టికాయత్‌

|

Sep 05, 2021 | 9:06 PM

సాగుచట్టాలకు వ్యతిరేకంగా మలిదశ ఉద్యమాన్ని తీవ్రతరం చేశాయి రైతు సంఘాలు. యూపీ లోని ముజఫర్‌పూర్‌ నిర్వహించిన మహాపంచాయత్‌లో బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు రైతు సంఘాల నేతలు.

Farmers protest: సాగుచట్టాలకు వ్యతిరేకంగా మలిదశ ఉద్యమం.. బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామన్న టికాయత్‌
Farmers Protest
Follow us on

సాగుచట్టాలకు వ్యతిరేకంగా మలిదశ ఉద్యమాన్ని తీవ్రతరం చేశాయి రైతు సంఘాలు. యూపీ లోని ముజఫర్‌పూర్‌ నిర్వహించిన మహాపంచాయత్‌లో బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు రైతు సంఘాల నేతలు. రైతులతో చర్చలు జరపని మోదీ ప్రభుత్వం దేశ ఆస్తులను అదానీ , అంబానీలకు అమ్మేస్తోందని విమర్శించారు రైతు సంఘాల నేత టికాయత్‌. వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన ఆందోళన కీలకదశకు చేరుకుంది. ఉత్తరప్రదేశ్‌ లోని ముజఫర్‌పూర్‌లో కిసాన్‌ మహాపంచాయత్‌ను నిర్వహించాయి రైతు సంఘాలు. దేశం నలుమూల నుంచి లక్షలాదిమంది రైతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మిషన్‌ యూపీని ప్రకటించారు రైతు సంఘాల నేత రాకేశ్‌ టికాయత్‌.ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఉత్తరప్రదేశ్‌ , ఉత్తరాఖండ్‌తో పాటు దేశవ్యాప్తంగా తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జాతీయ సంపదను మోదీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని మండిపడ్డారు. 300 రైతు సంఘాల ప్రతినిధులు మహాపంచాయత్‌కు హాజరయ్యారు.

తొమ్మిదినెలల నుంచి సాగుతున్న ఉద్యమంలో ఎంతోమంది రైతులు చనిపోయారని , ప్రధాని మోదీకి చనిపోయిన రైతులకు సంతాపంగా ఒక్క నిముషం మౌనం పాటించేందుకు సమయం దొరకడం లేదని విమర్శించారు టికాయత్‌. కేంద్రం దిగివచ్చేవరకు ఢిల్లీలో తమ ఉద్యమం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. 90 ఏళ్ల పాటు బ్రిటీష్‌ వాళ్లతో పోరాడి స్వాతంత్ర్యం తెచ్చుకున్నామని, ఢిల్లీలో తమ సమాధులు కట్టినప్పటికి కూడా ఉద్యమం ఆగదన్నారు రాకేశ్‌ టికాయత్‌. కేంద్రంలో మోడీ ప్రభుత్వం.. యూపీలో యోగి ప్రభుత్వం ప్రజలను విభజించి పాలిస్తున్నాయని విమర్శించారు.

ముజఫర్‌పూర్‌లో రైతుల మహాపంచాయత్‌కు సంఘీభావం ప్రకటించారు బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ. దేశానికి అన్నం పెట్టే రైతులతో కేంద్రం చర్చలు జరపాలని ఆయన ట్వీట్‌ చేశారు. కేంద్రాన్ని టార్గెట్‌ చేస్తూ ముజఫర్‌పూర్‌లో రైతు సంఘాలు సభను నిర్వహిస్తే .. దానికి సొంత పార్టీ ఎంపీ మద్దతు తెలపడం బీజేపీ నేతలకు ఇబ్బందిగా మారింది.

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే యూపీపై గురిపెట్టాయి రైతు సంఘాలు. రైతు సంఘాల నేతలు ఉద్యమం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ కౌంటరిచ్చింది. అయితే తాము యూపీ ఎన్నికల కోసం పోరాటం చేయడం లేదని , దేశ సంపదను అదానీ , అంబానీలకు మోదీ ప్రభుత్వం కట్టుబెడుతున్నందుకు పోరాటం చేస్తున్నామని టికాయత్‌ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి: ట్రాఫిక్‌లో హారన్ శబ్ధాలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఇక ఆ సౌండ్ పొల్యూషన్‌ వినిపించదు ఎందుకో తెలుసా..

Goat Farming: ఈ మొబైల్ యాప్ మీ దగ్గర ఉంటే చాలు.. మేకల పెంపకంలో లక్షలు సంపాదించడం నేర్పిస్తుంది..