Bihar Railways Scam: బీహార్‌లో విచిత్రమైన రైల్వే కుంభకోణం బట్టబయలైంది. రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ ఇంజనీర్.. నకిలీ పత్రాలను సృష్టించి ఏకంగా రైలు ఇంజిన్‌ను అమ్మేశాడు. ఇప్పుడిది రైల్వే శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకెళితే.. బిహార్‌లోని సమస్తీపూర్ రైల్వే డివిజన్‌లో ఓ పాత ఆవిరి రైల్ ఇంజిన్ ఉంది. ఇదే డివిజన్‌లో ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజీవ్ రంజన్ ఝా.. దానిపై కన్నేశాడు. నకిలీ ధృవపత్రాలు వినియోగించి దానిని స్క్రాప్ మాఫియాకు అమ్మేశాడు. ఈ వ్యవహారంలో రాజీవ్‌కు స్థానిక పోలీసు అధికారితో పాటు.. రైల్వే శాఖలోని ఇతర సిబ్బంది కూడా సహకారం అందించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం డిసెంబర్ 14న చోటు చేసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఎలా వెలుగుచూసిందంటే..
రైలు ఇంజిన్ అమ్మకానికి సంబంధించి ఒక నకిలీ ధృవపత్రాలను రాజీవ్ సృష్టించాడు. దాని ఆధారంగా ఇంజిన్‌ను స్క్రాప్ మాఫియాకు విక్రయించాడు రాజీవ్. డిసెంబర్ 14వ తేదీన రాజీవ్.. రైల్వే శాఖలో ఓ హెల్పర్ సాయంతో గ్యాస్ కట్టర్‌తో రైలు ఇంజిన్‌ను స్క్రాప్‌లా మార్చే ప్రయత్నం చేశారు. అయితే, అది గమనించిన ఇతర అధికారులు.. రాజీవ్ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అప్పటికే సిద్ధం చేసుకున్న నకిలీ ధృవపత్రాలు చూపించి వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు రాజీవ్. ఆ సర్టిఫికెట్లు అనుమానాస్పదంగా ఉండటంతో.. పై అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు.. తాము అలాంటి ఆదేశాలేం ఇవ్వలేదని స్పష్టం చేశారు. దాంతో ఆర్‌పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సమస్తీపూర్ రైల్వే డివిజన్ అధికారులు. ఈ ఫిర్యాదు ఆధారంగా రైల్వే ఇంజనీర్ రాజీవ్ రంజన్ ఝా, ఒక పోలీసు అధికారి సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు.. ఈ కుంభకోణానికి పాల్పడిన రైల్వే ఇంజనీర్ రాజీవ్, ఇతర సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు డీఆర్ఎం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
Also read:
E Shram Card : ఇ – శ్రమ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా మీరే చేసుకోవచ్చు..!
Chanakya Niti: జీవితంలో విజయం సాధించాలంటే.. యవ్వనంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి..