Punjab Congress Crisis: డిన్నర్ పార్టీ వేదికగా సీఎం అమరీందర్ బలప్రదర్శన.. ముగ్గురు మంత్రులు డుమ్మా
పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం గంటకో మలుపు తిరుగుతోంది. ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్‌ను తప్పించాలని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగరవేయడం తెలిసిందే.
పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం గంటకో మలుపు తిరుగుతోంది. ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్‌ను తప్పించాలని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగరవేయడం తెలిసిందే. అమరీందర్ సింగ్‌కు వ్యతిరేకంగా నలుగురు మంత్రులు, 30కి పైగా ఎమ్మెల్యేలు అసమ్మతి గళం వినిపిస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి. సీఎం పదవి నుంచి అమరీందర్ సింగ్‌ను మార్చాలని వారు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అమరీందర్ సింగ్ వ్యతిరేక వర్గీయుల డిమాండ్‌ను కాంగ్రెస్ అధిష్టానం తోసిపుచ్చింది. 2022లో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను అమరీందర్ సింగ్ సారథ్యంలోనే ఎదుర్కొంటామని కాంగ్రెస్ అధిష్టానం తేల్చిచెప్పింది. అటు అమరీందర్ సింగ్‌కు వ్యతిరేకంగా బహిరంగ విమర్శలు చేస్తున్నవారి వెనుక పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్ధూ ఉన్నారని ఆయన సతీమణి, కాంగ్రెస్ ఎంపీ ప్రణీత్ కౌర్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి అమరీందర్ సింగ్ గురువారం రాత్రి డిన్నర్ పార్టీ వేదికగా బలప్రదర్శన చేశారు. అమరీందర్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడైన మంత్రి రానా గుర్‌మీత్ సోధి నివాసంలో నిర్వహించిన ఈ డిన్నర్ పార్టీకి 50 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు హాజరైనట్లు ఇందులో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ సమావేశానికి ముగ్గురు మంత్రులు డుమ్మాకొట్టారు. అసమ్మతి వర్గీయుడిగా భావించిన మంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్ని కూడా ఈ డిన్నర్ పార్టీకి హాజరయ్యారు.
భావ సారూప్యత కలిగిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను తాను డిన్నర్‌కు ఆహ్వానిస్తే 58 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు హాజరైనట్లు మంత్రి రానా గుర్‌మీత్ సోధి సోషల్ మీడియాలో వెల్లడించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలో పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
‘I’d invited like-minded @INCPunjab MPs & MLAs for dinner. 58 MLAs & 8 MPs graciously accepted my invitation & expressed the confidence that the party would win the 2022 polls under the leadership of @capt_amarinder. The journey has started today’: @iranasodhi pic.twitter.com/HkHYIJpzU7
— Raveen Thukral (@RT_MediaAdvPBCM) August 26, 2021
డిన్నర్ పార్టీకి హాజరుకాని ముగ్గురు రెబల్ మంత్రులు శుక్రవారం ఉదయం ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలుస్తారని సమాచారం. సీఎం పదవి నుంచి అమరీందర్ సింగ్‌ను మార్చాలని వారు పార్టీ అధిష్టానాన్ని కోరనున్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే అమరీందర్ సింగ్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అమరీందర్ పూర్తిగా విఫలం చెందారని వారు ఆరోపిస్తున్నారు.
తన వ్యతిరేక వర్గీయులు ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలోనే కెప్టెర్ అమరీందర్ సింగ్ బలప్రదర్శనకు పూనుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అత్యధికులు తన వెంటే ఉన్నారంటూ ఆయన పార్టీ అధిష్టానానికి స్పష్టమైన సంకేతాలు పంపారు.
Also Read..
Bank Holidays in September: వచ్చే నెలలో 7 రోజులు బ్యాంకులు పనిచేయవు..ఎప్పుడెప్పుడో తెలుసుకోండి!