
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పై బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది.ఓ వ్యక్తి ఏక్‌నాథ్ హెల్ఫ్ లైన్ నెంబర్ కు ఫోన్ కు చేసి సీఎంను చంపేస్తాంటూ హెచ్చరించాడు. వివరాల్లోకి వెళ్తే పూణేలోని వార్జెకి చెందిన రాజేష్ అగవానే అనే వ్యక్తి ముంబయిలోని నర్సుగా పనిచేస్తున్నాడు. పూణేలో ఉన్న తన భార్యను కలవడానికి నెలకు కొన్నిసార్లు ఇంటికి వస్తుంటాడు. అయితే అతనికి తాగిన మైకంలో ఇతరులను బెదిరించడం, తిట్టడం లాంటి అలవాటు ఉంది. అయితే సోమవారం రాత్రి రాజేష్ పోలీసుల హెల్ఫ్‌లైన్ నెంబర్ కు ఫోన్ చేశాడు. తాను ఛాతి నొప్పితో బాధపడుతున్నానని వెంటనే అంబులెన్స్ ను పంపించాలంటూ అడిగాడు. దీంతో పోలీసులు 108 కు ఫోన్ చేయాలని సూచించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ హెల్ప్‌లైన్ నెంబర్ కి మళ్లీ ఫోన్ వచ్చింది. ఈసారి రాజేష్ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను చంపేస్తానంటూ బెదిరించాడు.
వాళ్లతో రాజేష్ మాట్లాడుతుండగానే అతని భార్య ఆ ఫోన్ తీసుకొని తన భర్త తాగిన మైకంలో ఉన్నాడని అందుకే మాట్లాడుతున్నాడని చెప్పింది. అయినప్పటికీ ఈ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అనంతరం పోలీసులు వార్జెలో ఉంటున్న రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రాజేష్ ను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే అతను ఎందుకు ఫోన్ చేసి అలా మాట్లాడాడు అనే విషయంపై మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..