నిరవధిక నిరసన ప్రదర్శనలు, ఆందోళనలకు బహిరంగ ప్రదేశాలను ఆక్రమించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీఏఏ కి వ్యతిరేకంగా గత ఫిబ్రవరిలో ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద ఎన్నో రోజులపాటు నిరసనకారులు టెంట్లు వేసి మరీ ఆందోళనలు జరిపారు. ఆ ప్రదర్శనల్లో తమ పిల్లలతో బాటు అనేకమంది మహిళలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ భారీ ధర్నాపై దాఖలైన పిటిషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం..ఈ ఉత్తర్వులిస్తూ.. పబ్లిక్ మీటింగులు, సభలు నిర్దేశిత ప్రాంతాల్లోనే జరగాలని సూచించింది. రోడ్లను నిరవధికంగా ఆక్రమించుకోవడం తగదని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఆధ్వర్యాన గల ముగ్గురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. రోడ్లను ప్రజలు వినియోగించుకునే హక్కు, అలాగే నిరసన తెలిపే హక్కు తులనాత్మకంగా ఉండాలని కోర్టు అభిప్రాయపడింది.