Israel Embassy Blast : ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో పురోగతి.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు..

ఢిల్లీలో ఇజ్రాయెల్‌ ఎంబసీ దగ్గర పేలుడు కేసు దర్యాప్తులో పురోగతి లభించింది. ఇద్దరు అనుమానితులను ఢిల్లీ స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇరాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి..

  • Sanjay Kasula
  • Publish Date - 7:39 pm, Sat, 30 January 21
Israel Embassy Blast : ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో పురోగతి.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు..
Israel Embassy Blast

Israel Embassy Blast : ఢిల్లీలో ఇజ్రాయెల్‌ ఎంబసీ దగ్గర పేలుడు కేసు దర్యాప్తులో పురోగతి లభించింది. ఇద్దరు అనుమానితులను ఢిల్లీ స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇరాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పేలుడుకు విదేశాల్లో కుట్ర జరిగినట్టు నిర్ధారించారు. చిన్న పేలుడే అయినప్పటికి భారీ కుట్ర దాగి ఉన్నట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. పేలుడు జరిగిన ప్రదేశంలో నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌, ఎన్‌ఎస్‌జీ దర్యాప్తును ప్రారంభించింది. పేలుడు ప్రదేశాన్ని 3 డీ మ్యాపింగ్‌ చేశారు. పేలుడుకు ముందు పలుమార్లు రెక్కీ నిర్వహించినట్టు కూడా గుర్తించారు.

ముందుగా రెక్కీ నిర్వహించి అక్కడి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు పనిచేయడం లేదని గుర్తించి.. వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు నిర్థారణకొచ్చారు. అయితే ఎంబసీ వద్ద దొరికిన ఒక సీసీఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు. పేలుళ్ల సమయంలో ఓ క్యాబ్‌లో ఇద్దరు వ్యక్తులు దిగినట్లుగా గుర్తించారు. ఆ క్యాబ్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ ఇద్దరూ ఎవరన్న అంశంపై విచారించారు. క్యాబ్‌ డ్రైవర్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఊహా చిత్రాలను సిద్ధం చేశారు. అయితే క్యాబ్‌ డ్రైవర్‌ నుంచి పేలుడు ఘటన కంటే ముందే పోలీసులకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు తన కారులో ప్రయాణించినట్లు పోలీసులకు సమాచారమిచ్చాడు ఆ క్యాబ్‌ డ్రైవర్‌.

అయితే గతేడాది బాగ్ధాద్‌ పేలుళ్లలో మృతి చెందిన ఖాసిం సులేమనీతో పాటు..అణు శాస్త్రవేత్త మొహిసిన్‌ ఫక్రజా పేర్లతో ఈ లేఖను వదిలివెళ్లారు. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి 12 గజాల దూరంలో ఈ లేఖను గుర్తించారు అధికారులు. ఈ లేఖ ఆధారంగా నిన్న జరిగిన పేలుడు తీవ్రత స్వల్పంగా ఉన్నా..రానున్న రోజుల్లో పెద్ద కుట్రకు ప్లాన్‌ చేయొచ్చని పోలీస్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి.

ఇది ట్రైలర్‌ మాత్రమే..

ఇది ట్రైలర్‌ మాత్రమే.. అసలు సినిమా ముందుంది.. ఇదేదో హర్రర్‌ సినిమానో.. యాక్షన్‌ మూవీనో కాదు.. రియల్‌ స్టోరీ. ఢిల్లీ ఇజ్రాయెల్‌ ఎంబసీ వద్ద దొరికిన సీక్రెట్‌ ఎన్వలప్‌ సారాంశం.. ఎస్‌.. ఇజ్రాయెల్‌ ఎంబసీ టార్గెట్‌గానే ముష్కర మూకలు దాడి చేశాయి. పక్కా ప్లాన్‌ ప్రకారం పేలుడుకు పాల్పడ్డారు. ఇజ్రాయెల్‌ అంబాసిడర్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. మీ జీవితం ఏ క్షణంలోనైనా ముగిసిపోతుందంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ దాడి తమ పనేనని జేషే ఉల్‌హింద్‌ ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. మరోవైపు తమ ఎంబసీపై దాడి నేపథ్యంలో ఈ ఘటన జరిగిన ప్రాంతానికి ఇజ్రాయెల్‌ బృందం చేరుకుంది.

పేలుడు ఎవరి పని..? ఎందుకు చేశారు..?

శుక్రవారం జరిగిన ఇజ్రాయెల్‌ ఎంబసీ వద్ద పేలుడు ఎవరి పని..? ఎందుకు చేశారు..? అన్న కోణంలో చేస్తున్న దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి. ఈ ఘటన వెనుక ఇరాన్‌ హస్తముందా..? ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయమే టార్గెట్‌గా భారీ విధ్వంసానికి కుట్ర చేశారా..? అంటే అవునని  అంటున్నారు అధికారులు.

ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకే ఈ దాడికి పాల్పడ్డారు ముష్కరులు. పేలుడు జరిగిన ప్రాంతానికి 12 గజాల దూరంలో దొరికిన లెటర్‌తో ఎన్నో నిజాలు బయటికొస్తున్నాయి. ఇజ్రాయెల్‌ ఎంబసీ బ్లాస్ట్‌..పక్కా ప్లాన్‌ ప్రకారమే చేసినట్లుగా గుర్తించారు ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు. అక్కడ దొరికిన లెటర్‌ ఆధారంగా ప్రాథమిక నిర్థారణకొచ్చారు. పేలుడులో అమ్మోనియం నైట్రేట్‌ వాడినట్లు గుర్తించారు. తీవ్రత తక్కువుండేలా ప్లాన్‌ చేసినా..క్వాంటిటీ మాత్రం ఎక్కువగా ఉపయోగించారని పేర్కొన్నారు. 9 ఏళ్ల క్రితం కూడా ఇదే ఎంబసీ ముందు పేలుడు జరిగిందని..ఆ ఘటనతో తాజా పేలుడుకు సంబంధం ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇరాన్‌ చేసిన పనేనని…

ఇరాన్‌కు, ఇజ్రాయెల్‌కు ఉన్న శతృత్వం నేపథ్యంలో ఇది ఇరాన్‌ చేసిన పనేనని అనుమానిస్తున్నారు పోలీసులు. ఇజ్రాయెల్‌కు పలు ఇస్లామిక్‌ కంట్రీస్‌ నుంచి ఇప్పటికే ముప్పు పొంచి ఉంది. గతేడాది ఆర్మీ చీఫ్‌ ఖాసిం సులేమని టార్గెట్‌గా అమెరికా చేసిన దాడిలో..ఇజ్రాయెల్‌ సహకారం కూడా ఉందని భావిస్తోంది ఇరాన్‌. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌పై కసి పెంచుకొని..ఈ దాడికి పాల్పడ్డట్లు ప్రాథమిక నిర్థారణకొచ్చారు. అయితే గత రెండు నెలల నుంచే ఇజ్రాయెల్‌ ఎంబసీలపై దాడి జరగొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారంతో అప్రమత్తమయ్యారు ఇజ్రాయెల్‌ అధికారులు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..
Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..