AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక లోపాలకు తావులేదు.. ఎన్టీఏ ప్రక్షాళనపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ఆదేశాలు..

దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న వివాదాలు, అవకతవకలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విశ్వసనీయతను పునరుద్ధరించే లక్ష్యంతో సైబర్ సెక్యూరిటీ, రహస్య నిర్వహణ వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులకు ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా 10 కీలక పోస్టులను తెరమీదకు తెచ్చారు.

ఇక లోపాలకు తావులేదు.. ఎన్టీఏ ప్రక్షాళనపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ఆదేశాలు..
Pralhad Joshi Nta Review Meeting
Krishna S
|

Updated on: Aug 17, 2026 | 5:14 PM

Share

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే పరీక్షల వ్యవస్థను పారదర్శకంగా, పకడ్బందీగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇటీవల పరీక్షల నిర్వహణలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో ఎన్టీఏలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సహా ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఏ వ్యవస్థాగత సంస్కరణలపై అధికారులు మంత్రికి కీలక వివరాలను వెల్లడించారు.

కొత్తగా 10 కీలక పోస్టులు

పరీక్షల నిర్వహణలో లోపాలు, అవకతవకలకు తావులేకుండా ఉండేందుకు ఎన్టీఏ నుంచి ఇప్పటికే 50 మందికి పైగా సిబ్బందిని తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా సంస్థ పనితీరును ప్రొఫెషనల్‌గా మార్చేందుకు 10 కొత్త ఉన్నత స్థాయి నాయకత్వ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

  • చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్
  • చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్
  • చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్
  • జనరల్ మేనేజర్ – టెస్ట్ సెక్యూరిటీ
  • జనరల్ మేనేజర్ – ఆర్ అండ్ డీ, సైకోమెట్రిక్స్ వంటి కీలక విభాగాల అధిపతుల నియామక ప్రక్రియ తుది దశకు చేరింది.

ప్రైవేట్ రంగం నుంచి నిపుణుల ఎంపిక

పరీక్షల ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు సైబర్ సెక్యూరిటీ, సైకోమెట్రిక్స్, క్వశ్చన్ పేపర్ డిజైనింగ్ వంటి ప్రత్యేక విభాగాల్లో ప్రైవేట్ రంగం నుంచి డొమైన్ నిపుణులను రంగంలోకి దించుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా ఉపయోగించుకుని పేపర్ లీకేజీలు, సైబర్ దాడులకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

యుద్ధప్రాతిపదికన కాన్ఫిడెన్షియల్ ఆపరేషన్స్ ప్రక్షాళన

పరీక్షల నియమ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆదేశించారు. ముఖ్యంగా కాన్ఫిడెన్షియల్ ఆపరేషన్స్ నెట్‌వర్క్ , ప్రత్యేక రహస్య గదులు, ఇంటర్నెట్‌తో సంబంధం లేని ఎయిర్ గ్యాప్డ్ సిస్టమ్స్, పరీక్ష కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ పరికరాల డిపాజిట్ నిబంధనలను యుద్ధప్రాతిపదికన పటిష్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని పరీక్షా ప్రక్రియలపై పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించి, తీసుకున్న దిద్దుబాటు చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను జోషి ఆదేశించారు.

Follow Us