అదో మహోత్సవం.. ఆధ్యాత్మిక సౌరభం.. కన్నుల పండుగగా పూరమ్ వేడుక..
అదో ఉత్సవం. కాదు కాదు. మహోత్సవం. వైభవోపేతం. తాదాత్మ్యతను కలిగించే ఆధ్యాత్మిక సౌరభం. భక్తిభావాన్ని పెంపొందించే సంప్రదాయం. చెక్కుచెదరని సాంస్కృతిక చిహ్నం. అదే త్రిసూర్ పూరం.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న త్రిసూర్ పూరంకు సమయం దగ్గరపడింది. కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఈ ఉత్సవానికి అంతరాయం కలిగింది. రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిన ఆనందం కూడా ప్రజలలో కనిపిస్తోంది. విరామం ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. కేరళలోని త్రిసూర్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తోంది. ఆధ్యాత్మిక […]
అదో ఉత్సవం. కాదు కాదు. మహోత్సవం. వైభవోపేతం. తాదాత్మ్యతను కలిగించే ఆధ్యాత్మిక సౌరభం. భక్తిభావాన్ని పెంపొందించే సంప్రదాయం. చెక్కుచెదరని సాంస్కృతిక చిహ్నం. అదే త్రిసూర్ పూరం.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న త్రిసూర్ పూరంకు సమయం దగ్గరపడింది. కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఈ ఉత్సవానికి అంతరాయం కలిగింది. రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిన ఆనందం కూడా ప్రజలలో కనిపిస్తోంది. విరామం ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
కేరళలోని త్రిసూర్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తోంది. ఆధ్యాత్మిక పరిమళం వెల్లివెరుస్తోంది. ఇవాళ జరిగే పూరం వేడుక కోసం సన్నాహాలు మొదలయ్యాయి. ఉత్సవం కోసం ఏనుగులు సిద్ధమవుతున్నాయి. ఊరేగింపులో పాల్గొనే గజరాజులను ప్రత్యే వైద్య బృందం పరీక్షలు జరుపుతోంది.. వాటి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఇక వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే మేళతాళాలు శ్రుతులు చేసుకుంటున్నాయి. శుభఘడియ కోసం ఎదురుచూస్తున్న ప్రజలు. ఉత్సవం కోసం సంసిద్ధమవుతున్న ఏనుగులు. వెరసి ఓ ఆధ్యాత్మిక పరిమళం వెల్లివిరుస్తోంది.. సంప్రదాయాలు. ఆచారాలకు పెద్దపీట వేసే కేరళలోని అన్ని ఆలయాలలో ఇలాంటి వేడుకలు జరుగుతాయి. కానీ, త్రిసూర్‌లోని వడక్కునాథన్ ఆలయం వేదికగా జరిగే పూరంకు ఓ ప్రత్యేకత ఉంది. ఇంతగొప్ప పూరం మరెక్కడా జరగదు. ఇంత ఘనమైన పూరం మరెక్కడా కానరాదు. అందుకే అంతమంది జనం విచ్చేస్తుంటారు.. అందుకే అంతమంది పర్యాటకులు మనసు పారేసుకుంటారు. త్రిసూర్ పూరం పండుగ వైభవాన్ని వర్ణించడం అసాధ్యం! ఇది కేరళవాసులకు ముఖ్యమైన ఉత్సవం. ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసే ఉల్లాసభరితమైన సంబరం. పురాతన సంప్రదాయాన్ని పదిలంగా కాపాడుకుంటూ వస్తూఉన్న సంకల్పం. ఈ వేడుక జరిగేది శ్రీ వడక్కునాథన్ అంటే శివుడి ఆలయంలోనే అయినప్పటికీ చుట్టుపక్కల గ్రామాల దేవీదేవతలందరూ ఇందులో పాలుపంచుకుంటారు. పది గ్రామాల నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఏనుగులపై ఊరేగుతూ త్రిసూర్‌కు చేరుకుంటాయి.. వడక్కునాథన్ సన్నిధిలో ప్రత్యేక పూజలు జరుగుతాయి.. ఆ తర్వాత ఆలయం సమీపంలోని థెక్కిన్‌కాడు మైదానంలో అంగరంగ వైభవంగా “పూరం” పర్వం జరుగుతుంది..
త్రిసూర్ పూరం వేడుక ఆవిర్భావమే ఆసక్తికరంగా ఉంటుంది. ఒకప్పుడు త్రిసూర్ జాల్లాలోని ఆలయాలన్నీ ఆరట్టుపుళ పూరంలో పాల్గొనేవి! ఓ ఏడాది భారీ వర్షాలు కురిశాయి. ఈ కారణంగా శ్రీవడక్కునాథన్ ఆలయ సిబ్బంది సమయానికి ఆరట్టుపుళకు చేరుకోలేకపోయింది. కారణమేమిటో తెలుసుకోకుండా త్రిసూర్‌కు చెందిన బృందాన్ని వేడుకల నుంచి బహిష్కరించారు. దీన్ని అవమానంగా భావించారు వడక్కునాథన్ ఆలయ అధికారులు.. అప్పుడే తమ ఆలయానికి ప్రత్యేకంగా పూరం జరుపుకోవాలని తీర్మానించుకున్నారు. అయితే వీరితో మిగతా ఆలయాల అధికారులు కలిసిరాలేదు.. దాంతో ఈ పూరం ఎక్కవకాలం నిలువలేకపోయింది. 18వ శతాబ్దం ఆరంభంలో కొచ్చిన్ రాజవంశానికి చెందిన శ్రీరామవర్మ పాలన ప్రారంభమయ్యింది. శాక్తాన్‌తంబురాన్ అని ప్రజలు ఈయను గౌరవంగా పిలుచుకునేవారు. అంటే శక్తివంతుడైన పాలకుడన్న మాట! శీరామవర్మకు వడక్కునాథన్ ఆరాధ్యదైవం. లలితకళలన్నా, సంస్కతీ సంప్రదాయాలన్నా రామవర్మకు ఎనలేని అభిమానం. త్రిసూర్ పూరం గురించి తెలుసుకున్న ఆయన తిరిగి ఆ పండుగను నిర్వహించడానికి పూనుకున్నారు. అలా త్రిసూర్‌పూరం పున:ప్రారంభమయ్యింది. రెండు వందల సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతోంది. పదిహేను రోజుల ముందునుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. కేరళలో పేరొందిన కళాకారులంతా త్రిసూర్‌కు వస్తారు. పంచవాద్య, చెండామేళం కళాకారుల బృందాలు సాధనలో నిమగ్నమవుతాయి.. ప్రతి ఏడాది జరిగే ఉత్సవమే అయినా. ఏటికేడు రెట్టించిన ఉత్సాహం, అనిర్వచనీయమైన ఆనందం.. అదే త్రిసూర్ పూరం ప్రత్యేకం! రెండేళ్ల తర్వాత మళ్లీ గొప్ప వేడుకను చూస్తున్నామన్న సంబరం. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన వైభవం. పూరం అంటే పర్వం కాదు. పూరం అంటే సమ్మేళనం, సంపూర్ణం. అందరూ కలిసి చేసుకునే అపురూప సంబరం. పూరం అంటే సమూహమని అర్థం. చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా స్థానికులతో కలిసి సమూహంగా ఏర్పడి ఏడాదికోసారి పరమేశ్వరుడిని సేవించుకోవడమే పూరం అన్నమాట!
మలయాళ క్యాలెండర్ కొల్లవర్షం ప్రకారం మేడం మాసంలో ఈ ఉత్సవం వస్తుంది. పూరంలో పాల్గొనే ఆలయాలలో వారం రోజుల ముందే ధ్వజారోహణ ఉంటుంది. అన్ని ఆలయాలలో ధ్వజస్తంభం ఉన్నప్పటికీ పూరం తాలూకు పతాకం ఎగరేయడానికి ఓ స్థలాన్ని ఎంపిక చేసుకుంటారు. అక్కడ ప్రత్యేకమైన పూజలు చేసి స్తంభాన్ని పాతుతారు. దానికి జెండాను కడతారు. ఆ తర్వాతే అన్ని బృందాలు త్రిసూరుకు బయలుదేరుతాయి. ధ్వజాలను ఆవిష్కరించిన నాలుగో రోజున తిరువంబాడి, పరమేక్కావు దేవస్థానాల ఆధ్వర్యంలో ఓ ప్రదర్శన జరుగుతుంది. ఇందులో ఏనుగులకు అలంకరించే బంగారు ఆభరణాలను, ఉత్సవం కోసం తయారు చేసిన గొడుగులను, ఇతర అలంకరణ సామాగ్రిని ప్రదర్శిస్తారు. అదే రోజు సాయంత్రం రంగులు వెదజల్లే బాణాసంచాను కాలుస్తారు. పూరం ఆరంభం కావడానికి ముందు రోజున నేతిలక్కావు భగవతి ఉత్సవమూర్తి త్రిసూర్‌కు చేరుకుంటుంది.. దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకుతారు. శ్రీవడుక్కునాథన్‌ను దర్శించుకుని, స్వామివారి అనుమతి తీసుకుని, నిరంతరం మూసుకుని ఉండే దక్షిణ ద్వారాన్ని తెరిపించి, పూరం ఆరంభమైనట్టుగా అధికార ప్రకటన చేస్తుంది నేతిలక్కావు భగవతిదేవి బృందం. అనంతరం దేవిని పడమర ద్వారం దగ్గర ఉన్న మూలస్థానం చెంత ఉపస్థితురాలిని చేస్తారు.
మొదటగా కనిమంగళం శ్రీధర్మశాస్త ఆలయానికి చెందిన బృందం ఆలయ ఉత్సవమూర్తితో వడక్కునాథన్ ఆలయ దక్షిణ గోపుర ద్వారం గుండా ప్రవేశించి పడమర వాకిలి చేరతారు. మిగిలిన ఆలయాల బృందాలు కూడా వాటికి నిర్దేశించిన తూర్పు, ఉత్తర, దక్షిణ ద్వారాల గుండా ఆలయంలోనికి ప్రవేశించి వడక్కునాథన్‌ను సేవించుకుని పడమర ద్వారం దగ్గర ఉన్న మూలస్థానం చెంతకు చేరుకుంటాయి. త్రిసూర్ పట్టణానికి నడిబొడ్డున ఉన్న శ్రీవడక్కునాథర్ ఆలయానికి స్వరాజ్ రౌండ్ అనే అరవై అయిదు ఎకరాల విశాలమైన ప్రాంగణం ఉంది. ఆలయానికి ఎత్తయిన ప్రహారీ ఉంది. నలుదిశలా నాలుగు ద్వారాలు ఉన్నాయి. పూరం ఉత్సవాలకు ఇక్కడ ప్రారంభించే ప్రదర్శనశాలతో అంకురం పడుతుంది. ఇప్పటికే వృత్తాకారంలో ఉన్న స్వరాజ్ రౌండ్ మైదానం జాతరను తలపిస్తోంది. రకరకాల తినుబండరాలు. వస్త్రాలు. పూజ సామాగ్రి. బొమ్మల దుకాణాలు వెలిశాయి. చిన్నారుల కోసం రంగుల రాట్నాలు కూడా వచ్చేశాయి. తిరువంబాడి శ్రీభగవతి, పరమేక్కావు శ్రీ భగవతి ఆలయాల ఆధ్వర్యంలో మొత్తం పది ఆలయాలు రెండు జట్లుగా విడిపోయి వేడుకలో పాల్గొంటాయి. పరమేక్కావు వైపు పూకట్టికర కరముక్కు భగవతి, చూరకట్టుకర భగవతి, చెంపుక్కావు భగవతి, పనేముక్కుపిల్లి శాస్త ఉంటారు. తిరువంబాడి తరఫున అయ్యన్తోల్ భగవతి, నేతిలక్కావు భగవతి, లూర్ భగవతి, కనిమంగళం శాస్త ఉంటారు. పూరం ఉత్సవంలో మండతిల్ ఓరువు ప్రధాన ఆకర్షణ. ఈ పంచవాద్య కార్యక్రమంలో రెండు వందలకు పైగా వాయిద్యకారులు అద్భుతమైన లయ విన్యాసాలను ప్రదర్శిస్తారు. అర్ధరాత్రి రెండు గంటలకు శ్రీవడుక్కనాథర్ సన్నిధిలో ఇంజితార మేళం వాయిస్తారు. మేళం పూర్తికాగానే అన్ని ఆలయాల అధికారులు ఉత్సవ విగ్రహాలతో పడమర ద్వారం నుంచి మరోసారి ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు.. పూరం వేడుకలను మొదలుపెట్టడానికి స్వామివారి అనుమతి తీసుకుని దక్షిణ ద్వారం నుంచి వెలుపలికి వస్తారు.
లక్షలాది మంది సందర్శకులు ఎదురుచూసిన అపురూపఘట్టం ప్రారంభమవుతుంది. రెండు బృందాలు ఎదురెదురుగా తమ గజబలాలతో నిలబడతాయి. దేవస్థానాలకు చెందిన ఏనుగులే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఆలయాల నుంచి ఏనుగులు తరలివస్తాయి. మొత్తం మీద 50 ఏనుగులు అటు ఇటు దర్జాగా నిలబడతాయి. ఏనుగుల నుదిటి మీద అలంకరించే బంగారు ఆభరణాలను నెట్టిపట్టం అంటారు. వీపుపైన పట్టుపీతాంబరాలను అలంకరించుకుని పోరుకు సిద్ధమవుతాయి. కొన్ని గంటలపాటు అదరక బెదరక అలాగే నిల్చుంటాయి. ఏనుగుల మీద నిలబడిన ఆటగాళ్లు రంగు రంగుల గొడుగులతో చేసే విన్యాసాలు చూపు తిప్పుకోనివ్వవు. లక్షలాది మంది చేసే కోలాహలం. వాయిద్యాల హోరు. బాణాసంచా చప్పుళ్ల మధ్య మావటి ఆజ్ఞకు కట్టుబడి గంటల తరబడి ఏనుగులు అలా నిల్చుకోవడమన్నది అద్భుతం. మహాద్భుతం. త్రిస్సూర్ పూరంలో మరో ప్రత్యేక ఆకర్షణ బాణాసంచా! రంగురంగుల కాంతులతో దేదీప్యమానంగా వెలిగే బాణాసంచాను కాలుస్తారు. ఆ రాత్రి బాణాసంచా చప్పుళ్లతో, కాంతులతో త్రిస్సూరు పట్టణం ధగధగలాడుతుంది. బాణాసంచా పేలుళ్లకు ఒక్కోసారి పడమర ద్వారానికి పూరం ముందు కల్పిన పెంకులు పగిలిపోతాయి. తెల్లవారుజాము వరకు బాణాసంచా కార్యక్రమం సాగుతూనే ఉంటుంది. శ్రీవడక్కునాథర్ ఆలయంలో పూజలు పూర్తి అయిన తర్వాత విందు కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత పూరంలో పాల్గొన్న పది ఆలయాల దేవి, శాస్తలు స్వస్థలాలకు వెళ్లిపోతాయి. దాంతో త్రిస్సూర్ పూరం ముగుస్తుంది. చుట్టుపక్కల నుంచి వచ్చిన ఏనుగులు మరో రెండు రోజులు స్వరాజ్ రౌండ్ మైదానంలోనే గడుపుతాయి. టూరిస్టులకు ఇదో ఆటవిడుపు..