G7 Summit: జీ7 సదస్సులో ఆసక్తికర సన్నివేశం.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రధాని మోదీ షేక్ హ్యాండ్..

జపాన్‌లోని హిరోషిమాలో జరుగుతున్న గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ7) శిఖరాగ్ర సదస్సు కోసం టోక్యోలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని కలిశారు. 2022 ఫిబ్రవరి 24న తూర్పు ఐరోపా దేశమైన ఉక్రెయిన్‌పై రష్యా సైనిక ఆపరేషన్...

G7 Summit: జీ7 సదస్సులో ఆసక్తికర సన్నివేశం.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రధాని మోదీ షేక్ హ్యాండ్..
Pm Modi And Zelensky

Updated on: May 20, 2023 | 5:15 PM

జపాన్‌లోని హిరోషిమాలో జరుగుతున్న గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ7) శిఖరాగ్ర సదస్సు కోసం టోక్యోలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని కలిశారు. 2022 ఫిబ్రవరి 24న తూర్పు ఐరోపా దేశమైన ఉక్రెయిన్‌పై రష్యా సైనిక ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఇరు దేశాల అధినేతలు కలుసుకోవడం ఇదే తొలిసారి. వీరిద్దరి భేటీకి సంబంధించిన వివరాలను భారత ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసింది. వీరి భేటీ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. ఒకటిన్నర సంవత్సరాలుగా తాము ఫోన్‌లో మాట్లాడుకున్నామని, ఇప్పుడు కలిసే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొత్తం ప్రపంచానికి సమస్యగా మారిందన్నారు. ఇది ప్రపంచంపై అనేక రకాలుగా ప్రభావం చూపుతోందన్నారు.

‘దీనిని రాజకీయ, ఆర్థిక సమస్యగా చూడటం లేదు. మానవత్వానికి సంబంధించిన సమస్య. మానవ విలువలకు సంబంధించిన సమస్య.’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘యుద్ధం వలన కలిగే బాధలు ఏంటో మాకన్నా మీకే ఎక్కువగా తెలుసు. గత సంవత్సరం మా విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చినప్పుడు వారు తెలిపిన వివరాలు, అక్కడి పరిస్థితుల గురించి వారు చెప్పిన అంశాలు చూస్తే ఉక్రేనియన్లు అనుభవించిన బాధలను అర్థం చేసుకోగలను. భారత్ తరఫున, నా వ్యక్తిగత సామర్థ్యం మేరకు ఈ సమస్యకు పరిష్కారం కోసం చేయాల్సినదంతా చేస్తాను.’ అని జెలెన్‌స్కీకి భరోసా ఇచ్చారు ప్రధాని మోదీ.

ఇవి కూడా చదవండి

జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదా ఆహ్వానం మేరకు జపాన్ ప్రెసిడెన్సీలో జరుగుతున్న జీ7 సమ్మిట్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. అదే సమయంలో జపాన్ ఆహ్వానం మేరకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ కూడా సమ్మిట్‌ కోసం వచ్చారు.

అయితే, ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి భారత ప్రధాని మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో అనేకసార్లు ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. గత ఏడాది అక్టోబర్ 4న జెలెన్‌స్కీతో టెలిఫోన్ సంభాషణలో.. ‘సైనిక చర్యలు పరిష్కారం చూపవు. ఎలాంటి సమస్యకైనా శాంతిపూర్వక చర్చలే పరిష్కారం చూపుతాయని, శాంతి ప్రయత్నాలకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉంది.’ అని చెప్పారు ప్రధాని మోదీ.

ఇదిలాఉంటే.. జీ7 అధ్యక్షుడి స్థానంలో జపాన్ ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. మే 19 నుంచి మే 21 వరకు జీ7 శిఖరాగ్ర సదస్సు జరుగనుండగా.. ఈ సదస్సు పూర్తయ్యేంత వరకు ప్రధాని మోదీ హిరోషిమాలోనే ఉండనున్నారు. ఈ సదస్సులో ఆహారం, ఎరువు, ఇంధన భద్రత సహా ప్రపంచ సవాళ్లపై ఆయన ప్రసంగించనున్నారు. కాగా, ఇవాళ ఉదయం హిరోషిమాలో జీ7 సమ్మిట్ వర్కింగ్ సెషన్‌లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోదీకి.. జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా అపూర్వ స్వాగతం పలికారు.

ఇకపోతే.. జీ7 సమ్మిట్‌కు ఒక రోజు ముందే జపాన్‌ చేరుకున్న ప్రధాని మోదీ.. ఇవాళ ఉదయం ఆ దేశ ప్రధాని ఫ్యూమియో కిషిదాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్-జపాన్ మధ్య సంబంధాల బలోపేతం, వ్యాపార, వాణిజ్య భాగస్వామ్యంపై కీలక చర్చలు జరిపారు.

జీ7 గ్రూప్‌లో యూఎస్, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ దేశాలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ఈ గ్రూప్‌కు అధ్యక్షత వహిస్తున్న జపాన్.. భారత్ సహా మరో ఏడు కీలక దేశాలను ఆహ్వానించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..