ఇప్పటికే భారతదేశంలోని 40 ప్రదేశాలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలుగా ఉన్నాయి. వీటికి తోడుగా ఇటీవల ధోలవీర, రామప్ప దేవాలయం సాంస్కృతికం(Cultural) కేటగిరీ కింద ఈ జాబితాలో చేరాయి. అయితే ప్రస్తుతం యునెస్కో తాత్కాలిక జాబితాలో మరో మూడు ప్రాంతాలు చేరాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మించిన గుజరాత్‌లోని వాద్‌నగర్‌తో పాటు మోధేరాలోని సన్ టెంపుల్, త్రిపురలోని ఉనకోటి రాతిశిల్పాలు కూడా ఈ జాబితాలో చేరాయి. యునెస్కో తాత్కాలిక జాబితా అనేది ప్రపంచ వారసత్వ సంపదలుగా గుర్తించాలని వివిధ దేశాలు అందజేసిన నామినేషన్‌లు లేదా ప్రతిపాదనలు.
అయితే ఈ మూడు ప్రదేశాలు యునెస్కో తాత్కాలిక జాబితాలో చేరినట్లు కేందద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఒక ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఇప్పటికి యునెస్కో తాత్కాలిక జాబితాలో భారతదేశ సాంస్కృతిక, సహజ సంపద గొప్పదనాన్ని సూచిస్తుందని, మన వారసత్వంలోని వైవిధ్యాన్ని చూపుతుందని అన్నారు. ప్రధాని మోదీ డైనమిక్ విజన్, నాయకత్వంతో ప్రపంచ వారసత్వ జాబితాలో మరిన్ని ప్రదేశాలను చేర్చడానికి భారత్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రపంచ వారసత్వానికి నామినేట్ చేయడానికి మరిన్ని స్మారక చిహ్నాలు, ప్రదేశాలను గుర్తించడంలో ASI(భారత పురావస్తు సర్వే) కృషిని అభినందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
Congratulations India!
India adds 3 more sites to @UNESCO’s Tentative List:
01 Vadnagar- A multi-layered Historic town, Gujarat
02 Sun Temple, Modhera and its adjoining monuments
03 Rock-cut Sculptures and Reliefs of the Unakoti, Unakoti Range, Unakoti District pic.twitter.com/CAarM4BfnE
— G Kishan Reddy (@kishanreddybjp) December 20, 2022
ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం మోధేరా సూర్య దేవాలయం 1026-27 CEలో చాళుక్య వంశానికి చెందిన మొదటి భీముడి పాలనలో నిర్మించారు. సోలంకి శైలిలో కట్టిన ఈ దేవాలయంలో వివిధ దేవతలకు సంబంధించిన 108 మందిరాలు ఉన్నాయి. సూర్యుడికి అంకితం చేసిన ఈ ఆలయంలో వినాయకుడు, విష్ణువు, తాండవిస్తున్న శివుడి విగ్రహాలను కూడా చూడవచ్చు.
వాద్‌నగర్ గుజరాత్‌లోని మెహసానా జిల్లా పరిధిలోని ఒక మున్సిపాలిటీ. చారిత్రాత్మక పట్టణమైన వాద్‌నగర్‌కు 8 శతాబ్దం నాటి నుంచి చరిత్ర ఉంది. ఈ పట్టణంలో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో చారిత్రాత్మక భవనాలు కనిపిస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ పట్టణంలోనే జన్మించారు. ఆయన బాల్యం అక్కడే గడిచింది.
త్రిపురలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఉనకోటి, శైవ ఆరాధనతో ముడిపడి ఉన్న పురాతన పవిత్ర ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకమైన శైలిలో అనేక ఎత్తైన లో రిలీఫ్ ఇమేజెస్‌ను ప్రదర్శిస్తుంది. ఇది మానవ సృజనాత్మక శక్తిని చూపించే కళాఖండంగా మారింది. ఈ ప్రాంతంలో దాదాపు కోటి విగ్రహాలు ఉండగా అవి 30 నుంచి 50 అడుగుల ఎత్తు ఉంటాయి.
గతేడాది భారతదేశంలోని ఆరు ప్రదేశాలను యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చే ప్రతిపాదనను కేంద్రప్రభుత్వం చేసింది. వాటిలో సాత్పురా టైగర్ రిజర్వ్, చారిత్రాత్మక నగరం వారణాసి ఐకానిక్ రివర్ ఫ్రంట్, హైర్ బెంకల్‌లోని మెగాలిథిక్ సైట్, మహారాష్ట్రలోని మరాఠా మిలిటరీ ఆర్కిటెక్చర్, నర్మదా వ్యాలీ-జబల్‌పూర్‌లోని భేదాఘాట్-లామెటాఘాట్, కాంచీపురంలోని దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ఏదైనా తాత్కాలిక జాబితాలో చేరినప్పటికీ.. అది యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందాలని లేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.