PM Kisan Yojana: ఈ రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తించదు..
PM Kisan Yojana: గత మే నెలలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్) పథకం కింద లబ్ధిదారులైన రైతులకు 11వ విడత ఆర్థిక..

PM Kisan Yojana: గత మే నెలలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్) పథకం కింద లబ్ధిదారులైన రైతులకు 11వ విడత ఆర్థిక సహాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన విషయం తెలిసిందే. 10 కోట్లకు పైగా లబ్ధిదారుల రైతు కుటుంబాలకు రూ. 2000 చొప్పున సుమారు రూ. 21,000 కోట్లు విడుదల చేశారు. రైతు ఆధార్ కార్డుతో అనుసంధానించబడిన బ్యాంకు ఖాతాలో ఈ నిధులు జమ అవుతాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి సంవత్సరం రైతులకు 6000 రూపాయల వార్షిక నగదు బదిలీని మూడు విడతలుగా పంపిణీ చేస్తారు. మొదటి విడత ఏప్రిల్-జూలై మధ్య, రెండో విడత ఆగస్టు-నవంబర్ మధ్య, మూడో విడత డిసెంబర్-మార్చి మధ్య.
అయితే, కిసాన్ సమ్మాన్ పథకం అందరికీ వర్తించదు. ఈ పతకానికి సంబంధించి రూల్స్ తెలియక చాలా మంది రైతులు తమ అకౌంట్లలో డబ్బులు పడలేదని వాపోతుంటారు. ఈ నేపథ్యంలో కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులకు ఎవరు అర్హులు కాదు, ఎవరికి ఆ డబ్బులు రావో ఇప్పుడు తెలుసుకుందాం..
చిన్న రైతు కుటుంబాలకే పథకం.. PM-కిసాన్ పథకం(ఫిబ్రవరి, 2019) ప్రారంభించబడినప్పుడు దాని ప్రయోజనాలు 2 హెక్టార్ల వరకు ఉమ్మడి భూమి ఉన్న చిన్న, సూక్ష్మ రైతు కుటుంబాలకే పరిమితం చేయబడింది. ఆ తరువాత ఈ పథకాన్ని జూన్ 2019లో సవరించడం జరిగింది. భూముల పరిమాణంతో సంబంధం లేకుండా అన్ని రైతు కుటుంబాలకు ఈ పతకాన్ని వర్తింపజేయడం జరిగింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశంలోని మొత్తం 14.5 కోట్ల మంది రైతులకు వారి భూమి పరిమాణంతో సంబంధం లేకుండా సంవత్సరానికి 6,000 రూపాయల ప్రయోజనాన్ని వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని నోటిఫై చేసింది.
PM-కిసాన్ పథకం వీరికి వర్తించదు.. సంస్థాగత భూస్వాములు, రాజ్యాంగ పదవులు కలిగి ఉన్న రైతు కుటుంబాలు, పదవీ విరమణ పొందిన అధికారులు, రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థల ఉద్యోగులు PM-కిసాన్ పథకానికి అర్హులు కాదు. అలాగే, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు వంటి నిపుణులు, నెలవారీగా రూ. 10,000 కంటే ఎక్కువ పెన్షన్ ఉన్న రిటైర్డ్ పెన్షనర్లు, గత అసెస్‌మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వారు కూడా ఈ పతకానికి అర్హులు కాదు.
