AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ వార్డుకు తల్లిదండ్రులకు కూడా అనుమతి.. కేంద్రం కొత్త గైడ్ లైన్స్

కరోనా సోకిన పిల్లల్లో మానసిక స్థైర్యం నింపేందుకు వారి వద్దకు తల్లదండ్రులను కూడా అనుమతించాలని కేంద్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. తల్లిదండ్రులను కొన్ని షరతుల మేరకు అనుమతించవచ్చని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ స్పష్టం చేసింది.

ఆ వార్డుకు తల్లిదండ్రులకు కూడా అనుమతి.. కేంద్రం కొత్త గైడ్ లైన్స్
Balaraju Goud
|

Updated on: Sep 03, 2020 | 7:19 AM

Share

కరోనా సోకిన పిల్లల్లో మానసిక స్థైర్యం నింపేందుకు వారి వద్దకు తల్లదండ్రులను కూడా అనుమతించాలని కేంద్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. తల్లిదండ్రులను కొన్ని షరతుల మేరకు అనుమతించవచ్చని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ స్పష్టం చేసింది. పిల్లలతో కలసి ఉంటే వైరస్‌ వ్యాప్తికి గల ప్రమాదాలను తల్లిదండ్రులకు వివరించాలని, వారి అంగీకారం తీసుకున్నాక వార్డుల్లో ఉండేందుకు అనుమతినివ్వాలని తెలిపింది. ఈ మేరకు వివిధ అంశాలపై స్పష్టతనిస్తూ బుధవారం మార్గదర్శకాలు జారీచేసింది.

ఇక పెద్దలు ఎవరైనా ఆసుపత్రుల్లో కరోనాతో బాధపడుతుంటే, వారి వద్దకు బంధువులు, కుటుంబ సభ్యులను ఏమాత్రం అనుమతిం చొద్దని స్పష్టంచేసింది. అలా వెళ్లనిస్తే వారికి వ్యాధి సోకి, తద్వారా ఇతరులకూ వ్యాప్తి చెందే ప్రమాదముందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని ఆసుపత్రులు కరోనా రోగులుండే వార్డుల్లోకి బంధువులు, కుటుంబ సభ్యులను అనుమతిస్తున్నాయి. దీనివల్ల వైరస్‌ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం.

కరోనా తీవ్రత ఉన్న రోగులకు ప్రారంభ దశలోనే ప్లాస్మా చికిత్స చేయాలని కేంద్రం స్పష్టంచేసింది. అయితే, దీన్ని జాగ్రత్తగా చేయాలని పేర్కొంది. దీన్ని ప్రయోగాత్మక చికిత్సగా కూడా పరిగణించాలని వెల్లడించింది. అలాగే మానసిక ఒత్తిడికి లోనవుతున్న కరోనా రోగులకు మానసిక వైద్యుల సలహా అందించాలని అధికారులు వివరించారు.

ఇతర అంశాలపైనా కేంద్రం మార్గదర్శకాలు..

► వైద్య సిబ్బందిలో రోగ నిరోధక శక్తి కోసం కొన్ని పరిమితుల్లో హైడ్రాక్సిక్లోరోక్విన్‌ మాత్రలను వాడొచ్చు. ► అలాగే కరోనా నుంచి రక్షించడానికి పీపీఈ కిట్లను సరైన పద్ధతుల్లో వాడాలి. ఇతర ఇన్ఫెక్షన్‌ నియంత్రణ పద్ధతులను ఉపయోగించాలి. ► కరోనాలో కొన్ని ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి. కొన్నిసార్లు గుండెపోటు వంటివి వస్తున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువున్న రోగులను దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు, ఇతరత్రా అనారోగ్య సమస్యలుంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వీటన్నింటినీ గమనించకుండా కరోనా రోగులను డిశ్చార్జి చేయడానికి అనుమతించకూడదు. ► కార్టికోస్టెరాయిడ్స్‌ ప్రస్తుతం మధ్యస్థం నుంచి తీవ్రమైన కరోనా రోగులకు వాడొచ్చు. ► టోసిలిజుమాబ్‌ మందును డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆమోదించింది. అయినప్పటికీ ఇది ఒక ప్రయోగాత్మక చికిత్సనే. దీనివల్ల ప్రయోజనం అంతంతే. ఇన్ఫెక్షన్లు పెద్దగా లేని సైటోకిన్‌ సిండ్రోమ్‌ ఉన్న రోగుల్లో మాత్రమే వాడాలి. ► ఫావిపిరావిర్‌ను ప్రధానంగా తేలికపాటి లేదా లక్షణాలు లేని వారికి ఉపయోగిస్తున్నారు. దీని వాడకంపై జాతీయ మార్గదర్శకాల్లో ఎక్కడా సిఫార్సు చేయలేదు. ► రెమిడెసివిర్‌ కూడా ప్రయోగాత్మక చికిత్సే. వైరస్‌ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని డీసీజీఐ ఆమోదించింది. అందువల్ల అనుమానాస్పద కరోనా కేసులకు వీటిని వాడకూడదు. అవసరమని వైద్యులు భావించిన కరోనా రోగుల్లో మాత్రమే ఉపయోగించాలి.