Parliament Special session Live: ఎంపీలు అందరినీ అత్యవసరంగా ఢిల్లీకి రప్పించిన బీజేపీ

భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది పలుకుతూ, కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ బిల్లులు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనానికి, చర్చకు దారితీశాయి.

Parliament Special session Live: ఎంపీలు అందరినీ అత్యవసరంగా ఢిల్లీకి రప్పించిన బీజేపీ
Parliament Special Session Live

Updated on: Apr 17, 2026 | 4:16 PM

LIVE NEWS & UPDATES

  • 17 Apr 2026 04:16 PM (IST)

    సా. 5 గంటలకు లోక్‌సభలో అమిత్ షా ప్రసంగం

    మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ తుది దశకు చేరుకుంది. ఈ బిల్లుపై లోక్‌సభలో కాంగ్రెస్ – ఎన్డీయే పక్షాల మధ్య వాడీ వేడి చర్చ కొనసాగుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సాయంత్రం 6 గంటలకు లోక్‌సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 6:30 గంటలకు ఓటింగ్ జరిగే అవకాశం ఉంది.

  • 17 Apr 2026 04:04 PM (IST)

    కీలక దశకు చేరుకున్న మహిళా బిల్లు

    పార్లమెంట్ భవనానికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

    పార్లమెంటు సభ్యులకు 3 లైన్ల విప్ జారీ చేసిన బీజేపీ

    ఎంపీలు సభకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశం

    బెంగాల్, తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉన్నవారిని సైతం ఢిల్లీకి రప్పించిన పార్టీ అధిష్టానం

  • 17 Apr 2026 03:49 PM (IST)

    కుల గణనను వ్యతిరేకిస్తున్నది కాంగ్రెస్ః దుబే

    కుల గణనను వ్యతిరేకిస్తున్నది ఈ నాయకులేనని చెబుతూ నిషికాంత్ దుబే కాంగ్రెస్ పార్టీపై ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకుల గత ప్రకటనలను ప్రస్తావిస్తూ, “కుల గణన రాజ్యాంగ పరిధిలోకి రాదని సోనియా గాంధీ అన్నారు. కుల గణన దేశాన్ని విభజిస్తుందని చిదంబరం అన్నారు” అని ఆయన గుర్తు చేశారు. “2011లో సోనియా, చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ, మన్మోహన్ సింగ్ కుల గణనను వ్యతిరేకించారు. ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్‌ల కృషి ఫలితంగా కుల గణన జరిగింది, కానీ ఆ డేటా విడుదల కాలేదు. బీజేపీ ప్రభుత్వం కుల గణనను నిర్వహిస్తోంది, దాని ఫలితాలను వచ్చే ఒకటి రెండు సంవత్సరాలలో విడుదల చేస్తాము.” అని నిషికాంత్ తెలిపారు.

  • 17 Apr 2026 03:38 PM (IST)

    రాహుల్ గాంధీపై నిషికాంత్ దుబే వ్యంగ్యాస్త్రాలు

    బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే మాట్లాడుతూ, “మేము తెల్లవారుజామున 1:30 వరకు ఇక్కడే ఉన్నాము. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు, ప్రతిపక్ష నాయకుడి నుండి తల్లులు, అమ్మల గురించి వింటానని అనుకున్నాను, కానీ నేను ఇప్పుడే మైఖేల్ జాక్సన్ డ్యాన్స్ చూసినట్లు అనిపించింది.” అన్నారు. “ఈ దేశంలో అత్యంత బలమైన వ్యాపార కుటుంబం ఏదైనా ఉందంటే అది టాటా కుటుంబమే. టాటాలు మైనారిటీ వర్గానికి చెందినవారని రాహుల్ గాంధీకి కూడా తెలియదు. వేదాంత యజమాని అనిల్ అగర్వాల్ కూడా ఓబీసీనే.” అని నిషికాంత్ గుర్తు చేశారు.

  • 17 Apr 2026 03:32 PM (IST)

    దేశ సైనికులను రాహుల్ అపహాస్యం చేశారు: కిరణ్ రిజిజు

    “రాహుల్ గాంధీ ధైర్యవంతులైన సైనికులను అపహాస్యం చేశారు. వారిని మాయాజాలం చేసేవారని అంటున్నారు. ఇది ప్రధానిని అపహాస్యం చేయడం కాదు, దేశాన్ని అపహాస్యం చేయడం. ప్రతిపక్ష నాయకులు అన్న విషయం రాహుల్ మరిచిపోయి మాట్లాడుతున్నారు. సొంత నాయకులే ఇలా ప్రవర్తిస్తే మీ కొత్త ఎంపీలు ఏం నేర్చుకుంటారు?” అని కిరణ్ రిజిజు ప్రశ్నించారు.

  • 17 Apr 2026 03:30 PM (IST)

    రాహుల్ దేశ ప్రజలను అవమానిస్తున్నారుః రాజ్‌నాథ్

    రాహుల్ గాంధీ ప్రకటన లోక్‌సభలో దుమారం రేపింది. రాహుల్ వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “ప్రధానమంత్రిని ఉద్దేశించి ఆ పదాలను ఉపయోగించిన తీరు సిగ్గుచేటు. ఆయన ఒక వ్యక్తిని అవమానించడం లేదు, ఆయనను మాంత్రికుడు అని పిలవడం ద్వారా దేశ ప్రజలను అవమానిస్తున్నారు” అని అన్నారు.

  • 17 Apr 2026 03:28 PM (IST)

    బాలాకోట్ ఒక రహస్యంః రాహుల్

    “బాలాకోట్ మాంత్రికుడి రహస్యం బయటపడింది” అని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోదీని ఎద్దేవా చేశారు.

  • 17 Apr 2026 03:27 PM (IST)

    ‘ఈ బిల్లు ఎప్పటికీ ఆమోదం పొందదు’: రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడుతూ, ‘ఈ బిల్లు ఎప్పటికీ ఆమోదం పొందదని బీజేపీకి తెలుసు, ఇది ఒక ఆతురతతో తీసుకున్న చర్య. ప్రధాని ఎలాగైనా రెండు సందేశాలు ఇవ్వాలనుకున్నారు. మొదటిది, ఆయన భారతదేశ ఎన్నికల పటాన్ని మార్చాలనుకుంటున్నారు, రెండవది, ఆయన మహిళా అనుకూలుడు’ అని రాహుల్ అన్నారు.

  • 17 Apr 2026 03:24 PM (IST)

    కేంద్రంపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు

    కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, మోదీ ప్రభుత్వం దళితులను హిందువులని, వెనుకబడిన తరగతులను హిందువులని పిలుస్తుంది, కానీ వారికి హక్కులు ఇవ్వడం లేదని రాహుల్ గాంధీ లోక్‌సభలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలపై అధికారపక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

  • 17 Apr 2026 03:04 PM (IST)

    రాహుల్ గాంధీని ప్రశ్నించిన కిరణ్ రిజిజు

    పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు.. ప్రతిపక్షనేత రాహుల్ గాంధీని కీలక ప్రశ్నలు అడిగారు. “కాంగ్రెస్ ఎందుకు ఓబీసీల కోసం ఎప్పుడూ పనిచేయలేదు? రాజీవ్ గాంధీ ఓబీసీ రిజర్వేషన్లను ఎందుకు వ్యతిరేకించారు? రాహుల్ గాంధీ సమాధానం చెప్పగలరా?” అని లోక్‌సభలో నిలదీశారు.

  • 17 Apr 2026 03:03 PM (IST)

    ‘ఈ బిల్లుకు మహిళలతో ఎలాంటి సంబంధం లేదు’: రాహుల్

    లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “ఈ బిల్లుకు మహిళలతో ఎలాంటి సంబంధం లేదు. ఇది దళితులకు, వెనుకబడిన తరగతులకు వ్యతిరేకం. దేశ ఎన్నికల పటాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతామనే భయంతో ఉంది. అధికారాన్ని చేజిక్కించుకోవడానికే ఇది చేస్తున్నారు; ప్రభుత్వాన్ని ఇలా చేయనివ్వం.” అని రాహుల్ తేల్చి చెప్పారు.

  • 17 Apr 2026 03:00 PM (IST)

    అమిత్‌షా అధ్యక్షతన కీలక సమావేశం

    డీలిమిటేషన్ బిల్లులో మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

    సీనియర్‌ మంత్రులతో అమిత్‌షా చర్చలు జరుపుతున్నారు.

    కొత్త రూపంలో బిల్లును తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

    మరో అరగంటలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

    మరోవైపు సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ ‌యాదవ్‌తో కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు సమావేశం అయ్యారు.

  • 17 Apr 2026 02:59 PM (IST)

    డీలిమిటేషన్‌ను అడ్డుకుంటాం-ఖర్గే

    డీలిమిటేషన్‌ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామన్నారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే. బిల్లుకు వ్యతిరేకంగా లోక్‌సభలో తమ ఎంపీలు ఓటేస్తారని తెలిపారు. డీలిమిటేషన్‌ బిల్లు రాజ్యాంగ విరుద్దమన్నారు ఖర్గే.

  • 17 Apr 2026 02:59 PM (IST)

    ప్రధాని పదవి మహిళలకు ఇవ్వండిః TMC

    * దేశంలో నాలుగుసార్లు డీలిమిటేషన్ జరిగింది -TMC ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ

    * ప్రతిసారి జనగణన తర్వాతే డీలిమిటేషన్ జరిగింది -TMC ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ

    * కానీ ఇప్పుడు మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన అంటున్నారు

    * 15 ఏళ్ల కిందటి లెక్కలతో దేశ ప్రజలకు ఎలా న్యాయం చేస్తారు? -కల్యాణ్ బెనర్జీ

    * కేంద్ర మంత్రివర్గంలోనూ 50శాతం రిజర్వేషన్ కల్పించండి

    — ప్రధాని పదవి కూడా మహిళలకు ఇవ్వండి -TMC ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ

  • 17 Apr 2026 02:54 PM (IST)

    ఎంపీలకు భావోద్వేగ విజ్ఞప్తి

    ప్రధానమంత్రి నారీ శక్తి ప్రాధాన్యతను వివరిస్తూ ఎంపీలకు భావోద్వేగ విజ్ఞప్తి చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి చరిత్ర సృష్టించాలని కోరారు. మహిళలను గౌరవించడం, వారికి సమాన అవకాశాలు కల్పించడం ద్వారానే దేశ ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని ఆయన ఉద్ఘాటించారు. దేశ జనాభాలో సగభాగమైన మహిళలకు వారి హక్కులు అందించడం మనందరి బాధ్యతని గుర్తుచేశారు.

  • 17 Apr 2026 02:51 PM (IST)

    భారతీయ మహిళల హక్కులు కాపాడుదాంః ప్రధాని

    నారీ శక్తి వందన్ చట్టంపై పార్లమెంటులో జరుగుతున్న చర్చల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల అంశంపై జరుగుతున్న రాజకీయాలకు స్వస్తి పలకాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ జనాభాలో సగం మంది ఉన్న మహిళలకు నిర్ణయాధికారంలో తగిన ప్రాతినిధ్యం లేకపోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. లోక్‌సభలో ఓటింగ్ జరగనున్న తరుణంలో, రాజకీయాలకు అతీతంగా అత్యంత సున్నితత్వంతో ఆలోచించి, ఈ చట్టానికి మద్దతుగా ఓటు వేయాలని అన్ని పార్టీలను ప్రధాని కోరారు. భారతీయ మహిళలకు వారి హక్కులు కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.

  • 17 Apr 2026 02:50 PM (IST)

    ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా Xలో పోస్ట్ చేస్తూ, “నారీ శక్తి వందన్ చట్టానికి సవరణలపై పార్లమెంటు ప్రస్తుతం చర్చిస్తోంది. ఈ చర్చ గురువారం రాత్రి 1 గంట వరకు కొనసాగింది. వ్యాపించిన అపోహలను తొలగించడానికి సునిశ్చితమైన సమాధానం ఇవ్వడం జరిగింది. ప్రతి సందేహానికి నివృత్తి చేయడం జరిగింది. ప్రతి సభ్యునికి వారికి తెలియని సమాచారం అందించాము. వారికి ఉన్న ఏవైనా ఆందోళనలను కూడా పరిష్కరించాము.” అని రాశారు.

భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది పలుకుతూ, కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ బిల్లులు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనానికి, చర్చకు దారితీశాయి.

ప్రభుత్వం ప్రధానంగా 2029 నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుబంధంగా, లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుండి 850కి పెంచాలని ప్రతిపాదించింది. ఈ ప్రక్రియను సాకారం చేసేందుకు ప్రభుత్వం మూడు వేర్వేరు బిల్లులను ముందుకు తెచ్చింది.

1. మహిళా రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం రాజ్యాంగ 131వ సవరణ బిల్లు, 2026.

2. డీలిమిటేషన్ బిల్లు, 2026: నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు కోసం నిర్థేశించింది.

3. కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2026: యూటీలలో మార్పుల కోసం తీసుకువస్తున్న సవరణ.

2029 లో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలుకు గట్టిగా మద్దతు ఇస్తూ, నియోజకవర్గాల పునర్విభజనలో ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపబోమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందితే భారతదేశంలో ప్రజాస్వామ్యం కొత్త శిఖరాలకు చేరుతుందన్నారు. అయితే ఈ బిల్లులు చట్ట రూపం దాల్చాలంటే పార్లమెంటులో రెండింట మూడొంతుల మెజారిటీ అవసరం. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ప్రతిపక్ష వర్గాల లెక్కల ప్రకారం, ఈ బిల్లులను ఆమోదించడానికి కనీసం 345 మంది ఎంపీల మద్దతు అవసరం. అయితే, ప్రస్తుత ప్రభుత్వ బలం 302 వద్దే నిలిచిపోయింది. “సంఖ్యాబలం లేని ఈ సమయంలో ఇటువంటి కీలక బిల్లులను తీసుకురావడం కేవలం రాజకీయ వ్యూహమే తప్ప, అమలు చేసే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు” అని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ బిల్లుల అమలు జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజనపై ఆధారపడి ఉంటుంది. ఒకవైపు మహిళా సాధికారతకు ఇది పెద్ద పీట వేస్తుందని మద్దతుదారులు అంటుంటే, మరోవైపు దక్షిణాది రాష్ట్రాలు తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేస్తే సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గదని హోం మంత్రి అమిత్ షా లోక్ సభకు హామీ ఇచ్చారు. ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో లోక్ సభ స్థానాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 129 నుండి 195 కి పెరుగుతామని, శాతం వాటా 23.76 శాతం నుండి 23.87 శాతానికి పెరుగుతుందని ఆయన చెప్పారు.

ప్రభుత్వానికి అవసరమైన ఆ 43 మంది ఎంపీల మద్దతు ఎక్కడి నుండి వస్తుంది? ఇతర పార్టీలు దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వానికి మద్దతు ఇస్తాయా లేక ఈ బిల్లులు పార్లమెంటులోనే ఆగిపోతాయా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏదేమైనా, రాబోయే రోజుల్లో పార్లమెంట్ వేదికగా ఒక పెద్ద రాజకీయ యుద్ధం జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

https://youtu.be/d1jcNmN08ZM

Follow Us