Mutton Biryani: మటన్ బిర్యానీ సగం తిన్నాక షాకింగ్ సీన్.. కస్టమర్‌కు భారీ పరిహారం..!
మటన్ బిర్యానీలో చనిపోయిన జెర్రి కనిపించడంతో కస్టమర్ షాక్‌కు గురైయ్యాడు. దీనిపై న్యాయం కోసం చెన్నై వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు సంచలన తీర్పునిచ్చింది. హోటల్ నిర్లక్ష్యానికి గానూ సదరు కస్టమర్‌కు రూ.1.05 లక్షల భారీ పరిహారం చెల్లించాలని సదరు బిర్యానీ రెస్టారెంట్‌ను ఆదేశించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి...

తమిళనాడు రాజధాని చెన్నైలో ఒక ప్రముఖ బిర్యానీ హోటల్‌కు వినియోగదారుల కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. తాము ఆర్డర్ చేసిన మటన్ బిర్యానీలో చనిపోయిన జెర్రి రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఒక కస్టమర్‌కు రూ. 1.05 లక్షలు పరిహారంగా చెల్లించాలని చెన్నై జిల్లా వినియోగదారుల కోర్టు సదరు హోటల్‌ను ఆదేశించింది.
అసలేం జరిగిందంటే?
చెన్నైకి చెందిన ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న ఒక ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్ నుండి మటన్ బిర్యానీని ఆర్డర్ చేశాడు. ఎంతో ఇష్టంగా బిర్యానీ తినడం ప్రారంభించాడు. సగం తిన్నాక అందులో జెర్రి కనిపించడంతో షాక్‌కు గురైయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని సదరు హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా, వారు సరిగ్గా స్పందించకపోవడంతో అసహనానికి గురైయ్యాడు. హోటల్ సిబ్బంది తీరుతో విసిగిపోయిన సదరు కస్టమర్.. చెన్నై కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయడమే కాకుండా.. తనకు న్యాయం చేయాలంటూ చెన్నై జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్ (వినియోగదారుల కోర్టు)ను ఆశ్రయించాడు.
వినియోగదారుల కోర్టు విచారణ
ఈ కేసును విచారించిన వినియోగదారుల కోర్టు.. హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఆహార పదార్థాల తయారీలో ఇలాంటి పరిశుభ్రత లోపాలు ఉండటం క్షమించరాని నేరమని పేర్కొంది. కస్టమర్‌కు సరైన సేవలు అందించడంలో విఫలమవడమే కాకుండా, అతనికి కలిగించిన మానసిక క్షోభకు గానూ సదరు హోటల్‌కు జరిమానా విధించింది. బాధితునికి కలిగిన మానసిక వేదన, అసౌకర్యానికి పరిహారంగా రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు), కోర్టు ఖర్చుల కింద మరో రూ.5,000..మొత్తం రూ. 1.05 లక్షలను నిర్ణీత గడువులోగా సదరు వినియోగదారునికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
హోటళ్లు లేదా రెస్టారెంట్లలో ఆహార నాణ్యత లోపిస్తే వినియోగదారులు మౌనంగా ఉండకుండా, వినియోగదారుల హక్కుల చట్టం ప్రకారం వినియోగదారుల కోర్టులను ఆశ్రయిస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం.




