Free Biryani: చికెన్ బిర్యానీలో ఈగ.. కస్టమర్‌కు 10 ప్లేట్ల ఉచిత బిర్యానీ..!
పుదుచ్చేరిలోని ఓ ప్రముఖ హోటల్‌లో చికెన్ బిర్యానీలో చనిపోయిన ఈగ కనిపించడంతో వినియోగదారుడు కోర్టును ఆశ్రయించాడు. విచారణ అనంతరం వినియోగదారుల ఫోరం హోటల్ సేవల్లో లోపం ఉందని తేల్చి రూ.13,000 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా బాధితుడికి వరుసగా ఐదు వారాల పాటు ప్రతి ఆదివారం రెండు ప్లేట్ల చొప్పున మొత్తం 10 ప్లేట్ల చికెన్ బిర్యానీని ఉచితంగా అందించాలని వినూత్న తీర్పు వెలువరించింది.

పుదుచ్చేరిలో జరిగిన ఒక ఆసక్తికరమైన ఘటన ఇది. అక్కడున్న ఒక ప్రముఖ హోటల్ (బిర్యానీ అండ్ కో)లో కస్టమర్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఎంతో ఆశగా తిందామనుకుంటే.. ఆ బిర్యానీలో ఒక చనిపోయిన ఈగ కనిపించింది. దీనిపై సదరు హోటల్ సిబ్బందిని కస్టమర్ ప్రశ్నించినా.. వారి దగ్గరి నుంచి సరైన సమాధానం రాలేదు. దీనివల్ల తీవ్ర మనస్తాపానికి గురైన ఆ కస్టమర్.. హోటల్ యాజమాన్యం నుంచి నష్టపరిహారం కోరుతూ జిల్లా వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించాడు.
ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన పుదుచ్చేరి జిల్లా వినియోగదారుల ఫోరమ్ న్యాయమూర్తి.. సదరు హోటల్ సేవలలో లోపం ఉన్నట్లు నిర్ధారించి సంచలన తీర్పు ఇచ్చారు. బాధితుడికి నష్టపరిహారంగా రూ.10,000, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.3,000… మొత్తంగా రూ.13,000 చెల్లించాలని హోటల్ యాజమాన్యాన్ని ఆదేశించారు.
10 ఉచిత బిర్యానీలు..
నగదు జరిమానాతో పాటు సదరు హోటల్ యాజమాన్యానికి వినియోగదారుల ఫోరం ఒక వినూత్న శిక్ష కూడా విధించింది. బాధితుడికి రాబోయే 5 వారాల పాటు ప్రతి ఆదివారం రెండు ప్లేట్ల చొప్పున మొత్తంగా 10 ప్లేట్ల చికెన్ బిర్యానీని ఉచితంగా అందించాలని ఫోరం ఆదేశించింది.
వినియోగదారుల ఫోరం గురించి..
వినియోగదారుల ఫోరం కొనుగోలుదారులు మోసపోకుండా వారి హక్కులను కాపాడటానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ. మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు లేదా సేవలు పొందినప్పుడు అందులో నాణ్యతా లోపాలు ఉంటే, సాధారణ కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. తక్కువ ఖర్చుతో వేగంగా న్యాయం పొందడానికి ఈ వినియోగదారుల ఫోరమ్స్‌ను ఆశ్రయించవచ్చు. ఏదైనా వస్తువుపై ఎంఆర్పీ కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసినా.. టీవీ, పేపర్లలో తప్పుడు ప్రకటనలు ఇచ్చి కస్టమర్లను మోసం చేసినా.. వినియోగదారులు న్యాయం కోసం ఫోరంకు ఫిర్యాదు చేయొచ్చు.
వినియోగదారుల ఫోరంలో కేసుల కోసం వినియోగదారులు ప్రత్యేకంగా లాయర్‌ను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బాధితుడే స్వయంగా లేదా ఒక తెల్ల కాగితంపై సమస్యను రాసి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసేటప్పుడు సదరు వస్తువు కొనుగోలు బిల్లు, గ్యారంటీ/వారంటీ కార్డ్‌తో పాటు ఫొటోలు/వీడియోల వంటి ఆధారాలను జత చేయాలి.
హెల్ప్‌లైన్ నంబర్: వినియోగదారుల హక్కులపై ఎలాంటి సందేహాలు ఉన్నా లేదా ప్రాథమిక ఫిర్యాదు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ నంబర్ 1915 కి కాల్ చేయవచ్చు.
