బ్యాంకులో అకౌంట్ తీసుకోవడం నుంచి మొదలుకొని ఆస్తులు కొనాలన్నా, అమ్మాలన్నా పాన్ కార్డు తప్పనిసరి. ఇంకా రూ.50 వేలకు పైబడిన లావాదేవీలకు పాన్ నెంబర్ ఉండాల్సిందే..! అలాంటి ముఖ్యమైన పాన్ కార్డ్ పనిచేయకపోతే ఎలా..? సమాధానం లేదు కదా..! మీరు ఇప్పటికీ మీ ఆధార్ తో పాన్ కార్డును లింక్ చేయకుండా ఉంటే.. అది రద్దయ్యే ప్రమాదం ఉందని ఆదాయపు పన్ను శాఖ(ఐటీ శాఖ) ఎప్పటినుంచో హెచ్చరిస్తోంది. పాన్ కార్డును, ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడానికి ఐటీ శాఖ ఇప్పటికే అనేక అవకాశాలను ఇచ్చింది. అదే క్రమంలో చివరి అవకాశాన్ని కల్పించింది. వచ్చే ఏడాది మార్చి 31 లోగా పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకునేందుకు ఐటీ శాఖ అవకాశమిచ్చింది. ఈలోపు లింక్ చేసుకోవడం తప్పనిసరని. లేకపోతే ఆ తర్వాత లింక్ చేయడం కుదరదని కూడా ఆ శాఖ హెచ్చరిస్తోంది. గడువు తేదీని ఇప్పటికే పలుమార్లు పొడిగించిన నేపథ్యంలో మరోసారి గడువు పొడిగించే ఆలోచనే లేదని తేల్చిచెప్పింది. పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయడమనేది 31 మార్చి 2023 తర్వాత సాధ్యం కాదని, పాన్ కార్డు రద్దయిపోతుందని కూడా స్పష్టం చేసింది.
అయితే, ఈ ఏడాది జూన్ వరకు పాన్ కార్డును ఆధార్ తో ఉచితంగా లింక్ చేసుకోవడానికి ఐటీ శాఖ వెసులుబాటును కల్పించింది. జూన్ తర్వాత ఈ లింక్ కోసం రూ. వెయ్యి చొప్పున వసూలు చేయబోతుంది. వచ్చే ఏడాది మార్చి వరకూ రూ. వెయ్యి చెల్లించి పాన్ కార్డు, ఆధార్ లింక్ చేసుకోవచ్చని ప్రకటించింది.
ఆధార్-పాన్ లింక్ చేయడం ఎలా..?
☛ ముందుగా ఆదాయపు పన్ను వెబ్‌సైట్ కి వెళ్లండి.
☛ ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌ను తెరిచిన తర్వాత ఆధార్ లింక్‌పై క్లిక్ చేయండి. దీని తర్వాత మీ స్క్రీన్‌పై కొత్త పేజీ తెరవబడుతుంది.
☛ ఇప్పుడు ఇక్కడ మీరు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలతో పాటు మీ పేరు, మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
☛ మొత్తం సమాచారాన్ని పూరించిన తర్వాత I Validate my Aadhaar వివరాలను క్లిక్ చేసి కొనసాగించండి.
☛ దీని తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. OTPని నమోదు చేసిన తర్వాత ధృవీకరించుపై క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ తర్వాత మీ ఆధార్-పాన్ లింక్ చేయబడతాయి.