కశ్మీర్ అభివృద్ధికి అతిపెద్ద ఎదురుదెబ్బ.. పహల్గామ్ ఉగ్రదాడిపై ఫరూక్ అబ్దుల్లా కీలక కామెంట్స్..
సరిగ్గా ఏడాది క్రితం పహల్గామ్ బైసారన్ మైదానంలో ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండ యావత్ భారతాన్ని కలచివేసింది. ఆ గాయాల నుండి కాశ్మీర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ క్రమంలో పహల్గామ్ దాడి బాధితులకు మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా నివాళులు అర్పించారు. యుద్ధం వల్ల నష్టం తప్ప ప్రయోజనం ఉండదని.. అంతిమంగా శాంతే గెలవాలని ఆయన అన్నారు.

సరిగ్గా ఏడాది క్రితం..2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని బైసారన్ మైదానంలో ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించారు. లష్కర్ ఎ తైబా మద్దతు గల రెసిస్టెన్స్ ఫ్రంట్ జరిపిన ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లా పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు ఘన నివాళులర్పించారు. గతేడాది జరిగిన ఈ ఘోర ఘటనను కశ్మీర్ అభివృద్ధికి తగిలిన పెద్ద ఎదురుదెబ్బగా అభివర్ణించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడి ప్రాణాలు కోల్పోయిన అమాయక పౌరులు, పర్యాటకుల త్యాగాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల ప్రస్తావనపై అబ్దుల్లా స్పందిస్తూ.. యుద్ధాల వల్ల ప్రయోజనం లేదని తేల్చి చెప్పారు. “ఎన్ని విడతల చర్చలు జరిగినప్పటికీ, చివరికి శాంతే గెలవాలి. శాంతి ద్వారా మాత్రమే ఈ ప్రపంచాన్ని, మానవాళిని కాపాడుకోగలం” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఏడాది కిందట ఏం జరిగింది..?
పహల్గామ్ ఘటనకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం మే నెలలో ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రవాద మూలాలను దెబ్బతీసింది. ఎన్ఐఏ ఛార్జిషీట్‌లో ఈ కుట్ర వెనుక పాకిస్థాన్ హస్తాన్ని బట్టబయలు చేసింది. అయితే ఈ దాడి తర్వాత కశ్మీర్ వెళ్లే యాత్రికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో అక్కడి స్థానిక వ్యాపారులు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొంటున్నారు. గతంలో వీకెండ్స్ వస్తే రూ.50 వేల నుంచి 60వేలు వచ్చేవని కానీ ఇప్పుడు రూ.10వేలు రావడం కూడా గగనమైపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. దాడి తర్వాత కొన్ని ప్రాంతాలను అధికారులు మూసేయగా.. ఆ తర్వాత ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. ఇప్పుడిప్పుడే పహల్గామ్‌లో మళ్లీ పర్యాటకుల సందడి కనిపిస్తోంది.
ప్రఖ్యాత ట్యూలిప్ గార్డెన్‌ను ఈ సీజన్‌లో సుమారు 3 లక్షల మంది సందర్శించడం కాశ్మీర్ పట్ల పర్యాటకులకు ఉన్న నమ్మకానికి నిదర్శనం. పర్యాటకులకు మరింత రక్షణ కల్పించేందుకు జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం కొత్తగా QR కోడ్ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీనివల్ల పర్యాటక సేవలు అందించే ప్రతి ఒక్కరినీ సులభంగా గుర్తుపట్టవచ్చు. “ఇక్కడ భద్రతా ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. ఇది భారతదేశంలో ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్రాంతం” అని పహల్గామ్ సందర్శించిన పర్యాటకులు గర్వంగా చెబుతున్నారు. సైన్యం, పోలీసుల నిరంతర నిఘా పర్యాటకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
