
న్యూఢిల్లీ, జూన్ 19: గత కొన్ని రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపధ్యంలో ఆయా దేశాల్లో ఇరుక్కుపోయిన భారతీయులను వెనక్కి తెప్పించేందుకు భారత సర్కార్ ఆపరేషన్ సింధు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరాన్ నుంచి తొలి విమానంలో 110 మంది స్వదేశీ విద్యార్ధులు భారత్‌కు చేరుకున్నారు.
ఆర్మేనియా రాజధాని యెరవాన్ నుంచి ఈ విద్యార్థులంతా బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఉత్తర ఇరాన్‌లో ఉన్న 110 మంది భారతీయ విద్యార్థులను మొదట ఆర్మేనియాకు తరలించారు. ఆర్మేనియా రాజధాని యెరేవన్ నుంచి ప్రత్యేక విమానంలో వీరిని ఢిల్లీకి తరలించారు. ఇందులో దాదాపు 90 మంది జమ్ముకశ్మీర్‌కు చెందిన వారే ఉండటం విశేషం. ఇక ఇరాన్ నుంచి స్వదేశానికి రావడంతో విద్యార్దులు సంతోషం వ్యక్తం చేశారు.
తాము డ్రోన్లు క్షిపణులను చూశామని, వాటికి భయపడ్డామని విద్యార్దులు తెలిపారు. భారతదేశానికి తిరిగి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి, విదేశాంగ మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్‌లో పరిస్థితుల పట్ల మా తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందారు. కానీ మేము ఇప్పుడు తిరిగి రావడంతో వారు సంతోషంగా ఉన్నారంటూ పేర్కొన్నారు. ఇరాన్‌లోని మిగిలిన భారతీయులను కూడా భారత్‌కు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పరిస్థితి మెరుగుపడిన తర్వాత మళ్లీ ఇరాన్ వెళ్లి, చదువు పూర్తిచేస్తామని విద్యార్దులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.