Viral News: కరోనా మహమ్మారి తర్వాత చాలా కంపెనీలు ఆన్ లైన్ ఇంటర్వ్యూల ద్వారానే ఉద్యోగులను నియమించుకుంటుంది. అలాగే వారితో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించుకుంటోంది. సాధారణంగా ఏదైనా కంపెనీ ఉద్యోగాల కోసం సోషల్ మీడియాలో ప్రకటనలివ్వడం సర్వసాధారణం. ఈమధ్య కాలంలో చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుండటంతో తమ ప్రకటన ఎక్కువ మందికి రీచ్ కావడం కోసం సోషల్ మీడియాను ఓ ప్రసార మాద్యమంగా ఉపయోగించుకుంటున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఇటీవల ప్రత్యక్షమైన ప్రకటన కలకలం రేపుతోంది. పంజాబ్ లో గ్యాంగ్ స్టర్ రిక్రూట్ మెంట్ చేస్తున్నట్లు ఈప్రకటనలో ఉంది. తమ గ్యాంగ్ లో చేరాలనుకునే వారు వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేయాల్సిందిగా.. నెంబర్ జతచేస్తూ ఫేస్ బుక్ ప్రకటన ఇచ్చారు. ఈ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. ఈపోస్టు ఎవరు పెట్టారు అని అధికారులు ఆరా తీస్తే పంజాబ్ లో ఓ గ్యాంగ్ స్టర్ గ్రూప్ ఈపోస్టు పెట్టినట్లు తెలిసింది. దేవేందర్ బాంబిహా పేరిట బాంబిహా గ్యాంగ్‌స్టర్ గ్రూపు ఈపోస్టు క్రియేట్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్ల ఆగడాలు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయి. గ్యాంగ్ స్టర్ల పేరిట బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా గ్యాంగ్ స్టర్ రిక్రూట్ మెంట్ చేపడుతున్నామంటూ వైరల్ అవుతున్న ఈప్రకటన పెను సంచలనం సృష్టిస్తోంది.
ఇటీవల పంజాబ్‌లో ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య అనంతరం పలువురు గ్యాంగ్‌స్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పంజాబ్‌లో ప్రధాన గ్యాంగ్‌స్టర్ గ్రూపులైన లారెన్స్ బిష్ణోయ్, బాంబిహాలకు చెందిన వారు పరస్పరం సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లారెన్స్ బిష్ణోయ్ గ్రూపునకు చెందినట్లుగా భావిస్తున్న సందీప్ బిష్ణోయ్‌ను రాజస్థాన్‌లోని నాగౌర్ కోర్టుకు తరలిస్తుండగా బైక్‌పై వచ్చి కొందరు హత్య చేశారు. దీనికి తామే కారణమని బాంబిహా గ్రూప్ ప్రకటించుకుంది. దీంతో ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ సరైన సమయం కోసం వేచిచూస్తున్నట్లు బాంబిహా గ్రూప్‌నకు పక్కా సమాచారం ఉంది. ఈ క్రమంలో బాంబిహా గ్రూప్ ఫేస్‌బుక్‌లో ప్రకటన చేయడం కలకలం రేపుతోంది. మరోవైపు ప్రముఖ పంజాబ్ గాయకుడు సిద్దూ మూసే వాలా హత్య కేసులో అనుమానితుడు మృతి చెందాడు. అమృత్ సర్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న భక్నా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
జగ్రూప్ సింగ్ రూప, మన్ ప్రీత్ సింగ్ అలియాస్ మన్ను కుసా అనే ఇద్దరు గ్యాంగ్ స్టర్ లను పంజాబ్ పోలీస్ యాంటీ గ్యాంగ్ స్టర్ టాస్క్ ఫోర్స్ తుదముట్టించింది. ఇదే సమయంలో గ్యాంగం స్టర్, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత పంజాబ్ లో గ్యాంగ్ స్టర్ లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నట్లు ప్రకటించినప్పటికి.. గ్యాంగ్ స్టర్ల ఆగడాలు ఆగడంలేదు. తాజాగా రిక్రూట్ మెంట్ కోసం ప్రకటన పోస్టు చేయడం సంచలనం సృష్టిస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..