Corona Refund: కరోనా పేరుతో దేశవ్యాప్తంగా అనేక ప్రైవేటు ఆసుపత్రులు రోగులను దోచుకున్నాయి. కష్టకాలంలో అధిక ఫీజులతో తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. మహారాష్ట్ర (Maharashtra) పుణె (Pune)లో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఆయా ఆస్పత్రులపై ఉక్కుపాదం మోపారు పుణె అధికారులు. అధికంగా వసూలు చేసిన డబ్బులను సేకరించి, రోగులకు రీఫండ్ (Refund) చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పటివరకు 142 మందికి కోటి రూపాయలను రీఫండ్ చేయగలిగింది మహా సర్కార్. కరోనా చికిత్స (Covid Treatment)కోసం వెళితే ప్రైవేటు ఆసుపత్రులు (Private Hospitals) తమని దోచుకుంటున్నాయని రోగులు, వారి కుటుంబాలు అధికారులకు ఫిర్యాదులు చేశాయి. అప్రమత్తమైన యంత్రాంగం ఆయా ఆసుపత్రులకు నోటీసుల జారీ చేసింది. కొవిడ్ చికిత్సకు సంబంధించిన బిల్లులను సైతం ఆడిటింగ్ చేయించింది. కొన్నింట్లో అవకతవకలు కనిపించాయని పూణె మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.
మార్చి 28 వరకు 142మంది రోగులకు కోటి రూపాయలను రీఫండ్ చేయగలిగామని, కొవిడ్ రెండో దశ నుంచి పరిస్థితులను తామే సమీక్షిస్తున్నామని చెబుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు ఇదే విషయంపై నోటీసులు కూడా పంపించామని, పరిస్థితుల్లో మార్పులేనందును షోకాజ్ నోటీసులు జారీ చేశామని అంటున్నారు అధికారులు. స్పందించకపోతే ఆరు నెలల పాటు ఆసుపత్రి లైసెన్స్‌ను సీజ్ చేస్తామని తాజాగా వార్నింగ్ ఇస్తున్నారు. పుణెలోని 20 ఆసుప్రతులు, ప్రజల నుంచి అధికంగా దోచుకుంటున్నట్టు తేలింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను పక్కనపెట్టి, ఇష్టానుసారంగా ప్రజల నుంచి డబ్బులు పోగుచేసుకున్నాయి ఆస్పత్రులు. ఇలా కొన్ని ఆసుపత్రులు బిల్లులను ఏకంగా 5.9 కోట్లుగా చూపించాయి. ఇలా ఎన్నో అక్రమాలు జరిగాయని వివరిస్తున్నారు అధికారులు.
కరోనా కాలంలో ఇలా ఇష్టానుసారంగా అధికంగా డబ్బులు వసూలు చేసిన ఆస్పత్రులపై ప్రభుత్వం కొరఢా ఝులిపిస్తోంది. ముందే కరోనాతో ఇబ్బందులు పడుతున్న జనాలకు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. అడ్డగోలుగా డబ్బులు వసూలు చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు ఆస్పత్రుల యాజమాన్యాలు. ఇలా ఇష్టానుసారంగా డబ్బులను వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
ఇవి కూడా చదవండి: