Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha Train Accident Highlights: ‘బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు’.. ప్రమాదస్థలిని సందర్శించిన మోదీ..

Venkata Chari

| Edited By: Subhash Goud

Updated on: Jun 03, 2023 | 7:57 PM

Coromandel Express Train Accident Highlights: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థికసాయం, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయాలపాలైనవారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించింది.

Odisha Train Accident Highlights: 'బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు'.. ప్రమాదస్థలిని సందర్శించిన మోదీ..
Pm Modi

Odisha Train Accident Live Updates: ఒడిశాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 207మందికి పైగా చేరింది. అదే సమయంలో 900 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జెన అధికారికంగా ప్రకటించారు. ప్రమాదస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయ చర్యల్లో వైమానిక దళం సైతం పాల్గొంటుంది. రెస్క్యూ, ఎయిర్‌లిఫ్ట్ ఆపరేషన్ కోసం వైమానిక దళం సేవలు అందిస్తోంది. కోల్‌కత్తా నుంచి ఘటనా స్థలానికి ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకుని సేవలు అందిస్తోంది. అంబులెన్సులు, వైద్యబృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. గాయపడినవారికి బాలేశ్వర్ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రతపై, సహాయక చర్యలపై సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. సీఎం ఆదేశాలతో సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు.

రైలులో విజయవాడ ప్రయాణికులు..

ఇదిలాఉంటే.. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 120 మంది విజయవాడ ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా షాలిమార్ నుంచి విజయవాడకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం నేపథ్యంలో వారి బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో టోల్ ఫ్రీ నెంబర్‌కు భారీ సంఖ్యలో కాల్స్‌ వస్తున్నాయి. అయితే, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఈ ఉదయం 10కి విజయవాడ చేరాల్సి ఉండగా.. ఇంతలోనే ఈ ఘోరం జరుగడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.

హెల్ప్‌లైన్ నెంబర్స్ ఇవే..

ఒడిశా రైలు ప్రమాదంపై విజయవాడ, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు అధికారులు. విజయవాడ హెల్ప్ లైన్ నెంబర్ 0866-2576924, రాజమహేంద్రవరం హెల్ప్ లైన్ నెంబర్ 0883-2420541, విశాఖ రైల్వేస్టేషన్‌లోనూ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు అధికారులు. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఇవాళ ఘటనాస్థలానికి వెళ్లనున్నారు. కాగా, ఈ ఘోర ప్రమాదంపై ప్రధాని మోదీ, సీఎంలు కేసీఆర్‌, మమత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బాధితులకు పరిహారం..

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థికసాయం, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయాలపాలైనవారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించింది.

ప్రమాదం ఇలా జరిగింది..

శుక్రవారం రాత్రి 7.15 గంటలకు బహనాగ స్టేషన్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ షాలీమార్‌ నుంచి చెన్నై వెళ్తోంది. మధ్యాహ్నం 3.20 సమయంలో అక్కడి నుంచి బయలుదేరింది. బహగాన స్టేషన్‌కు 7.15కి చేరుకుంది. ఆ సమయంలో పట్టాలు తప్పి లూప్‌ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొట్టింది. దాంతో ఇంజిన్‌తో పాటు 12 బోగీలు పక్క ట్రాక్‌పై ఒరిగిపోయాయి. ఇదే సమయంలో ఆ ట్రాక్‌పై యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ దూసుకొచ్చింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొట్టింది. యశ్వంత్‌పూర్‌- హౌరా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన నాలుగు జనరల్‌ బోగీలు ధ్వంసం అయ్యాయి. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో A1, A2, B2, B3, B4, B5, B6, B7, B8, B9 కోచ్‌లు ధ్వంసం అయ్యాయి. ఇంజిన్‌తో పాటు పట్టాలు తప్పిన B1 బోగీ. ఘటనా స్థలంలో దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. కోరమాండల్‌ ఎక్‌ప్రెస్‌కి మొత్తం 24 బోగీలు ఉంటే.. సగం బోగీలు ధ్వంసమయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Jun 2023 07:56 PM (IST)

    బాధ్యులు ఎంతటివారైనా చర్యలు తప్పవు: ప్రధాని మోడీ

    ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన.. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని, బాధ్యులు ఎంతటి వారైనా చర్యలు తప్పవన్నారు.

  • 03 Jun 2023 06:38 PM (IST)

    బెంగాల్‌కు చెందిన 31 మంది మృతి

    ఒడిశా రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన 31 మంది ప్రాణాలు కోల్పోయారని, వారిని గుర్తించామని బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 544 మంది గాయపడ్డారు. అలాగే బెంగాల్‌కు చెందిన 25 మంది ఒడిశాలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

  • 03 Jun 2023 06:11 PM (IST)

    రైలు ప్రమాదంలో 288కి చేరిన మృతుల సంఖ్య

    ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 288కి చేరింది. వెయ్యి మందికిపైగా గాయపడగా, వారిలో 56 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

  • 03 Jun 2023 05:37 PM (IST)

    రైలు ప్రమాద క్షతగాత్రుల కోసం రక్తదానం

    ఒడిశా రైలు ప్రమాద క్షతగాత్రుల కోసం రక్తదానం చేసిన ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ కార్యకర్తలు

  • 03 Jun 2023 05:06 PM (IST)

    ఆరోగ్య శాఖ మంత్రికి ప్రధాని మోడీ ఫోన్‌

    ప్రమాద స్థలం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవ్యతో ఫోన్‌లో మాట్లాడారు. దీనితో పాటు, గాయపడిన వారికి, వారి కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందించాలని ప్రధాని మోడీ ఆదేశించారు. ప్రమాద స్థలం నుంచి కటక్‌కు వెళ్లి అక్కడ క్షతగాత్రులను కలిశారు.

  • 03 Jun 2023 04:30 PM (IST)

    రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన ఒడిశా గవర్నర్

    బాలాసోర్ రైలు ప్రమాదంలో గాయడిన వారిని ఒడిశా గవర్నర్ గణేశి లాల్ బాలాసోర్‌లోని సోరోలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో పరామర్శించారు. వారికి సరైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.

  • 03 Jun 2023 03:51 PM (IST)

    రైలు ప్రమాద స్థలానికి చేరుకున్న ప్రధాని మోడీ

    ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటన స్థలానికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. ప్రమాదం స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి జరిగిన గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించనున్నారు.

  • 03 Jun 2023 03:50 PM (IST)

    ఒడిశా రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు జెలెన్‌స్కీ సంతాపం

    ఒడిశా రైలు ప్రమాద ఘటన పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. తన తరఫున, తమ దేశ ప్రజల తరఫున భారత ప్రధాని నరేంద్ర మోదీ, రైలు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

  • 03 Jun 2023 03:42 PM (IST)

    క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నాం: ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌

    ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన స్థలానికి ముగ్గురు ఐఏఎస్‌, ముగ్గురు ఐపీఎస్ అధికారుల బృందంతో కలిసి ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెళ్లారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన అన్నారు. అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేయమని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారని తెలిపారు.

  • 03 Jun 2023 03:42 PM (IST)

    రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలి

    ఒడిశా రైలు ప్రమాద ఘటనకు నైతిక బాధ్యతవహిస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చావన్ డిమాండ్ చేశారు. రైలు ప్రమాదానికి నైతిక బాధ్యతవహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అశ్వినీ వైష్ణవ్ తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఆయన రాజీనామాను ఆమోదించాలా? వద్దా? అన్నది ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోవాలన్నారు.

  • 03 Jun 2023 03:41 PM (IST)

    రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక

    ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. మెయిన్‌లైన్‌పైనే కోరమండల్‌కు సిగ్నల్‌ ఉంది. లూప్‌లైన్‌లో ఆగివున్న గూడ్స్‌ను కోరమండల్‌ ఢీకొట్టింది. కోరమండల్‌ పొరపాటున లూప్‌లైన్‌లోకి వెళ్లిందని రైల్వే శాఖ నివేదికలో పేర్కొంది. సిగ్నల్‌ లోపం వల్లే కోరమండల్‌ రైలు ప్రమాదం జరిగినట్లు తెలిపింది.

    Train Accident

    Train Accident

  • 03 Jun 2023 03:38 PM (IST)

    ప.బెంగాల్‌కు చెందిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

    ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటనలో మృతి చెందిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన మృతుల కుటుంబాలకు తలా రూ.5 లక్షల నష్ట పరిహారం అందజేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే క్షతగాత్రులకు తలా రూ. 1 లక్ష పరిహారం అందజేయనున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. ఒడిసాలో రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా సందర్శించారు. ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశారు.

    కేంద్ర ప్రభుత్వం అందజేసే పరిహారం కాకుండా.. అదనంగా దీన్ని బాధితులకు ప.బెంగాల్ ప్రభుత్వం అందజేయనుంది. మృతుల కుటుంబాలకు తలా రూ.10 లక్షలు పరిహారం అందజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయాలపాలైన వారికి రూ. 50 వేల అందజేయనున్నట్లు తెలిపింది.

  • 03 Jun 2023 03:33 PM (IST)

    క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నాం: ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌

    ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద స్థలానికి ముగ్గురు ఐఏఎస్‌, ముగ్గురు ఐపీఎస్ అధికారుల బృందంతో కలిసి ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెళ్లారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన అన్నారు. అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేయమని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారని తెలిపారు.

  • 03 Jun 2023 03:27 PM (IST)

    కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 178 మంది ఏపీ ప్రయాణీకులు

    ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఏపీకి చెందిన 178 మంది ప్రయాణీకులు ఉన్నట్లు వాల్తేరు డీఆర్ఎం మీడియాకు తెలిపారు. వీరితో పాటు జనరల్ బోగీలో ఎంతమంది ప్రయాణీకులు ఉన్నారన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉందన్నారు. అలాగే యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఎంతమంది ఏపీ వాసులున్నారో తేలాల్సి ఉందన్నారు.

  • 03 Jun 2023 03:02 PM (IST)

    రైలు ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు: ప్రధాని షాబాజ్ షరీఫ్

    ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్, “భారతదేశంలో జరిగిన రైలు ప్రమాదంలో వందలాది మంది మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘోర విషాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. దీంతో పాటు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అని అన్నారు.

  • 03 Jun 2023 02:42 PM (IST)

    యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్‍లోనూ తెలుగు ప్రయాణికులు

    ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో తెలుగు ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో 52 మందికిపైగా తెలుగు ప్రయాణికులున్నట్లు సమాచారం. తిరుపతి, రేణిగుంట, చీరాల స్టేషన్లల్లో యశ్వంతపూర్ రైలులో ప్రయాణికులు ఎక్కినట్టు సమాచారం.

  • 03 Jun 2023 02:37 PM (IST)

    ఏపీ సీఎం జగన్ ఆదేశించారు.. ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్

    ఒడిశాలో రైలు ప్రమాద ఘటనా స్థలి వద్దకు వెళ్లి ఏపీ ప్రయాణీకులకు అవసరమైన సహాయాన్ని అందించాలని మంత్రి అమర్‌నాథ్, ముగ్గురు ఐఏఎస్ అధికారులను సీఎం జగన్ ఆదేశించినట్లు వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఓ ట్వీట్‌లో తెలిపారు.

  • 03 Jun 2023 02:34 PM (IST)

    రాత్రి 9.30 గం.లకు విజయవాడకు చేరుకోనున్న ప్రత్యేక రైలు

    ఒడిశాలోని ప్రమాద స్థలం నుండి కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో రావలసిన ఏపీ ప్రయాణికుల కోసం ప్రత్యేక ట్రైన్ నడుపుతున్నారు. స్పెషల్ ట్రైన్ లో విశాఖకు చెందిన 41 మంది, తాడేపల్లిగూడెంలో ఇద్దరు, రాజమండ్రి ఒకరు విజయవాడలో 9 మంది రానున్నారు. రాత్రి 9:30 గంటలకు ఈ ప్రత్యేక రైలు విజయవాడకు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు.

  • 03 Jun 2023 02:32 PM (IST)

    కోనసీమ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు

    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్  రైలు ప్రమాదంపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అవసరమైన సమాచారం కోసం 08856 – 293104, 08856 – 293198 ఫోన్ నెంబర్లకు సంప్రదించవచ్చునని అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు.

  • 03 Jun 2023 02:29 PM (IST)

    ఒరిస్సా రైలు ప్రమాద ఘటనలో మృత్యుంజయగా మిగిలిన శ్రీకాకుళం జిల్లా కుటుంబం

    ఒరిస్సాలో జరిగిన రైల్ ప్రమాద ఘటనలో శ్రీకాకుళం జిల్లాకి చెందిన కుటుంబం మృత్యుంజయగా మిగిలింది. ప్రమాదానికి గురైన యశ్వంత్ పూర్ ఎక్స్ప్రెస్ లో చంద్రమౌళి,అతని భార్య,ఇద్దరు పిల్లలు రేణిగుంట నుండి హౌరాకి బయలుదేరారు. సమ్మర్ సెలవులకు హౌరా వెళుతూ చంద్రమౌళి,అతని కుటుంబం మార్గమధ్యంలో శ్రీకాకుళం రోడ్ లోనే ట్రైన్ దిగిపోయారు. ముందుగా హౌరా ట్రిప్ కి వస్తామన్న స్నేహితులు డ్రాప్ అవ్వటంతో టూర్ కేన్సిల్ చేసుకున్నారు చంద్రమౌళి. హౌరా టూర్ కేన్సిల్ చేసి స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం లాబాంకి కుటుంబంతో వెళ్లారు. నిన్న రాత్రి వాళ్ళు ప్రయాణించిన ట్రైన్ ప్రమాదానికి గురైందని తెలిసి వారి కుటుంబీకులు షాక్‌కి గురైయ్యారు. దేవుడు దయతో ప్రమాదం నుండి బయటపడ్డామని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

  • 03 Jun 2023 02:25 PM (IST)

    కోరమండల్ ఎక్స్ ప్రెస్‍లో తెలుగు ప్రయాణికులు

    కోరమండల్‍లో ఎక్స్‌ప్రెస్‌లో ఏపీ ప్రయాణికులు ఉన్నారు. విజయవాడలో 47, రాజమండ్రిలో 22, ఏలూరులో ఒకరు కలిపి మొత్తం 70 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

  • 03 Jun 2023 02:17 PM (IST)

    రైల్వే మంత్రి రాజీనామా చేయాలి: ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్

    ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సౌరభ్ భరద్వాజ్ కోరారు. విచారణ కమిటీ వేస్తే సరిపోదన్నారు. కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రైల్వే మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

  • 03 Jun 2023 01:10 PM (IST)

    ఒడిశా రైలు ప్రమాదంలో హైదరాబాద్ వాసికి గాయాలు

    ఒడిశా రైలు ప్రమాదంలో హైదరాబాద్ వాసికి గాయాలయ్యాయి. కె. అవినాష్ అనే ప్రయాణికుడుని సహాయక సిబ్బంది బాలాసోర్ ఆస్పత్రిలో చేర్చారు. మోకాలికి గాయం అయినట్లు ఆస్పత్రి వర్గాలు జాయినింగ్ రికార్డులో పేర్కొన్నాయి.

  • 03 Jun 2023 01:08 PM (IST)

    యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో చీరాలకు చెందిన ఆరుగురు వ్యాపారులు

    ప్రమాదం జరిగిన సమయంలో యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో చీరాలకు చెందిన ఆరుగురు వ్యాపారులు ఉన్నారు. కలకత్తాలో రెడీమేడ్‌ దుస్తులు కొనుగోలు చేసేందుకు ఈనెల 1వ తేదిన చీరాలలో యశ్వంత్‌పూర్‌ రైలు ఎక్కిన వ్యాపారులు.. తమ బోగీ సురక్షితంగా ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డారు. రైలు దిగి ఇతర మార్గాల ద్వారా కలకత్తాకు చేరుకున్నట్లు తెలిపారు.

  • 03 Jun 2023 12:53 PM (IST)

    ప్రగాఢ సానుభూతి ప్రకటించిన విరాట్ కోహ్లీ..

  • 03 Jun 2023 12:48 PM (IST)

    భువనేశ్వర్ బయలుదేరిన ప్రధాని మోదీ..

    ప్రధాని మోదీ భువనేశ్వర్ బయలుదేరారు. మధ్యాహ్నం 2:30 కి భువనేశ్వర్ చేరుకోనున్నారు. అక్కడినుంచి ఆర్మీ హెలికాఫ్టర్ లో ఘటన స్థలానికి వెళ్లనున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన తర్వాత కటక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రయాణికులను ప్రధాని పరామర్శించనున్నారు.

  • 03 Jun 2023 12:42 PM (IST)

    ఘటనా స్థలంలో ముగిసిన రెస్క్యూ ఆపరేషన్లు..

    ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్లు ముగిసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వెల్లడించిన సమాచారం ప్రకారం 238 మంది చనిపోగా, 650 మంది ప్రయాణికులు గాయపడినట్లు తెలిసింది.

  • 03 Jun 2023 12:35 PM (IST)

    విశాఖ, రాజమండ్రి, తాడేపల్లి గూడెం, ఏలూరు, విజయవాడకు చేరాల్సిన ప్రయాణికుల వివరాలు..

    Whatsapp Image 2023 06 03 At 12.30.13 Pm

  • 03 Jun 2023 12:34 PM (IST)

    ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ప్రయాణికుల వివరాలు..

    కోరమాండల్‌ ఎక్కి ఆంధ్ర ప్రదేశ్‌కు చేరాల్సిన ప్రయాణికుల వివరాలు ఇలా ఉన్నాయి..

    మొత్తం 178 మంది ప్రయాణికులు..

    1AC – 9

    11 AC – 17

    3A – 114

    స్లీపర్: 38 మంది.

  • 03 Jun 2023 12:32 PM (IST)

    ఘటనాస్థలానికి చేరుకున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..

    ఘటనాస్థలానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేరుకున్నారు. కాగా, అక్కడే ఉండి సహాయచర్యలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పర్యవేక్షిస్తున్నారు.

  • 03 Jun 2023 11:45 AM (IST)

    మృతదేహాల తరలింపులో భారత వాయుసేన

    రైలు ప్రమాద మృతదేహాల తరలింపులో భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17 హెలీకాప్టర్ల ద్వారా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

  • 03 Jun 2023 11:44 AM (IST)

    సంతాపం తెలిపిన కేటీఆర్..

  • 03 Jun 2023 11:28 AM (IST)

    ఒడిశా వెళ్లనున్న మోదీ ప్రధాని..

    ప్రధాని మోదీ నేడు ఒడిశా వెళ్లనున్నారు. ముందుగా బాలాసోర్‌లోని రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించి, ఆపై కటక్‌లోని ఆసుపత్రిని సందర్శిస్తారు.

  • 03 Jun 2023 11:27 AM (IST)

    కవచ్ లేకపోవడంతో దుర్ఘటన..

    కవచ్ లేకపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. సౌత్ సెంట్రల్ లో కేవలం 1400 కిలోమీటర్లకు మాత్రమే ఇప్పటివరకు కవచ్ ఏర్పాటు చేశారు. గతంలో తెలంగాణలోని కవచ్ ట్రయల్ రన్ చేయగా.. ఢిల్లీ నుంచి హౌరా వరకు మరో మూడు వేల కిలోమీటర్లు కవచ్ పనులు జరుగుతున్నాయి. కాగా, ఈ ప్రమాదం జరిగిన రూట్లో కవచ్ లేదు.

  • 03 Jun 2023 11:25 AM (IST)

    తీవ్రంగా గాయపడిన 50 మందిని చెన్నై తరలింపు..

    తీవ్రంగా గాయపడ్డ తమిళనాడుకి చెందిన యాభై మందిని అత్యవసర చికిత్స కోసం ప్రత్యేక విమానం లో చెన్నైకి తరలించారు.

  • 03 Jun 2023 11:00 AM (IST)

    238కి చేరిన మృతుల సంఖ్య

  • 03 Jun 2023 10:55 AM (IST)

    బాధిత కుటుంబాల‌కు మ‌న‌మంతా అండ‌గా నిలవాల్సి సమయం: నారా లోకోష్

    ఒడిశాలో జ‌రిగిన‌ రైళ్ల ప్ర‌మాదం మ‌హా విషాదమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘వంద‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ప్రాణాలు కోల్పోవ‌డం తీవ్ర‌దిగ్భ్రాంతికి గుర‌య్యాను. మృతుల‌కి అశ్రునివాళులు. బాధిత కుటుంబాల‌కు మ‌న‌మంతా అండ‌గా నిల‌వాల్సిన స‌మ‌యం ఇది. క్ష‌త‌గాత్రుల‌కి త‌క్ష‌ణ వైద్య‌సాయం అంది వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ నోట్ రిలీజ్ చేశారు. టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

  • 03 Jun 2023 10:41 AM (IST)

    ఒడిస్సా రైలు ప్రమాదంపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్..

    ఒడిస్సా రైలు ప్రమాదంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. రైలు ప్రమాదంలో బాధిత కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలిపారు.

    ఈమేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. ‘నా ఆలోచనలు ఈ విధ్వంసకర సంఘటన వల్ల ప్రభావితమైన ప్రతి వ్యక్తితో ఉంటాయి. ఈ కష్ట సమయంలో ధైర్యం, మద్దతు వారికి ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ప్రకటించారు.

  • 03 Jun 2023 10:38 AM (IST)

    ఒడిశా రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరం: పవన్ కళ్యాణ్..

    ఒడిశా రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరమని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. 278మంది ప్రయాణీకులు ఈ దుర్ఘటనలో మృత్యువాతపడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోందని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత ప్రయాణీకులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.

  • 03 Jun 2023 10:35 AM (IST)

    ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష..

    ఒడిషా రైలు ప్రమాదాలపై ప్రధాని మోదీ దిగ్భ్రాంత్రి చెందారు. ఈ మేరకు ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి సమీక్షనిర్వహించారు. రైల్వే మంత్రితో మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధితులకు అవసరమైన సాయమందించాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.

  • 03 Jun 2023 09:42 AM (IST)

    తొలుత కోరమాండల్.. ఆ తర్వాత యశ్వంత్ పూర్..

    మొదట ప్రమాదానికి గురైంది కోరమాండల్.. పదిహేను నిమిషాల తర్వాత యశ్వంత్ పూర్ ట్రైన్ వచ్చింది. దీంతో భారీ ప్రమాదంగా మారింది.

  • 03 Jun 2023 09:41 AM (IST)

    కోరమాండల్ ట్రైన్ ప్రమాదానికి కారణం అదేనా?

    కోరమాండల్ ట్రైన్ ప్రమాదానికి కారణం ఏంటనేది అందర్నీ తొలిచివేస్తుంది. సిగ్నల్ అండ్ టెలికమ్యూునికేషన్ టెక్నికల్ సమస్య అని రైల్వే శాఖ తేల్చింది. వేగంగా వస్తున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కి రూుట్ ఇవ్వడానికి అదే ట్రాక్ మీదున్న గూుడ్స్ ని లూప్ లోకి పంపిన రైల్వే అధికారులు.. అయితే మెయిన్ లైన్లో 110కిలోమీటర్ల వేగంతో వస్తున్న కోరమాండల్ బహెనాగ్ రైల్వే స్టేషన్ కు వచ్చాక సిగ్నలింగ్ లోపంతో అదే లూప్ లైన్లో కి కోరమాండల్ వెళ్లింది. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది.

  • 03 Jun 2023 09:21 AM (IST)

    18 దూరప్రాంత రైళ్ల రద్దు.. వందేభారత్ ప్రారంభోత్సవం వాయిదా..

    ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లే 18 రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. అలాగే టాటానగర్‌ స్టేషన్‌ మీదుగా మరో 7 రైళ్లను మళ్లించినట్లు వెల్లడించారు. తాత్కాలికంగా రద్దయిన రైళ్లలో హౌరా-పూరీ సూపర్‌ఫాస్ట్‌(12837), హౌరా-బెంగళూరు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్(12863), హౌరా-చెన్నై మెయిల్‌(12839), హౌరా-సికింద్రాబాద్‌(12703), హౌరా-హైదరాబాద్‌(18045), హౌరా-తిరుపతి(20889), హౌరా-పూరీ సూపర్‌ఫాస్ట్‌(12895), హౌరా-సంబల్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌(20831), సంత్రగాచి-పూరీ ఎక్స్‌ప్రెస్‌(02837) ఉన్నట్లు అధికారులు తెలిపారు.

  • 03 Jun 2023 08:59 AM (IST)

    ఘటనపై సీఎం జగన్‌ ఉన్నత స్థాయి సమీక్ష..

    ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఘటనా స్థలానికి మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ల బృందాన్ని పంపినట్లు తెలిపారు. అలాగే జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో ఎంక్వైరీ విభాగాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అవసరమైతే ఘటనాస్థలానికి పంపించేందుకు అంబులెన్స్‌లు సిద్ధం చేసినట్లు సీఎం తెలిపారు. ఎమర్జెన్సీ సేవలకోసం విశాఖ సహా ఒడిశా సరిహద్దు జిల్లాల్లో ఆస్పత్రులను అలర్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. మంత్రి అమర్నాధ్ తో పాటు IAS అధికారులు అరుణ్‌ కుమార్‌,ఆనంద్‌, శ్రీకాకుళం జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌ ఘటనా స్థలానికి వెళ్లారు.

  • 03 Jun 2023 08:56 AM (IST)

    సంతాపం ప్రకటించిన బండి సంజయ్..

    ఒడిశాలో ఘోర రైలు ప్రమాద దుర్ఘటన పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచన మేరకు రైలు ప్రమాద మృతుల సంతాప సూచకంగా తెలంగాణలో నేడు జరగాల్సిన ‘‘మహజన్ సంపర్క్ అభియాన్’’ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. అలాగే నేడు కేంద్ర మంత్రుల, జాతీయ నాయకుల రాష్ట్ర పర్యటన రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ఇక రైలు ప్రమాద మృతులకు సంతాప సూచకంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో బీజేపీ నేతలు నివాళులు అర్పించనున్న ఆయన ప్రకటించారు.
  • 03 Jun 2023 08:54 AM (IST)

    ఏపీ నుంచి 52 మంది..

    ఏపీ నుంచి రిజర్వేషన్ ద్వారా ప్రయాణించిన 52 మంది ప్రయాణికులు. ప్రాంతాల వారీగా లిస్ట్ చూస్తే..

    తిరుపతి నుంచి 18

    చీరాల నుంచి 12

    గూడూరు నుంచి 2

    నెల్లూరు 2

    ఒంగోలు 2

    రాజమండ్రి 2

    బాపట్ల 2

    బెజవాడ 4గురు.

  • 03 Jun 2023 08:30 AM (IST)

    సికింద్రాబాద్‌కు రావాల్సిన పలు రైళ్లు రద్దు..

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రావాల్సిన ఫలక్నామా ఎక్స్ప్రెస్ రద్దు చేశారు. కోల్‌కతా నుంచి సికింద్రాబాద్‌ రావలసిన ఫలక్‌నానా ఎక్స్‌ప్రెస్ ఒడిస్సా రైలు ప్రమాదంతో రైల్వే అధికారులు రద్దు చేశారు.

    అలాగే షాలిమార్ నుంచి హైదరాబాద్‌కు రావలసిన ట్రైన్‌తోపాటు హౌరా నుంచి తిరుపతి రావలసిన మరొక ట్రైన్ కూడా రద్దు చేశారు.

    మొత్తం మీద సికింద్రాబాద్‌కు రావలసిన రెండు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు.

  • 03 Jun 2023 08:20 AM (IST)

    హైలెవల్ కమిటీ తో విచారణ: కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ

    ప్రమాద ఘటన స్థలానికి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ చేరుకున్నారు. ప్రమాదం పై హైలెవల్ కమిటీ తో విచారణ జరిపిస్తున్నామని, రైల్వే సేఫ్టీ అథారిటీ కూడా స్వతంత్రంగా విచారణ జరుపుతుందని తెలిపారు. ప్రస్తుతం మా ఫోకస్ అంతా క్షతగాత్రులకు మెరుగైన సేవలందించడమేనని, చికిత్స అందించడంపైనే ఉందని పేర్కొన్నారు. చనిపోయినవారిని, వారి కుటుంబ సభ్యులకి అందిజేస్తున్నామని, ఘటనలో నిర్లక్ష్యం ఉందా లేదా అనేది విచారణ తర్వాత తేలుతుందని ప్రకటించారు.

  • 03 Jun 2023 07:57 AM (IST)

    కాసేపట్లో ఘటనా స్థలానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..

    రైలు ప్రమాద విషయం తెలుసుకుని, హుటాహుటిన ఘటనాస్థలానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బయల్దేరారు. బెంగాల్ పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకున్న కేంద్ర మంత్రి.. కాసేపట్లో ఘటనాస్థలానికి చేరుకోనున్నారు.

  • 03 Jun 2023 07:55 AM (IST)

    తెలుగు ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నంబర్స్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..

  • 03 Jun 2023 07:41 AM (IST)

    పరిస్థితిని సమీక్షించిన మోదీ..

  • 03 Jun 2023 07:37 AM (IST)

    బాధితులకు పరిహారం ప్రకటించిన కేంద్రం..

    ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థికసాయం, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయాలపాలైనవారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించింది.

  • 03 Jun 2023 07:35 AM (IST)

    ప్రమాద ఘటన లైవ్ విజువల్స్..

  • 03 Jun 2023 07:31 AM (IST)

    Odisha Train Accident: ప్రమాదంలో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు? హెల్ప్‌లైన్‌ నంబర్లు ఇవే..

    హెల్ప్‌ లైన్‌ నంబర్లు

    • ఒడిషా ప్రభుత్వం: 06782-262286
    • హౌరా: 033-26382217
    • ఖరగ్‌పూర్‌: 8972073925
    • బాలేశ్వర్‌: 8249591559
    • చెన్నై: 044-25330952
    • విశాఖ: 08912 746330, 08912 744619
    • విజయనగరం: 08922-221202, 08922-221206
    • విజయవాడ: 0866 2576924
    • రాజమండ్రి: 0883 2420541
    • రేణిగుంట: 9949198414
    • సికింద్రాబాద్‌: 040 27788516
    • తిరుపతి: 7815915571
    • నెల్లూరు: 08612342028
  • 03 Jun 2023 07:25 AM (IST)

    రైలు ప్రమాదంపై జగన్ ట్వీట్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి..

  • 03 Jun 2023 07:12 AM (IST)

    237కు చేరిన మృతుల సంఖ్య..

    ఒడిశా రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 237కు చేరుకుంది. ప్రమాదంపై హై-లెవెల్ విచారణకు రైల్వే మంత్రి ఆదేశించారు. ప్రమాదంపై నేడు సంతాప దినంగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాసేపట్లో ఘటనాస్థలానికి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ చేరుకోనున్నారు.

Published On - Jun 03,2023 4:29 AM

Follow us