
Vishwa Hindu Parishad: నుపుర్ శర్మ ( Nupur Sharma )చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా .. భారతదేశం అంతటా ఢిల్లీలోని(Delhi) జామా మసీదు వెలుపల సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. శుక్రవారం ప్రార్థనల అనంతరం భారీ ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో ఆందోళన సమయంలో హింసాత్మక సంఘటలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ (VHP) ఢిల్లీలోని ప్రజలు చిన్న, పెద్ద దేవాలయాలలో ‘హనుమాన్ చాలీసా’ సామూహిక పారాయణం చేయాలని.. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఈరోజు సాయంత్రం (జూన్ 14) 8 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని సోమవారం పిలుపునిచ్చింది .
విశ్వహిందూ పరిషత్ ఒక ప్రకటనలో.. జూన్ 10 న మసీదులలో ప్రార్థనల అనంతరం హింసాత్మక ప్రదర్శనలు జరిగాయని, దేవాలయాలపై, ఇళ్లపై రాళ్లు రువ్వారని ఆరోపించింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని పరువు తీయడానికి ప్రణాళికాబద్ధంగా చేసిన కుట్ర అని విశ్వహిందూ పరిషత్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ముఖ్యంగా యూపీలోని ప్రయాగ్ రాజ్, కాన్పూర్, సహరాన్ పూర్ ప్రాంతాల్లో రాళ్ల దాడులు జరిగాయి. జార్ఖండ్ రాంచీలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ప్రదర్శనకారులను నియంత్రించే ప్రయత్నంలో కొంతమంది పోలీసులు గాయపడ్డారు. పోలీసులకు, ఆందోళనకారుల ఘర్షణల్లో ఇద్దరు మరణించారు. పశ్చిమ బెంగాల్ హౌరాలో కూడా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. జమ్మూలో అధికారులు కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.
నుపుర్ శర్మను చంపుతామని బెదిరించడం, ఆమె హత్యకు చట్టవిరుద్ధమైన ఫత్వాలు జారీ చేయడాన్ని ఢిల్లీ వీహెచ్పీ చీఫ్ కపిల్ ఖన్నా ఖండించారు. హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం గురించి భక్తులకు తెలియజేస్తూ నోటీసులు పెట్టాలని ఆలయ నిర్వాహకులు మరియు పూజారులను ఖన్నా కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..