ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..! వరదల కారణంగా 19 మంది మృతి
ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో కుండపోత వర్షాల కారణంగా విస్తారమైన వరదలు సంభవించాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గౌహతి, ఇంఫాల్ నగరాలు వరదల బారిలో చిక్కుకున్నాయి. కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కొట్టుకుపోవడం వంటి ఘటనలు జరిగాయి.

ఈశాన్య రాష్ట్రాల్లో వరదల బీభత్సం కొనసాగుతోంది. అసోం, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా అపారనష్టం జరిగింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ వరద గుప్పిట్లో చిక్కుకుంది. నగరంలోని పలు భవనాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఆర్మీని రంగంలోకి దింపారు.
అసోంలో వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలతో కామరూప్ జిల్లాలో ఐదుగురు చనిపోయారు. అసోంలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అసోం రాజధాని గౌహతి వరద గుప్పిట్లో చిక్కుకుంది. మిజోరాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ కుండపోత వర్షాలు కురిశాయి. వర్షాల ధాటికి నాలుగు రాష్ట్రాల్లో కూడా కొండ చరియలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు కొట్టుకుపోయాయి. ఏకంగా 12 వేల మంది నిరాశ్రయులయ్యారు. అరుణాచల్‌ప్రదేశ్‌పై వరదలు తీవ్ర ప్రభావం చూపించాయి.
పలుచోట్ల ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. అలాగే మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో కూడా కుండపోత వర్షం కురిసింది. రాంబన్ ప్రాంతంలో వడగండ్ల వాన, ఉధంపూర్‌లో ఓ మోస్తరు వర్షం కరిసింది. కొండచరియలు విరిగపడటం, ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్ ఉందని జమ్ముకశ్మీర్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




