సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేసుకునే డాక్టర్లపై కొరడా.. కేంద్రం కొత్త రూల్స్.. అలా కుదరదు..
సోషల్ మీడియాలో వైద్యుల ప్రమోషన్లపై ఎన్‌ఎంసీ సంచలన గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఇకపై '100 శాతం సక్సెస్', 'బెస్ట్ డాక్టర్' లాంటి ప్రకటనలపై తక్షణ నిషేధం విధించింది. బిఫోర్-ఆఫ్టర్ ఫోటోలు, డిస్కౌంట్లు, ఆఫర్లతో రోగులను ఆకర్షిస్తే వేటు వేస్తామని వార్నింగ్ ఇచ్చింది.

సోషల్ మీడియా వేదికగా రోగులను ఆకర్షించే డాక్టర్లు, కార్పొరేట్ ఆస్పత్రులపై నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) కొరఠా ఝుళిపించింది. ఇకపై యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో ‘బెస్ట్ డాక్టర్’, ‘100 శాతం సక్సెస్’, ‘గ్యారంటీ క్యూర్’ లాంటి ప్రచారాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 6, 2026 నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని ఎన్‌ఎంసీ ఎథిక్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ రాఘవ్ లాంగర్ తాజాగా స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో ఉన్న ఓ రిట్ పిటిషన్ నేపథ్యంలో ఎన్‌ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. వైద్యులు ఇకపై ఫేక్ లైక్స్, ఫేక్ ఫాలోవర్స్ పెంచుకోవడం, పేషెంట్ల బిఫోర్-ఆఫ్టర్ ఫోటోలు వాడటం, డిస్కౌంట్లు, రెఫరల్ ఫీజులు ప్రకటించడం చేయకూడదని స్పష్టం చేసింది. కమర్షియల్ ప్రయోజనాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడి రోగుల ముఖాలు, వాయిస్ సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
మెడికల్ సైన్స్ కోసం ఫోటోలు వాడితే రోగి అనుమతితో పాటు వారి ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. డాక్టర్ అనుమతితో ఏజెన్సీలు గానీ, ఇన్‌ఫ్లుయెన్సర్లు గానీ ప్రమోషన్లు చేసినా దాని బాధ్యత వైద్యుడే తీసుకోవాలని స్పష్టం చేసింది. ఉల్లంఘనల తీవ్రతను బట్టి కఠిన చర్యలు ఉంటాయని ఎన్‌ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. మొదటిసారి తప్పు చేస్తే వార్నింగ్‌తో సరిపెట్టనుండగా.. పదే పదే ఉల్లంఘిస్తే రిజిస్టర్ నుంచి 1 నుంచి 3 ఏళ్ల పాటు వైద్యుడి పేరును తొలగించనున్నారు. తప్పుడు క్లెయిమ్స్ చేసిన తీవ్రమైన కేసుల్లో 6 నుంచి 12 నెలల పాటు డాక్టర్లపై సస్పెన్షన్ వేటు ఇక నుంచి పడనుంది. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. రోగుల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, డాక్టర్ల మోసాలపై నియంత్రణ విధించడం కోసం ఈ కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది.
వైద్యులు కేవలం తమ పేరు, క్వాలిఫికేషన్, రిజిస్ట్రేషన్ నంబర్, ఫీజు వివరాలను మాత్రమే సోషల్ మీడియా ద్వారా పంచుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్ హెల్త్ క్లాసులు తీసుకున్నప్పుడు ఆస్పత్రిని ప్రమోట్ చేయకూడదని స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధనలు కేవలం అల్లోపతి వైద్యం చేసే రిజిస్టర్డ్ డాక్టర్లకు మాత్రమే వర్తించనున్నాయి. ఆయుర్వేద, హోమియోపతి వైద్యులకు ఇవి వర్తించవని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. ఈ ఆంక్షలపై 60 రోజుల్లోపు ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డుకు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు.
