AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘డంకీ’లు కొట్టించి ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు.. అసలింతకీ ‘డంకీ’ మార్గం అంటే ఏంటో తెలుసా?

జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అక్రమ మార్గాల్లో విదేశాలకు భారతీయులను తరలిస్తున్న 'డంకీ' ముఠాల ఆటకట్టించేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. అమెరికా నుండి వెనక్కి పంపిన 636 మంది భారతీయుల విషయంలో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. వీరు అక్రమంగా భారత్ నుంచి అమెరికాకు ఎలా చేరుకున్నారు? దీని వెనుకున్న డంకీ ముఠాలపై ఆరా తీస్తున్నారు. దీని వెనుక ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సిండికేట్‌ను NIA గుర్తించింది.

'డంకీ'లు కొట్టించి ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు.. అసలింతకీ 'డంకీ' మార్గం అంటే ఏంటో తెలుసా?
NIA
Follow us
Mahatma Kodiyar

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 31, 2025 | 2:03 PM

అక్రమ మార్గాల్లో భారతీయులను విదేశాలకు తరలిస్తున్న ‘డంకీ’ ముఠాలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కొరఢా ఝులిపిస్తోంది. విదేశాలు వెళ్లాలనుకున్నవారి వద్ద లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ.. అక్రమమార్గాల్లో వారిని ఆ దేశాల్లో దిగబెడుతున్న ముఠాల దందా తాజాగా అమెరికా చర్యలతో బయటపడింది. డోనాల్డ్ ట్రంప్ ఆ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారిని ఏరి పట్టుకుని మరీ సైనిక విమానాల్లో వెనక్కి పంపిస్తున్న ఉదంతాలను చూశాం. ఇలా వెనక్కి వచ్చినవారిలో ఇప్పటి వరకు 636 మందికి పైగా భారతీయులు ఉన్నారని మార్చి 28న లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తెలిపారు. వెనక్కి వచ్చిన భారతీయుల్లో పంజాబ్, రాజస్థాన్, హర్యానా, గుజరాత్, యూపీ వంటి ఉత్తర, పశ్చిమ భారత రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

పంజాబ్, ఢిల్లీ కేంద్రంగా ఉన్న కొందరు ఒక సిండికేట్‌గా ఏర్పడి అక్రమ మార్గాల్లో భారతీయులను అమెరికా, యూకే వంటి దేశాలకు తరలిస్తున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) గుర్తించింది. ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతానికి చెందిన గగన్‌దీప్ సింగ్ అలియాస్ ‘గోల్డీ’ ఈ సిండికేట్‌లో కీలక సూత్రధారిగా భావిస్తూ అరెస్టు చేసింది. పంజాబ్‌లోని తరన్ తరన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నుంచి గోల్డీ రూ. 45 లక్షలు వసూలు చేసి అక్రమమార్గాల్లో అమెరికాకు పంపించినట్టు దర్యాప్తులో తేలింది. గత ఏడాది డిసెంబర్‌లో ‘డంకీ’ మార్గంలో అమెరికాకు పంపగా.. ఫిబ్రవరి 15న ఆ దేశం ఆ వ్యక్తిని వెనక్కి పంపించేసింది. స్వదేశానికి చేరుకున్న తర్వాత బాధిత వ్యక్తి స్థానిక పంజాబ్ పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన మోసంపై ఫిర్యాదు చేయగా.. పంజాబ్ పోలీసులు FIR నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించింది. ఎలాంటి చట్టపరమైన అనుమతులు లేకుండా ఓ కన్సల్టెన్సీ నిర్వహిస్తూ.. స్పెయిన్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల, మెక్సికో మీదుగా అమెరికాకు మనుషులను తరలించినట్టు దర్యాప్తులో తేలింది. అక్రమ మార్గాల్లో మనుషులను తరలించే సమయంలో డంకీ సిండికేట్ సభ్యులు కొట్టి మరీ తమ వద్ద ఉన్న డాలర్లను లాక్కున్నారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అసలింతకీ ‘డంకీ’ మార్గం అంటే ఏంటి?

రెండేళ్ల క్రితం ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘డంకీ’ (DUNKI) సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమ మార్గంలో ‘యునైటెడ్ కింగ్‌డమ్’ (UK) చేరుకోవడం ఇతివృత్తంగా ఈ సినిమా కథ ఉంటుంది. సాధారణంగా విదేశాలకు వెళ్లాలంటే ఆ దేశం ఇచ్చే అనుమతి పత్రం (వీసా) తప్పనిసరి. ఉన్నత చదువుల కోసం వెళ్లేవారికి స్టూడెంట్ వీసా, ఉద్యోగార్థులై వెళ్లేవారికి ఒక వీసా, కేవలం ఆ దేశాన్ని సందర్శించి తిరిగొచ్చేవారి కోసం విజిట్ వీసా.. ఇలా ఎన్నో రకాల వీసాలు ఉంటాయి. ఇవేవీ లేకుండా ఏ దేశం కూడా తమ భూభాగంలోకి విదేశీయులను అనుమతించదు. కానీ కొందరు ఎలాగైనా సరే ఆ దేశానికి చేరుకుంటే చాలు అనుకుంటూ అక్రమ మార్గాలను ఆశ్రయిస్తుంటారు. అభివృద్ధి చెందిన దేశాల్లో హోటళ్లలో వెయిటర్‌గా, సర్వర్‌గా.. లేదంటే పెట్రోల్ బంక్‌లో ఉద్యోగిగా.. ఇలా ఏ చిన్న పని చేసినా వచ్చే సంపాదన భారతదేశంలో సంపాదన కంటే ఎక్కువగా ఉంటుంది. కరెన్సీ విలువల్లో తేడాలు, ఉపాధి అవకాశాలు ఈ తరహా అక్రమ వలసలను ప్రోత్సహిస్తున్నాయి. ఇది కేవలం డంకీ సినిమాలో చూపించినట్టు ‘యూకే’కు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. అభివృద్ధి చెందిన అన్ని దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాలు సైతం ఈ అక్రమ వలసల సమస్యను ఎదుర్కొంటున్నాయి. భారత్ పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి పెద్ద సంఖ్యలో అక్రమంగా భారత్‌లోకి చొరబాట్లు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. భారత్ నుంచి అమెరికా, యూకే వంటి ఆంగ్ల భాషా దేశాలతో పాటు కొన్ని యూరప్ దేశాలకు కూడా అక్రమ వలసలు జరుగుతున్నాయి.

‘డంకీ’ (DUNKI) అన్న పదం ‘డాంకీ’ (DONKEY) నుంచి ఉద్భవించింది. అంటే గాడిద మాదిరిగా కష్టతరమైన మార్గాల్లో సరిహద్దుల్లోని భద్రతా బలగాల కళ్లుగప్పి.. దట్టమైన అడవులు, పర్వతాలు, లోయలు, నదులు, వాగులు, వంకలు దాటుకుంటూ.. చివరకు చుక్క నీరు దొరకని ఎడారి ఇసుక నేలలపై కాలినడకన ముందుకు సాగాల్సి ఉంటుంది. దట్టమైన మంచు లేదంటే ఇసుక తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను సైతం ఎదుర్కోవాలి. అడ్డదారుల్లో అమెరికా చేరుకునే క్రమంలో దట్టమైన అమేజాన్ అడవుల్లో విషసర్పాల బారినపడి కొందరు ప్రాణాలు సైతం కోల్పోయిన ఉదంతాలున్నాయి. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య దట్టమైన హిమపాతంలో అక్రమంగా కెనడా సరిహద్దు దాటి అమెరికా చేరుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ కుటుంబాల విషాద గాథలు కూడా ఉన్నాయి. ఇంత కష్టతరమైన మార్గం కాబట్టే దీన్ని డాంకీ (గాడిద) మార్గం అని వ్యవహరిస్తారు. అదే కాలక్రమంలో డంకీగా మారింది.