కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలలో ఉద్యోగ ఖాళీలను త్వరతగతిన భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగాలను మిషన్ మోడ్ లో భర్తీ చేయడంతోపాటు రోజ్‌గార్ మేళా నిర్వహించి వారికి నియామక పత్రాలను అందిస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఈ కార్యక్రమం నిర్వహించి.. స్వయంగా ప్రధాని మోడీనే నియామక పత్రాలను అందించి.. ఉద్యోగాలు సాధించిన యువతీయువకులతో ముచ్చటించారు. రోజ్‌గార్ మేళా తదుపరి కార్యక్రమం మే 16న 22 రాష్ట్రాల్లో నిర్వహించనున్నారు. ఈ ఎంప్లాయిమెంట్ డ్రైవ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 70,000 మందికి పైగా నియామక పత్రాలను ఉద్యోగాలు సాధించిన వారికి పంపిణీ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
భారీ జాబ్ మేళాలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 16న 70 వేల మంది యువతకు అపాయింట్‌మెంట్ లెటర్లను పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. 22 రాష్ట్రాల్లోని 45 కేంద్రాల్లో జరగనున్న ఐదవ జాబ్ మేళా కార్యక్రమానికి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ కేంద్రాల్లో జరిగే జాబ్ మేళాకు మంత్రులు హాజరుకానున్నారు. పీయూష్ గోయల్ (ముంబై), ధర్మేంద్ర ప్రధాన్ (భువనేశ్వర్), అశ్విని వైష్ణవ్ (జైపూర్), హర్దీప్ సింగ్ పూరి (కపుర్తల), నిర్మలా సీతారామన్ (చెన్నై), నరేంద్ర సింగ్ తోమర్ (రత్లం), జ్యోతిరాదిత్య సింధియా (భోపాల్), అనురాగ్ సింగ్ ఠాకూర్ (సిమ్లా)లో పాల్గొననున్నారు. మిగతా కేంద్రాల్లోనూ కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
గత ఏడాది అక్టోబర్‌లో రోజ్‌గార్ మేళా పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. మే 16వ తేదీన 45 కేంద్రాల్లో ఈ డ్రైవ్ నిర్వహించనున్నారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) విజయం సాధించిన రోజున దీనిని నిర్వహించనున్నారు.
2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం రానున్న రోజుల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. మొదటి రోజ్‌గార్ మేళా అక్టోబర్ 22, 2022న నిర్వహించగా.. కొత్తగా రిక్రూట్ అయిన 75,000 మందికి అపాయింట్‌మెంట్ సర్టిఫికెట్లు అందజేశారు. రెండవ మేళా నవంబర్ 22, 2022న నిర్వహించి సుమారు 71,000 అపాయింట్‌మెంట్ లెటర్‌లు అందించారు. ఈ ఏడాది జనవరి 20న మూడవ ఎడిషన్, ఏప్రిల్ 13న నాల్గవ ఎడిషన్ కార్యక్రమం జరిగింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..