రెండాకులు..రెండు వర్గాలు : వ్యూహప్రతివ్యూహాలతో హీటెక్కిపోతోన్న తమిళ పాలిటిక్స్, పళని – శశికళ వార్ పీక్స్
తమిళనాట పళని - శశికళ మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. పార్టీని చేజిక్కించుకొనేందుకు శశికళ వర్గం శక్తియుక్తులూ కూడగడుతోంది. చిన్నమ్మకు చెక్ పెట్టేందుకు పళనివర్గం..
తమిళనాట పళని – శశికళ మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. పార్టీని చేజిక్కించుకొనేందుకు శశికళ వర్గం శక్తియుక్తులూ కూడగడుతోంది. చిన్నమ్మకు చెక్ పెట్టేందుకు పళనివర్గం సైతం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇరువర్గాల వ్యూహప్రతివ్యూహాలతో తమిళనాట పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. రెండాకులు..రెండు వర్గాలు.. అవి మావంటే మావంటూ తమిళరాజకీయాల్లో డైలాగ్ వార్ పీక్స్‌కు చేరింది. సీఎం పళని..చిన్నమ్మ మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. మరి రెండాకులు ఎవరికి చిక్కబోతున్నాయి..? తమిళనాట ఏం జరగబోతోంది..? అన్నాడీఎంకే ఎవరి హస్తగతం కాబోతోంది..? రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడిదే హాట్ టాపిక్.
ఎన్నికల వేళ తమిళ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. నాలుగేళ్ల తర్వాత చిన్నమ్మ ఎంట్రీతో క్షణానికో మలుపు తిరుగుతూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఐతే ఆస్పత్రి నుంచే తన మాస్టర్ మైండ్‌కు పదునుపెట్టారు చిన్నమ్మ. అక్కడి నుంచే యాక్షన్ స్టార్ట్ చేశారు. తనదైన మార్క్ చూపిస్తూ.. అన్నాడీఎంకే జెండా ఉన్న కారులో ప్రయాణించి పళని వర్గంలో టెన్షన్ పుట్టించారు. ఆ తర్వాత పార్టీ సింబల్ తనదేనంటూ కోర్ట్ మెట్లెక్కారు. ఐతే తనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న శశికళకు గట్టి వార్నింగ్ ఇచ్చారు సీఎం పళనిస్వామి. అన్నాడీఎంకేను నాశనం చేయడానికి ఆమె చేస్తున్న కుట్రలను సాగనివ్వమన్నారు పళనిస్వామి.
పళనికి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు చిన్నమ్మ. అన్నాడీఎంకే మనదే.. అవకాశవాదుల నుంచి కాపాడుకుంటాం.. పార్టీలో ఎవరికి చోటుండదో త్వరలోనే తమిళనాడు ప్రజలు చూస్తారు..అంటూ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆమె..అన్నాడీఎంకేపై వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఒకవైపు పళని, పన్నీర్.. మరోవైపు చిన్నమ్మ, దినకరన్..త్వరలో అసెంబ్లీ ఎలక్షన్స్.. ఈ పరిస్థితుల్లో అరవ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్నాడీఎంకే అసలు వారసురాలిని నేనేనంటున్నారు జయ నెచ్చెలి శశికళ. కానీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని..పార్టీలో ఉండే అర్హత చిన్నమ్మకు లేదంటోంది పళని, పన్నీర్ వర్గం. దీంతో తమిళనాట ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు.. శశికళ ఐసోలేషన్‌లోకి వెళ్తున్నారు. వైద్యుల సూచన మేరకు ఆమె వారం రోజుల పాటు ఎవరినీ కలిసే పరిస్థితి లేదు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు శశికళ. ఆరోగ్యం రీత్యా వారం పాటు ఐసోలేషన్‌లోకి వెళ్లాలని సూచించారు వైద్యులు. వచ్చే బుధవారం వరకూ పార్టీ కేడర్‌తో ఎటువంటి మీటింగ్‌లు ఉండవని ఆమె వర్గీయులు చెబుతున్నారు. రాజకీయ వ్యవహారాల్ని ఇంటి నుంచే చక్కబెట్టనున్నారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు ఇటీవల వెల్లడించారు శశికళ. అంతలోనే మళ్లీ ఐసోలేషన్‌కు వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది..!