ఇక జైలుకు వెళ్తే.. పదవి ఊడినట్లే.. సీఎం టూ పీఎం.. మంత్రులకూ వర్తింపు..!
ఐదేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడే తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను.. కొత్త బిల్లు చట్టరూపం దాలిస్తే పదవులనుంచి తొలగించవచ్చు. 30 రోజుల పాటు కస్టడీలో ఉండి, బెయిల్ పొందకపోతే వారు వెంటనే పదవిని వదులుకోవాలి. 30 రోజుల తర్వాత కూడా రాజీనామా చేయకపోతే 31వ రోజున వారిని పదవి నుంచి తొలగించినట్లు పరిగణిస్తారు.

ఎన్ని ఆరోపణలు వచ్చినా.. పదవులు పట్టుకుని వేలాడుతుంటారు. జైళ్లకు వెళ్లొచ్చినా.. పదవుల్లో కొనసాగుతుంటారు. నైతిక బాధ్యతనే మాటని ఈకాలపు నేతలు దాదాపుగా మరిచిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులకైనా సస్పెండ్ అవుతామని, డిస్మిస్ అవుతామనే భయమన్నా ఉంటుంది. కానీ ప్రజాప్రతినిధులకు అలాంటి భయాలేం లేవు. కానీ వాళ్లలో కూడా భయం పుట్టించే బ్రహ్మాస్త్రంలాంటి బిల్లును ప్రవేశపెట్టింది మోదీ సర్కార్. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించిన ఆ బిల్లుపై రచ్చరచ్చ చేస్తోంది అపోజిషన్.
విపక్షాల నుంచి ఊహించని రియాక్షన్. అయినా పార్లమెంట్‌లో సంచలన బిల్లును ప్రవేశపెట్టారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. దీంతో బిల్లు ప్రతుల్ని చించి నిరసనకు దిగాయి విపక్షాలు. లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన మూడు ముఖ్యమైన బిల్లుల్లో కీలకమైంది 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ బిల్లుతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 239AAలో 5A సెక్షన్‌ని జోడించనున్నారు. తీవ్రమైన నేరారోపణలపై అరెస్టయిన లేదా కస్టడీలో ఉన్న ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు పదవిలో కొనసాగకుండా నిరోధించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.
ఐదేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడే తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను.. కొత్త బిల్లు చట్టరూపం దాలిస్తే పదవులనుంచి తొలగించవచ్చు. 30 రోజుల పాటు కస్టడీలో ఉండి, బెయిల్ పొందకపోతే వారు వెంటనే పదవిని వదులుకోవాలి. 30 రోజుల తర్వాత కూడా రాజీనామా చేయకపోతే 31వ రోజున వారిని పదవి నుంచి తొలగించినట్లు పరిగణిస్తారు.
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రి తరువాత నిర్దోషిగా తేలితే మాత్రం.. వారు తిరిగి నియమితులయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులు ఉన్నత పదవుల్లో ఉండకుండా చట్టాన్ని తీసుకురావడమే ఈ బిల్లు లక్ష్యం. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాదిరిగా జైలులో ఉన్నా.. పదవిలో కొనసాగిన పరిస్థితులను నివారించడమే ఈ రాజ్యాంగ సవరణ ప్రధాన ఉద్దేశం.
ప్రస్తుతం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్, రాష్ట్రపతి కొన్ని సందర్భాల్లో అరెస్టు నుంచి మినహాయింపు పొందుతారు. కానీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులకు అలాంటి స్పష్టమైన మినహాయింపు లేదు. అరెస్ట్ అయినప్పుడు నైతికత ఆధారంగా రాజీనామా చేయాలని ఒత్తిడి ఉంటుంది. కానీ దోషి అని తేలకముందే వారిని బలవంతంగా రాజీనామా చేయించే చట్టం లేదు. ఏదైనా కేసులో రెండేళ్లకంటే ఎక్కువ జైలు శిక్ష విధిస్తే పార్లమెంటు లేదా అసెంబ్లీ సభ్యత్వం రద్దవుతుంది.
తీవ్రమైన ఆరోపణలున్న నాయకులు కూడా పదవుల్లో కొనసాగుతున్నారు. దాన్ని నివారించేందుకు కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని అరెస్టు చేయించి, బీజేపీయేతర ప్రభుత్వాలను అస్థిరపరచడానికే కేంద్రం ఈ బిల్లు తెచ్చిందని కాంగ్రెస్ మండిపడుతోంది. ఓట్ల చోరీపై ఉద్యమిస్తున్న సమయంలో.. దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేంద్రం ఈ వివాదాస్పద బిల్లును తెచ్చిందని విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తుంటే.. గుమ్మడికాయల దొంగల్లా భుజాలెందుకు తడుముకుంటున్నారని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది.
విపక్షాల నిరసన మధ్యే బిల్లును ప్రవేశపెట్టిన అమిత్‌షా.. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించారు. 31మంది సభ్యుల జాయింట్ పార్లమెంటరీ కమిటీ బిల్లు ముసాయిదాపై అభిప్రాయాలు సేకరిస్తుంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మొదటి రోజున నివేదిక సమర్పించాలని జేపీసీని కోరారు హోంమంత్రి అమిత్‌షా. ఏ రకమైన క్రిమినల్ అభియోగాలో స్పష్టంగా చెప్పకపోయినా కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడే తీవ్రమైన నేరారోపణలున్న నేతలకు ఈ నియమం వర్తిస్తుంది. బిల్లు ఆమోదం పొంది చట్టరూపం దాలిస్తే మాత్రం.. నేర చరిత్ర ఉన్న నేతలకు బ్యాడ్‌టైమ్ స్టార్టయినట్లే..!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




