వేల కోట్ల మనీ మాఫియా ఖతం..! ఆన్‌లైన్ నిర్వహిస్తే.. మూడేళ్ల జైలు, రూ. కోటి జరిమానా!
మజా పేరుతో మొదలవుతుంది.. ఒక చేత్తో పైసలిచ్చి మరో చేత్తో నోట్ల కట్టలను లాక్కుంటుంది. తర్వాత ఆర్థికంగా పీకల్లోతు నష్టాల్లో ముంచుతుంది. చివరాఖరుకు నిండు ప్రాణాలను బలి తీసుకుంటుంది. అదే ఆన్‌లైన్ బెట్టింగ్ మహమ్మారి. ఈ రాక్షస క్రీడకు ఇకమీదట ఫుల్‌స్టాప్ పడ్డట్టే. ఆ దిశగా తొలి అడుగు వేసింది మోదీ సర్కార్. కానీ, వేల కోట్ల సైజు ఉన్న ఆన్‌లైన్ బెట్టింగ్ సామ్రాజ్యం అంత ఈజీగా ఢమాలవుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న..!

ఆన్‌లైన్ బెట్టింగ్ జాడ్యం.. ఇదొక అంతులేని విషాదాల పరంపర. యువతను కమ్మేస్తుంది. తర్వాత కుమ్మేస్తుంది. ఒక్క తెలంగాణలోనే కేవలం నెలరోజుల్లో ఏడుగురి బలవన్మరణాలకు దారితీసింది. ఆర్థికంగా చితికిపోయి ఇంకా లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా కుప్పకూలి, అప్పులపాలై, మానసిక ఒత్తిడి భరించలేక కుమిలిపోతున్నాయి. దేశవ్యాప్తంగా మృత్యు ఘంటికలు మోగిస్తున్న ఆన్‌లైన్ గేమింగ్ సిండికేట్‌పై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేస్తే ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది.
గేమింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లపై తెలంగాణ పోలీస్ శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులు పెట్టి దర్యాప్తు జరుపుతున్నాయి. ఒక్క పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోనే 11 మంది తెలుగు యూట్యూబర్లపై గేమింగ్ యాక్ట్ కింద బుక్కయ్యారు. కానీ, అదంతా తాత్కాలికం. ఇప్పుడు శాశ్వత ప్రాతిపదికన గేమింగ్ యాప్స్‌కు చెక్ పెట్టబోతోంది మోదీ సర్కార్. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ను నేరంగా పరిగణిస్తూ ‘ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు’ను బుధవారం(ఆగస్టు 20) లోక్‌సభలో ప్రవేశపెట్టి, ఆమోదం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆన్‌లైన్ గేమింగ్‌తో యువతలో వ్యసనం, ఆర్థిక నష్టాలు, మానసిక సమస్యలు, అవి మితిమీరితే ఆత్మహత్యల దాకా దారి తీస్తాయని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. అందుకే ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు’ను అమల్లోకి తీసుకొస్తోంది.
తాజా బిల్లు లక్ష్యాలుః
>> ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఫాంటసీ స్పోర్ట్స్, రమ్మీ, పోకర్ వంటి గేమ్స్ పూర్తిగా నిషేధం.
>> యువతను, పేద-మధ్యతరగతి కుటుంబాలను ఆర్థిక, మానసిక, సామాజిక ముప్పుల నుంచి రక్షించడం.
>> ఈ – స్పోర్ట్స్, సోషల్ గేమ్స్‌ను ప్రోత్సహించడం..
కొత్త చట్టం అమల్లోకి వచ్చాక ఈ-స్పోర్ట్స్‌కి అధికారిక గుర్తింపు లభిస్తుంది. ఈ-స్పోర్ట్స్ అంటే, బెట్టింగ్‌తో ప్రమేయం లేకుండా నైపుణ్యం ఆధారంగా వర్చువల్‌గా ఆడే పూర్తి చట్టబద్ధమైన ఎలక్ట్రానిక్ గేమ్స్. వీటిని మాత్రమే ఎంకరేజ్ చేయాలని సంకల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ-స్పోర్ట్స్‌లో ఎటువంటి ఆర్థిక లావాదేవీలకు చోటు ఉండదు. వీటికోసం శిక్షణా కేంద్రాలు, అకాడమీలు, పరిశోధన కేంద్రాలు ఏర్పాటు అవుతాయి. ఆన్‌లైన్ గేమ్స్‌కి ప్రత్యామ్నాయంగా సామాజిక విలువలతో కూడిన క్రీడల అభివృద్ధికి సైతం ప్రభుత్వం నుంచి మద్దతు దొరుకుతుంది. అటు, ఆన్‌లైన్ మనీ గేమ్స్‌కి సంబంధించి ప్రకటనలు, లావాదేవీలు అన్నీ ఆగిపోతాయి. వాటికి సంబంధించిన పేమెంట్ సిస్టమ్స్ బ్లాక్ అవుతాయి.
ఇకమీదట ఎవ్వరైనా ఆన్‌లైన్ గేమ్స్‌ని, ఆన్‌లైన్ మనీ గేమింగ్ సర్వీసెస్ నిర్వహిస్తే.. మూడేళ్ల జైలు శిక్ష, రూ. కోటి వరకు జరిమానా విధిస్తారు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తే రెండేళ్ల జైలు, రూ. 50 లక్షల వరకు జరిమానా తప్పదు. ఆన్‌లైన్ గేమింగ్ కార్యకలాపాలకు సంబంధించిన లావాదేవీలకు సహకరిస్తే బ్యాంకు యాజమాన్యాలపై కూడా నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు అవుతాయి. దాదాపు ఇటువంటి శిక్షలే వర్తిస్తాయి. ఆన్‌లైన్ గేమింగ్‌పై ఫిర్యాదులను పరిష్కరించడానికి, నియంత్రణ కోసం రూల్‌బుల్ రాయడానికి జాతీయ స్థాయిలో గేమింగ్ అథారిటీని ఏర్పాటు చేస్తుంది కేంద్రప్రభుత్వం.
ఆన్‌లైన్ గేమింగ్ అంటే ఆషామాషీ కాదు. 25 వేల కోట్ల సైజు ఉన్న బడా పరిశ్రమ ఇది. పార్లమెంటు ఆమోదించిన ఈ బిల్లు అమల్లోకి వస్తే డ్రీమ్11, మై11సర్కిల్, విన్‌జో లాంటి బడాసైజు గేమింగ్ కంపెనీలు సైతం తీవ్రంగా ప్రభావితమవుతాయి. క్రికెట్ ఇండస్ట్రీకి భారీగా రెవెన్యూ తగ్గిపోతుంది. 2 లక్షల మంది వరకూ ఉపాధిని కోల్పోతారు. ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్-AIGF లాంటి సంస్థలు ఈ బిల్లును మరణశాసనంగా భావిస్తున్నాయి. అటు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. లైసెన్సున్న గేమింగ్ కంపెనీలు మూతబడితే ఇల్లీగల్ ఆపరేటర్లు పుట్టుకొచ్చి, దొడ్డిదార్లో బెట్టింగ్ యాప్‌లను జనంలోకి తీసుకొచ్చే ప్రమాదముంది. ఇన్నేసి హెచ్చరికలున్నా ఖాతరు చేయలేదు మోదీ సర్కార్. ఉక్కుపాదం తప్పదని తేల్చిపారేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




