NEET 2026: నీట్ రీఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయిందా..? సోషల్ మీడియా పుకార్లపై ఎన్‌టీఏ బిగ్ క్లారిటీ..
జూన్ 21న జరగనున్న నీట్ రీ ఎగ్జామ్ ప్రశ్నపత్రం కూడా లీక్ అయిపోయిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముంది? అసలు విద్యార్థుల ఆందోళనను క్యాష్ చేసుకుంటూ తెరవెనుక ఆటలాడుతున్నది ఎవరు..? ఎన్టీఏ ఏం చెప్పింది.? అనే విషయాలు తెలుసుకుందాం..

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్-యూజీ రీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై జాతీయ పరీక్షల ఏజెన్సీ తీవ్రంగా స్పందించింది. జూన్ 21న జరగబోయే ఈ పరీక్షకు సంబంధించిన పేపర్ ముందే లీక్ అయిందనే లేదా అమ్మకానికి సిద్ధంగా ఉందనే ఆరోపణలు ముమ్మాటికీ అసత్యమైనవి, మోసపూరితమైనవి అని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనను ఆసరాగా చేసుకుని డబ్బులు గుంజడమే లక్ష్యంగా కొన్ని సంఘటిత ముఠాలు ఈ తప్పుడు ప్రచారానికి తెరలేపాయని ఏజెన్సీ మండిపడింది. ‘‘నీట్ 2026 రీ ఎగ్జామ్ ప్రశ్నపత్రం ముందే అందుబాటులోకి వచ్చిందని, అమ్మకానికి సిద్ధంగా ఉందంటూ సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్‌లో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇవన్నీ కల్పితాలు, తప్పుదోవ పట్టించే కథనాలు’’ అని ఎన్‌టీఏ తన ప్రకటనలో తెలిపింది. పరీక్షల భయం, ఆందోళనలో ఉన్న అభ్యర్థులను టార్గెట్ చేస్తూ నకిలీ ప్రశ్నపత్రాలను అంటగట్టి సొమ్ము చేసుకోవడానికే ఈ ముఠాలు పుకార్లు పుట్టిస్తున్నాయని తెలిపింది. పరీక్షా ప్రక్రియ సమగ్రత పూర్తిగా భద్రంగా ఉందని, అత్యంత సురక్షితమైన వాతావరణంలో నిష్పక్షపాతంగా పరీక్ష నిర్వహిస్తామని ఎన్‌టీఏ భరోసా ఇచ్చింది.
సైబర్ క్రైమ్ రంగంలోకి ఎన్‌టీఏ.. అకౌంట్లు బ్లాక్
ఇలాంటి నకిలీ కంటెంట్‌ను సృష్టిస్తున్న, ఫార్వార్డ్ చేస్తున్న సోషల్ మీడియా ఛానెళ్లను, ఖాతాలను ఎన్‌టీఏ చురుగ్గా పర్యవేక్షిస్తోంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న అకౌంట్లను తక్షణమే తొలగించాలని సంబంధిత ప్లాట్‌ఫారమ్‌లకు నివేదించడంతో పాటు సైబర్-క్రైమ్ అధికారులకు అధికారికంగా ఫిర్యాదులు చేస్తోంది. విద్యార్థులను మోసం చేయడానికి ప్రయత్నించడం తీవ్రమైన శిక్షార్హమైన నేరమని, బాధ్యులైన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఏజెన్సీ హెచ్చరించింది. అభ్యర్థులు ఎవరూ ఈ మోసగాళ్లను నమ్మి డబ్బులు చెల్లించవద్దని, కేవలం ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ సమాచారాన్ని మాత్రమే ఫాలో అవ్వాలని సూచించింది.
శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
మరోవైపు నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై రాజకీయంగా దుమారం రేగుతోంది. నీట్ యూజీ పరీక్షా అవకతవకలు, పేపర్ లీకేజీలపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వివరిస్తూ ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని జారీ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో ఎన్‌టీఏ వైఫల్యాలను ఎండగడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూన్ 15 వరకు నిందితులకు కస్టడీ
ఇదిలా ఉంటే, నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ వ్యవహారంలో పట్టుబడిన ఐదుగురు ముఖ్య నిందితుల జ్యుడీషియల్ కస్టడీని జూన్ 15 వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష.. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 12న రద్దయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుపై సీబీఐ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే జూన్ 21న జరగబోయే రీ ఎగ్జామ్‌పై విద్యార్థులు ఎలాంటి పుకార్లను నమ్మకుండా, పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టాలని ఎన్‌టీఏ కోరింది.
