నీట్ ఉద్యమంలో విద్యార్థులపై క్రిమినల్ కేసులు.. కొట్టివేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
NEET పేపర్ లీక్ ఘటన అనంతరం ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన నిరసనలకు సంబంధించి నమోదైన కేసులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జూలై 20 నుంచి 25 మధ్య జంతర్ మంతర్‌తో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసనలకు సంబంధించి నమోదైన కేసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూలై 20 నుంచి 25 మధ్య దేశవ్యాప్తంగా జరిగిన CJP నిరసనలకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ నిరసనలకు సంబంధించి దేశంలోని ఏ ప్రాంతంలోనూ కొత్తగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయొద్దని ఆదేశించింది. నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై కోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో ఇప్పటికే నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని, భవిష్యత్తులోనూ ఇదే అంశంపై కేసులు నమోదు చేయకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఇదే సమయంలో నిరసనల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే అంశంపైనా సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. బాధిత కుటుంబాలకు పరిహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలను రూపొందించాలని ఆదేశించింది.
మూడు నెలల్లో పరిహారం
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు, విధివిధానాలను రూపొందించి, అర్హులైన బాధిత కుటుంబాలకు మూడు నెలల్లోగా నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. FIRల రద్దుతో పాటు బాధిత విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అంశంపై కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఈ వ్యవహారం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది.
అసలేం జరిగిందంటే..?
నీట్ (NEET) పేపర్ లీక్ అనంతరం కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగిన విషయం తెలిసిందే.. గత జులై నెలలో జరిగిన ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం కఠిన యాంటీ-పేపర్ లీక్ బిల్లును తీసుకువచ్చింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో విచారణ.. ప్రశ్నపత్రాలు లీక్ చేసే వారికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 కోట్ల వరకు జరిమానా విధించేలా కఠిన బిల్లును రూపొందించింది. అయితే.. ఈ క్రమంలోనే.. జూలైలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో జరిగిన నిరసనలకు సంబంధించి నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలనే వాదన తెరపైకి వచ్చింది. చాలా ప్రాంతాల్లో విద్యార్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని.. వాటిని కొట్టివేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..
జూలై 20 నుంచి 25 మధ్య ఢిల్లీలోని జంతర్ మంతర్, దేశ రాజధాని ఢిల్లీలోని ఇతర ప్రాంతాలలో సీజేపీ నేతృత్వంలో జరిగిన నిరసనలకు సంబంధించి నమోదైన 13 ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని కోరుతూ కేంద్రం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతేకాకుండా.. కేసులు కొట్టివేయాలంటూ మహారాష్ట్ర, అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలు మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సీజేపీ ఆందోళనల నేపథ్యంలో నమోదైన క్రిమినల్ విచారణలను ముగించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ రాష్ట్రాలు కూడా జతకలిశాయి. దీనిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఢిల్లీ నిరసనల్లో భాగంగా నమోదైన కేసులన్నింటినీ కొట్టివేస్తూ మంగళవారం తీర్పును వెలువరించింది. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ ఎదుట వాదనలు వినిపించారు.
