మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అధ్యక్ష పదవి నుంచి శరద్ పవార్ తప్పుకున్న నేపథ్యంలో పార్టీకి తదుపరి జాతీయాధ్యక్షుడు ఎవరన్నది శుక్రవారం తేలనుంది. ఈ మేరకు పార్టీ అధినేతను ఎంపిక చేసేందుకు శరద్ పవార్ ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ దక్షిణ ముంబైలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశమవనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ కమిటిలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, సోదరుడి కుమారుడు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్ వంటి పలువురు నాయకులు సభ్యులుగా ఉన్నారు.
కాగా, 1999లో స్థాపితమైన ఎన్‌సీపీకి అప్పటి నుంచి కూడా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన శరద్ పవార్ ఉన్నట్టుండి.. ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు మే 2న ప్రకటించారు. నిజానికి తన ప్రకటనతో అటు పార్టీ నేతలతో పాటు దేశంలోని పలువురు రాజకీయ నాయకులను కూడా ఆశ్చర్యానికి గురి చేశారు. మరోవైపు పార్టీకి శరద్ తర్వాత తదుపరి అధినేతగా పవార్ కుటుంబం నుంచే ఎవరో ఒకరు ఎంపికవుతారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన కూతురు సుప్రియా సూలే లేదా సొదరుడి కుమారుడు అజిత్ పవార్ పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. అంతకముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కోసమే తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని శరద్ పవార్ గురువారం ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..