AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Politics: జాతీయ రాజకీయాల్లో పెద్ద కుదుపు.. రాహుల్ అనర్హతను సానుభూతిగా మల్చుకునే వ్యూహం.. బీజేపీ వ్యూహం ఇదేనా?

రాహుల్ గాంధీకి సంఘీభావం ప్రకటించిన పార్టీల్లో ఒకరి కంటే ఎక్కువ మంది కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొంటున్నవారే కావడం విశేషం. ఇపుడు రాహుల్ విషయంలో వారంతా సంఘీభావం ప్రకటించడానికి కూడా కారణం కనిపిస్తోంది.

National Politics: జాతీయ రాజకీయాల్లో పెద్ద కుదుపు.. రాహుల్ అనర్హతను సానుభూతిగా మల్చుకునే వ్యూహం.. బీజేపీ వ్యూహం ఇదేనా?
Rahul Gandhi - PM Modi - Amit Shah
Rajesh Sharma
|

Updated on: Mar 27, 2023 | 5:57 PM

Share

దేశంలో ఇపుడు ఎక్కడ చూసినా రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దు అంశంపైనే చర్చ జరుగుతోంది. నిర్ణయం తీసుకున్నది లోక్‌సభ సెక్రెటరీ అయినా ఆ నిర్ణయం కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ నేతలదేనంటూ దాదాపు విపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ మిత్ర పక్షాలతోపాటు ఆ పార్టీ తమకు ప్రత్యర్థేనని చెప్పుకునే బీఆర్ఎస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వంటివి కూడా రాహుల్ గాంధీ అనర్హతపై బీజేపీనే తప్పుపడుతున్నాయి. కేసీఆర్ స్వయంగా ఈ అంశంలో రాహుల్ గాంధీ పక్షాన స్పందించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, విపక్ష నేతలపై ఉసిగొల్పుతున్నదని గత కొన్నేళ్ళుగా ఆరోపిస్తున్న విపక్షాలన్నీ ఇపుడు రాహుల్ గాంధీకి సంఘీభావం ప్రకటించాయి. ఇలా సంఘీభావం ప్రకటించిన పార్టీల్లో ఒకరి కంటే ఎక్కువ మంది కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొంటున్నవారే కావడం విశేషం. ఇపుడు రాహుల్ గాంధీ విషయంలో వారంతా సంఘీభావం ప్రకటించడానికి కూడా కారణం కనిపిస్తోంది. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థల దర్యాప్తును ఎదుర్కొంటున్న వారిలో ఎవరికైనా రెండేళ్ళకు మించిన జైలు శిక్ష పడితే రేపు వారికి కూడా ఇపుడు రాహుల్ గాంధీకి పట్టిన గతే పడుతుంది. దీన్ని గ్రహించడం వల్లనే మోదీ సర్కార్‌పై యుద్దం ప్రకటించాయి.

కీలకాంశాన్ని విస్మరించిన లోక్‌సభ సెక్రెటరీ

రాహుల్ గాంధీ ఏమైనా చట్టాలకు, రాజకీయ సంప్రదాయాలకు అతీతుడా ? అంటే కాదనే చెప్పాలి. కానీ లోక్‌సభ సెక్రెటరీ ఆగమేఘాల మీద ఆయన్ను అనర్హునిగా ప్రకటించడం, 8 ఏళ్ళ పాటు ఎన్నికల్లో పోటీని అనర్హున్ని చేయడం మాత్రం విపక్షాలకు అందివచ్చిన అస్త్రంగానే మారింది. కేసు పూర్వాపరాలు తెలియని వారు కూడా సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీకి సంఘీభావం ప్రకటిస్తూ వుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకానొక పెద్దమనిషి అయితే అదానీ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తున్నందుకే రాహుల్ గాంధీని అనర్హున్ని చేశారని ట్వీటాడు. అయితే, బీజేపీని ఇరకాటంలోకి నెట్టే అంశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష విధించింది ఓ జిల్లా స్థాయి కోర్టు. సూరత్ కోర్టు రాహుల్ గాంధీని మోదీ సామాజిక వర్గీయులను అవమానపరిచారంటూ దాఖలైన పరువునష్టం కేసులో ముద్దాయిగా ప్రకటించింది. అందుగ్గాను రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. అయితే, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కోర్టుల్లో అప్పీలు చేసుకునే అవకాశం ఆయనకు కల్పించింది. అందుకు నెల రోజుల వ్యవధిని కూడా ఇచ్చింది. కానీ ఈలోగానే లోక్‌సభ సెక్రెటరీ ఆగమేఘాల మీద స్పందించి రాహుల్ గాంధీని అనర్హునిగా ప్రకటించేశారు. ఇది ఆయన సొంత నిర్ణయమో లేక విపక్షాలు చెబుతున్నట్లు బీజేపీ నేతల జోక్యం వుందో తెలియదు గానీ.. రాహుల్ గాంధీ హైకోర్టుకో లేక సుప్రీంకోర్టుకో వెళితే అక్కడ ఆయనకు రిలీఫ్ దొరికితే అప్పుడు పరిస్థితి ఏంటన్న అంశాన్ని విస్మరించినట్లు కనిపిస్తోంది.

సానుభూతి కోసమే తాపత్రయం!

సూరత్ కోర్టు కల్పించిన అప్పీలు అవకాశాన్ని రాహుల్ గాంధీ ఇంకా పరిశీలిస్తున్నట్లు లేదు. ఆయన ఈ అంశాన్ని రాజకీయంగానే ఎదుర్కొనేందుకు సిద్దమైనట్లు గత రెండు రోజుల పరిణామాలను చూస్తే బోధపడుతోంది. అదానీ అంశంపై మోదీని నిలదీస్తున్నందుకే రాహుల్ గాంధీని పార్లమెంటుకు రాకుండా చేశారన్న అభిప్రాయాన్ని దేశప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళడం ద్వారా సానుభూతి పొందాలన్నదే ప్రస్తుతం కాంగ్రెస్ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే ఉన్నట్లుండి ప్రియాంక ప్రత్యక్షమయ్యారు. చిరకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా వుంటున్న జగదీశ్ టైట్లర్ లాంటి వారు కూడా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలలో దర్శనమిచ్చారు. మోదీ ప్రభుత్వం రాహుల్ గాంధీ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న సందేశాన్ని ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. హైదరాబాద్ గాంధీభవన్ వేదికగా జరిగిన నిరసన కార్యక్రమంలో తెలంగాణ నేతలు ఒకడుగు ముందుకేసి రాహుల్ గాంధీకి సంఘీభావంగా ఎంపీ పదవులను రాజీనామాలకు సిద్దమని ప్రకటించారు. అవసరమైతే ప్రాణత్యాగాలకు సిద్దమంటూ భీషణ ప్రతిఙ్ఞలు చేశారు. మార్చి 28 నుంచి దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు జోరందుకోబోతున్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా మోదీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారన్న అంశాన్ని ప్రచారం చేయడం ద్వారా రాహుల్ గాంధీకి సానుభూతి పెరిగేలా చూసుకునే పనిలో పడ్డారు.

ఇగ ఏడాదంతా జాతరే!

పార్లమెంటు బడ్జెట్ సెషన్‌లో రెండు విడత సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీలు, రాహుల్ లండన్‌లో చేసిన ప్రసంగంపై బీజేపీ ఎంపీలు ప్రత్యేక చర్చకు పట్టుబడుతున్నారు. ప్రతీరోజూ ఉభయ సభలనను స్థంభింప చేస్తున్నారు. ఫలితంగా రెండో విడత బడ్జెట్ సెషన్‌లో ఒక్కరోజు కూడా సభల్లో కార్యకలాపాలు జరగలేదు. ఇపుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశం తెరమీదికి రావడంతో అదానీ అంశం తెరవెనక్కి వెళుతుందా లేక కాంగ్రెస్ పార్టీ రెండింటినీ లింకు పెట్టి ప్రజల ముందుకు వెళుతుందా అన్ని క్రమేపీ క్లారిటీ వస్తోంది. మోదీ ప్రభుత్వం గత 9 ఏళ్ళుగా చేస్తున్న విమర్శనాస్త్రాలను పోగేసి… అనర్హత వెనుక కుట్రకు కారణం మోదీ సర్కార్‌ను రాహుల్ గాంధీ తరచూ ఎండగట్టడమేనంటూ ప్రజల ముందుకు వెళ్ళబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈక్రమంలో ఇప్పటి దాకా బీజేపీ అధికార ప్రతినిధులు, కొందరు నేతలు మాత్రమే నోరు విప్పారు. ప్రధాని మోదీగానీ, కేంద్రంలో నెంబర్ టూగా భావించే హోం మంత్రి అమిత్ షాగానీ నేరుగా స్పందించలేదు. వారి ప్రతిస్పందన, ప్రతిఘటన ఎలా వుంటుందో తెలిస్తే వచ్చే ఏడాదిపాటు రాజకీయాలు ఎలా వుండబోతున్నాయో ఓ అంచనాకు రావచ్చు.