నేషనల్ హెరాల్డ్ కేసులో(National Herald Case) రాహుల్‌గాంధీ(Rahul Gandhi) విచారణ కొనసాగుతోంది. ముగ్గురు ఈడీ అధికారులు రాహుల్‌ను విచారిస్తున్నారు. ఇవాళ ఎక్కువ సేపు రాహుల్‌ను విచారించే అవకాశం లేదని ఈడీ అధికారులు చెబుతున్నారు. అయితే రాహుల్‌తో పాటు లోపలికి లాయర్లను అనుమతించకపోవడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు రాహుల్‌గాంధీ విచారణ కొనసాగుతుండగా ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. రెండంచెల భద్రత వలయాన్ని చేధించుకొని కొంతమంది కాంగ్రెస్ అగ్రనేతలు ఈడీ కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. అయితే చత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ బాగెల్‌తో పాటు ఎంపీలు చిదంబరం, దిగ్విజయ్‌సింగ్ సూర్జేవాలాను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌ను కూడా అదుపు లోకి తీసుకున్నారు.
రాహుల్, సోనియాలకు ఈడీ సమన్లకు వ్యతిరేకంగా సత్యాగ్రహ్ మార్చ్ చేపట్టాయి కాంగ్రెస్ శ్రేణులు. దీంతో ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. సత్యాగ్రహ్ మార్చ్‌కు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు పోలీసులు. దీంతో బారికేడ్లను కూడా లెక్కచేయకుండా వాటిని నెట్టుకుంటూ పాదయాత్ర చేపట్టారు హస్తం పార్టీ నేతలు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నోటీసులకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలకు దిగారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితేర్పడింది. భారీగా బలగాలను మోహరించిన పోలీసులు..ఎక్కడికక్కడ వారిని అడ్డుకొని అరెస్టులు చేస్తున్నారు.
రాహుల్‌కు ఈడీ సమన్లు, విచారణకు హాజరైన నేపథ్యంలో.. ఏఐసీసీ ఆఫీస్‌కు భారీగా చేరుకున్నారు కాంగ్రెస్ నేతలు. రాహుల్‌కు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఐ యామ్ నాట్ సావర్కర్..ఐ యామ్ రాహుల్ అన్న పోస్టర్ హాట్‌టాపిక్‌గా మారింది.
కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసమే..దర్యాప్తు సంస్థలను కేంద్రం ప్రయోగిస్తోందన్నారు. ఈ అంశాన్ని దేశప్రజలకు తెలిపేందుకే ఆందోళన చేస్తున్నామని..ఈ నిరసన ఆపేది లేదంటున్నారు.
అటు ఢిల్లీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలకు దిగుతున్నాయి. భారీ నిరసన ర్యాలీలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అక్రమంగా పెట్టారని ధర్నాకు దిగారు. కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఖైరతాబాద్- బషీర్‌బాగ్ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి.
అయితే.. కక్ష సాధింపులో భాగంగానే ఈడీ కేసులని ఆరోపించారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. అత్యంత నీతిపరులపైనే ఆరోపణలు మోపుతున్నారని..దీనిపై పార్లమెంట్‌ను స్తంభింపచేస్తామన్నారాయన.