AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడు రంజాన్.. 112 ఏళ్ల చరిత్ర మరోసారి..

నేడు రంజాన్.. కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ముస్లింలు అత్యంత పరమ పవిత్రంగా జరుపుకునే రంజాన్ ప్రార్థనలు మసీదులకు వెళ్లి చేసుకోలేని పరిస్థితి నెలకొంది.

నేడు రంజాన్.. 112 ఏళ్ల చరిత్ర మరోసారి..
Pardhasaradhi Peri
|

Updated on: May 25, 2020 | 1:05 PM

Share

నేడు రంజాన్.. కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ముస్లింలు అత్యంత పరమ పవిత్రంగా జరుపుకునే రంజాన్ ప్రార్థనలు మసీదులకు వెళ్లి చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఒకరినొకరు కలుసుకుని ఈద్ శుభాకాంక్షలు చెప్పుకోలేని పరిస్థితి. ఇళ్లలోనే ఎవరికి వారు ప్రార్థనలు చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు. అయితే ఇలాంటి పరిస్థితే గతంలో ఓ సారి జరిగింది. అప్పుడెప్పుడో 112 ఏళ్ల క్రితం మూసీ వరదలు వెల్లువెత్తినప్పుడూ ఇటువంటి పరిస్థితే వచ్చింది. అప్పట్లో ఈద్గాలు, మసీదు లు తెరుచుకున్నా.. ముస్లింలు మాత్రం ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకొని హంగూ ఆర్భాటం లేకుండా రంజాన్‌ను జరుపుకున్నారు.

రంజాన్ నెలవంక చూసి ఉపవాస దీక్షలు ప్రారంభించిన ముస్లింలు ఆదివారం షవ్వాల్ నెలవంక దర్శనమివ్వడంతో ఇవాళ రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. నెలవంక తొంగి చూడడంతో నెల రోజుల పాటు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు ఉపవాస దీక్షలను విరమించారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన, అతిపెద్ద పండుగ రంజాన్. దీనినే ఈద్-ఉల్-ఫితర్ అని అంటారు. ప్రతి ఏడాది ఈ రోజున రంజాన్ సందర్బంగా నమాజ్ చేసేందుకు మసీదులు సందడిగా మారుతుతాయి. కానీ ఈ సారి కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ముస్లింలు  ఇళ్లలోనే ఈద్‌–ఉల్‌–ఫితర్‌ ప్రార్థనలు చేసుకుంటున్నారు.

అప్పుడు.. ఇప్పుడు..

అది 1908 సెప్టెంబర్‌ 26,27,28.. హైదరాబాద్ చరిత్రలో ఓ చెరగని ముద్ర వేసిన రోజులు. మూసీ పొంగి పొరలింది. దాదాపు 17 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. మూసీ వరద తాకిడికి హైదరాబాద్ నగరంలోని అఫ్జల్, ముస్సాలం జంగ్, చాదర్‌ఘాట్‌ వంతెనలు తెగిపోయాయి. దాని ఉగ్రరూపంతో… వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. అదే సమయంలో రంజాన్‌ మాసం ప్రారంభమైంది. రంజాన్ నెల ముగిసే నాటికి కూడా ప్రజలు ఇళ్ల నుంచి బయటకి రాలేదు.

మూసీ వరద బీభత్సానికి అప్ఝల్‌గంజ్ లోని ప్రభుత్వాసుపత్రైతే… పూర్తిగా కొట్టుకుపోయింది. కనీసం ఎనిమిది వేల కుటుంబాలు ఆశ్రయం కోల్పోయి ఉంటాయని అప్పట్లో లెక్కలుగట్టారు. హైదరాబాదీలకు ఉపాధి కరువైంది. దీంతో ముస్లింలు పండుగ సంబరాల్ని పక్కనపెట్టి ఆ డబ్బును వరద బాధితుల సహాయార్ధం వెచ్చించారు. ఇది జరిగిన 112 ఏళ్ల తర్వా త, ఇప్పుడు హైదరాబాద్‌లో కరోనా దె బ్బకు భయపడి ప్రజలు 2 నెలలుగా గడప దాటి బయటికి రావట్లేదు. ప్రభుత్వ సూచనల మేరకు ఇప్పుడూ ప్రార్థనలు ఇళ్లకే పరిమితమైన పరిస్థితి.. అప్పటికి ఇప్పటికి ఒక తేడా ఉంది. అప్పుడు మసీదులు, ఈద్గాలు తెరుచుకుంటే ఇప్పుడా పరిస్థితి లేదు.