Petrol Tanker: రోడ్డుపై బోల్తాపడిన పెట్రోల్ ట్యాంకర్.. చుట్టూ ఎగబడ్డ జనాలు! ఇంతలో ఊహించని ఘోరం..
అర్ధరాత్రి వేళ పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. గమనించిన స్థానికులు రోడ్డుపై ఏరులై పారుతున్న పెట్రోల్ కోసం చుట్టూ గుమి కూడారు. కానీ ఇంతలో ఊహించని విధంగా మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమంలో సుమారు వంద మంది మంటల్లో ఆహుతయ్యారు..
అబుజా, అక్టోబర్ 16: నైజీరియాలో పెను విషాదం చోటు చేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 94 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. నైజీరియా రాజధాని అబుజాకు ఉత్తరాన 530 కిలోమీటర్ల దూరంలోని టౌరా లోకల్ గవర్నమెంట్ ఏరియాలోని మజియా పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కనో నుంచి పెట్రోల్ తీసుకెళ్లున్న ట్యాంకర్ మంగళవారం రాత్రి 12.30 గంటల సమయంలో ప్రమాదానికి గురికావడంతో రోడ్డుపై పెట్రోల్ ఒలికింది. పెట్రోల్ సేకరించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడారు. ఇంతలో ప్రమాదవశాత్తు ట్యాంకర్ పెద్ద శబ్ధంతో పేలింది. ఈ ఘటనలో దాదాపు 94 మంది మరణించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం అర్థరాత్రి జిగావా రాష్ట్రంలోని మాజియా అనే గ్రామంలో పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
డ్రైవర్ నియంత్రణ తప్పడంతో ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో పెట్రోల్ రోడ్డుపై ఏరులై పారింది. స్థానికులు పెట్రోల్ కోసం పెద్ద ఎత్తున గుమికూడారు. ఇదే సమయంలో ట్యాంకర్ పేలడంతో చుట్టూ గుమిగూడిన వారిలో 94 మంది చనిపోయారు. కనీసం 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ట్యాంకర్ నుంచి పెట్రోల్ సేకరించేందుకు గుమిగూడిన స్థానికులు ఈ ప్రమాదంలో మరణించారని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. గాయపడిన వారిని రింగిమ్, హడేజియా పట్టణాల్లోని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులకు సామూహిక దహన సంస్కారాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాగా గత గత నెలలో ఉత్తర-మధ్య నైజీరియాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పశువులను తీసుకెళ్తున్న ట్రక్కును పెట్రోల్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇతర వాహనాలు మంటల్లో చిక్కుకోవడంతో సుమారు 48 మంది ప్రయాణికులు మంటల్లో ఆహుతయ్యారు.