AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bomb Threats: కలవరపెడుతున్న బాంబు బెదిరింపులు.. అసలు ఏం జరుగుతోంది?

ఆదివారం దేశవ్యాప్తంగా విస్తారా, ఆకాశ, ఇండిగో విమానయాన సంస్థలకు వరుసగా బాంబు బెదిరింపులు వచ్చాయి. సేఫ్టీ ప్రొటోకాల్ అనుసరించి వాటిని గమ్యం చేరుకోక ముందే సమీప విమానాశ్రయంలో అత్యవసరంగా దించేయాల్సి వచ్చింది. అసలు ఏం జరుగుతోంది?

Bomb Threats: కలవరపెడుతున్న బాంబు బెదిరింపులు.. అసలు ఏం జరుగుతోంది?
Bomb Threats
Mahatma Kodiyar
| Edited By: Velpula Bharath Rao|

Updated on: Oct 20, 2024 | 7:22 PM

Share

బాంబు బెదిరింపులతో విమానయాన రంగాన్ని గుర్తుతెలియని దుండగులు టార్గెట్ చేశారు. వరుసగా బెదిరింపు సందేశాలు పంపుతూ అనేక సర్వీసులకు అంతరాయం కల్గిస్తున్నారు. తాజాగా ఆదివారం దేశవ్యాప్తంగా విస్తారా, ఆకాశ, ఇండిగో విమానయాన సంస్థలకు వరుసగా బాంబు బెదిరింపులు వచ్చాయి. సేఫ్టీ ప్రొటోకాల్ అనుసరించి వాటిని గమ్యం చేరుకోక ముందే సమీప విమానాశ్రయంలో అత్యవసరంగా దించేయాల్సి వచ్చింది. భారత విమానయాన రంగాన్ని లక్ష్యంగా చేసుకుంటున్న గుర్తుతెలియని దుండగులు గత రెండు వారాలుగా జాతీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్తున్న పలు విమాన సర్వీసులకు నకిలీ బాంబు బెదిరింపు సందేశాలతో అంతరాయం కల్గించారు. దీనిపై కేంద్ర పౌరవిమానయాన శాఖతో పాటు కేంద్ర హోంశాఖ కూడా దృష్టి సారించాల్సి వచ్చింది. మొదట బాంబు బెదిరింపులకు పాల్పడ్డది ఓ మైనర్‌ అని గుర్తించిన పోలీసులు, అతన్ని చట్ట ప్రకారం అదుపులోకి తీసుకుని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపర్చినట్టు తెలిసింది. ఇంతటితో సమస్య తీరిపోయింది అనుకుంటున్న తరుణంలో మళ్లీ బెదిరింపు సందేశాలతో విమానయాన రంగం ఆందోళనకు గురవుతుంది.

విమానయాన సంస్థలు, విమాన సర్వీసులతో పాటు దేశంలో విమానాశ్రయాలకు కూడా బాంబు బెదిరింపు హెచ్చరికలు అందాయి. కర్ణాటకలోని బెలగావి విమానాశ్రయానికి శనివారం (అక్టోబర్ 19)న రెండు, ఆదివారం నాడు ఒక బెదిరింపు ఈ-మెయిల్ వచ్చాయి. పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌ బృందాలు విమానాశ్రయాన్ని అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థం లేదని నిర్థారించారు. అది కేవలం ఒక బూటకపు బాంబు బెదిరింపుగా తేల్చారు. మరోవైపు బాంబు బెదిరింపు కారణంగా ఓ విమానాన్ని అత్యవసరంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ విమానాశ్రయంలో దించి తనిఖీలు నిర్వహించాల్సి వచ్చింది. విమానానికి బాంబు బెదిరింపు వచ్చినప్పుడు సేఫ్టీ ప్రోటోకాల్ యాక్టివేట్ చేస్తారు. ఆ ప్రకారం విమానాన్ని సమీపంలోని అనువైన విమానాశ్రయానికి దారిమళ్లించి కిందికి దించాల్సి ఉంటుంది. ల్యాండింగ్ అయిన తర్వాత, విమానంతో పాటు ప్రయాణీకుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఇదంతా పూర్తిచేయడానికి కొన్ని గంటల సమయం పడుతుంది.

విమానం అప్పటికే గాలిలో ఉంటే.. దేశీయ విమానానికి సంబంధించిన ముప్పును గుర్తించేందుకు విమానాశ్రయ-నిర్దిష్ట బాంబు థ్రెట్ అసెస్‌మెంట్ కమిటీ (BTAC) అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తుంది. ప్రతి విమానాశ్రయానికి సొంత BTAC వ్యవస్థ ఉంటుంది. ఇందులో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS), సంబంధిత ఎయిర్‌లైన్ మరియు విమానాశ్రయ నిర్వాహకులు ప్రతినిధులుగా ఉంటారు. ఈ వారంలో ఇప్పటివరకు 90కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు రాగా, దాదాపుగా అన్నీ బూటకమని తేలింది. విమానయాన సంస్థలకు బూటకపు బాంబు బెదిరింపుల సంఘటనలను నివారించడానికి కఠినమైన నిబంధనలను అమలు చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ క్రమంలో నేరస్థులను ‘నో-ఫ్లై (No-Fly)’ జాబితాలో ఉంచాలన్న ప్రతిపాదన కూడా ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..