Breaking: గుజరాత్ తీరాన్ని తాకిన ‘తౌటే’ తుఫాన్.. మరో రెండు గంటలు బీభత్సం..
Tauktae Cyclone Updates: ఒక వైపు కరోనా మమహ్మారి విజృంభిస్తుంటే.. మరో వైపు తుఫాను భయాందోళన కలిగిస్తోంది...
Tauktae Cyclone: ఒక వైపు కరోనా మమహ్మారి విజృంభిస్తుంటే.. మరో వైపు తుఫాను భయాందోళన కలిగిస్తోంది. కొద్దిసేపటి క్రితమే గుజరాత్‌లోని పోరుబందర్-మహువా మధ్య తీరాన్ని తాకింది. ఈ భీకర తుఫాన్ తీరాన్ని దాటడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ సమయంలో తీరం వెంబడి గంటకు 185 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి. ఈ తుఫాన్ కారణంగా ఇప్పటికే 7 రాష్ట్రాల్లో 12 మంది మరణించారు. ఇక ముంబై నగరంలో తౌటే తుఫాన్ విధ్వంసం సృష్టించింది. ఆ రాష్ట్ర అధికారులు వీలైనంత మేర ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారు.
The extremely severe cyclonic storm #Tauktae lies close to the Gujarat coast. The landfall process started and will continue during next 2 hours: India Meteorological Department (IMD) pic.twitter.com/ojuZYORwpq
— ANI (@ANI) May 17, 2021
‘తౌటే’ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో పీఎం వీడియో కాన్ఫరెన్స్..
మహారాష్ట్రలో పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోదీ ఆరా తీశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో సోమవారం మోదీ ఫోన్‌లో మాట్లాడారు. తుఫాను కారణంగా జరిగే నష్టాల గురించి సీఎంను అడిగి తెలుసుకున్నారు. అయితే తుఫాను కారణంగా భారీ ఈదురు గాలులతో పెద్ద పెద్ద చెట్లు సైతం రోడ్లపైనే కూలిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ రోజు రాత్రి కూడా ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను కారణంగా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, అన్ని రకాలుగా అండగా ఉంటామని ప్రధాని మోదీ సీఎంకు భరోసా ఇచ్చారు.
అలాగే గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌లతో కూడా మోదీ మాట్లాడారు. తుఫాను సృష్టిస్తున్న బీభత్సంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, తుఫానుతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉదయం నుంచి మూసివేశారు. మరింత నష్టం జరుగకుండా ముంబై వాసులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.