West Bengal: మొబైల్ గేమ్స్ ఆగడాలు ఆగడం లేదు. గతంలో బ్లూవేల్, పబ్జీ లాంటి గేమ్స్ పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో మరో కొత్త మొబైల్ గేమ్ బాలుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఈ గేమ్ పేరు, ఇతర వివరాలు ఇంకా తెలియనప్పటికీ ఈ గేమ్ ఏకైక షరతు ఏమిటో తెలుసా.. ఇందులో ఓడిపోయిన వారు గెలిచిన వారి చేతిలో 200 చెప్పు దెబ్బలు తినాలట. ఒక్కోసారి 200 కంటే ఎక్కువ దెబ్బలే తినాల్సి ఉంటుందట. ఈక్రమంలో ఈ పిచ్చి గేమ్‌లో ఓడిపోయిన ఓ మైనర్ బాలుడు ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలోని పొటాష్‌పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ గ్రామానికి చెందిన బాలురు తమ నివాసాలకు దూరంగా వెళ్లి ఈ మొబైల్ గేమ్ ప్రారంభించారు. ఓడిపోయిన వారు 200 సార్లు చెప్పు దెబ్బలు తినాలనే షరతు ముందుగానే పెట్టుకున్నారు.
కాగా ఈ గేమ్‌లో ఓడిపోయిన ఒక మైనర్ బాలుడు గెలిచిన వారి చేతిలో 200 కంటే ఎక్కువ చెప్పు దెబ్బలు తిన్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ముక్కు నుండి రక్తం కారడం కూడా ప్రారంభమైంది. పరిస్థితిని గమనించిన కుటుంబీకులు బాలుడిని మొదట ఎగ్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో మేదినీపూర్ మెడికల్ కాలేజీలో చేర్చారు. తమ పిల్లాడు ఇలా కావడానికే మొబైల్ గేమ్ కారణమని తెలియడంతో బాలుడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..