Ministry Of Jal Shakti: గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది. ఢిల్లీలో నేడు (శుక్రవారం) మధ్యహ్నం 3 గంటలకు 5 రాష్ట్రాలతో సమావేశం నిర్వహించేందుకు రంగం చేసింది. ఈ సమావేశం కేంద్ర జలశక్తి శాఖ(Jal Shakti Ministry) కార్యదర్శి పంకజ్ కుమార్ నేతృత్వంలో జరగనుంది. ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana), పుదుచ్చేరి, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల కారదర్శులు పాల్గొనబోతున్నారు. అలాగే ఐదు రాష్ట్రాల అభిప్రాయాలు, ఆలోచనలను తీసుకోనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది.
గోదావరి నది నుంచి మిగులు జలాలను కావేరికి తరలించే లింక్ ప్రాజెక్టుపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. గోదావరి నదిపై ఉన్న ఇచ్ఛంపల్లి ప్రాజెక్టు నుంచి కావేరి నదిపై భారీ ఆనకట్టకు నీటిని మళ్లించేలా ప్రాజెక్టు రూపకల్పన చేసే విషయమై కూడా మాట్లాడనున్నారు.
సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను గత ఏడాది రాష్ట్రాలకు పంపిన కేంద్ర జలశక్తి శాఖ, గత ఏడాది అక్టోబర్ నెలలో వర్చువల్ సమావేశం నిర్వహించింది.
భారత ద్వీపకల్పంలో నీటి అవసరాలను తీర్చే ప్రాజెక్టుగా కేంద్రం భావిస్తోంది. గోదావరి నుంచి 247 టీఎంసీల మిగులు నదీ జలాలను తరలించేలా ప్రణాళిక వేస్తోంది.
ప్రాజెక్టులో భాగంగా ఉన్న లింకులు..
01. గోదావరి (ఇచ్చంపల్లి) – కృష్ణ (నాగార్జున సాగర్)
02. కృష్ణ (నాగార్జున సాగర్) – పెన్నా (సోమశిల)
03. పెన్నా (సోమశిల) – కావేరి (గ్రాండ్ ఆనకట్ట)
నదుల అనుసంధానంతో ముడిపడ్డ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధన కోసం కేంద్రం ప్రయత్నం చేస్తోంది. తరలించే 247 టీఎంసీల మిగులు జలాల్లో ఏపీకి 81, తెలంగాణకు 66, తమిళనాడు 83 టీఎంసీలు ఇచ్చేలా ముసాయిదా డిజైన్ చేసింది.
దీనిపై చత్తీస్‌గఢ్, కర్నాటకతో పాటు కేరళ, పుదుచ్ఛేరి, మహారాష్ట్ర అభ్యంతరాలు వెల్లడించాయి. తరలించే నీటిలో తమకు కూడా వాటా కావాలని కర్నాటక డిమాండ్ చేస్తోంది.
ముందు గోదావరి నదిలో నీటి లభ్యతపై సమగ్ర శాస్త్రీయ అధ్యయనం చేయాలని తెలుగు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. మిగులు జలాల లెక్కలు తేలకుండా నీటిని తరలిస్తే నష్టపోతామని ఆయా రాష్ట్రాలు వెల్లడించాయి. దీంతో నేటి సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు.
Also Read: Coronavirus: దేశంలో కరోనా మరణాలు 32- 37 లక్షలంటూ కథనాలు.. కేంద్రం ఏమంటోందంటే..
Delhi News: ఢిల్లీలో అనుమానాస్పద బ్యాగ్ కలకలం.. బ్యాగ్ లో భారీగా పేలుడు పదార్థాలు..!