
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో దయారా బుగ్యాల్ ట్రెక్కింగ్ సందర్భంగా అదృశ్యమైన 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని బబితా పాండే కోసం అధికారులు భారీ స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నైనిటాల్‌కు చెందిన బబితా పాండే గత వారం తన ఇద్దరు స్నేహితులు హర్మన్‌పాల్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్‌లతో కలిసి ఉత్తరకాశీ పర్యటనకు వెళ్లింది. మే 25న డెహ్రాడూన్ చేరుకున్న ఈ బృందం హర్సిల్, గంగోత్రి సహా పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించింది.
అనంతరం మే 28న రైతల్ గ్రామానికి చేరుకుని అక్కడ బస చేసిన ముగ్గురు, మరుసటి రోజు దయారా బుగ్యాల్ ట్రెక్‌ను ప్రారంభించారు. గోయి బేస్ క్యాంప్‌లో రాత్రి బస చేసిన సమయంలో అర్ధరాత్రి తర్వాత బబితా కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఉత్తరకాశీ ఎస్పీ కమలేష్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. బబితాను గుర్తించేందుకు సుమారు 150 మంది సిబ్బందితో ప్రత్యేక గాలింపు బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. సైన్యం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి), ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, అటవీ శాఖ, విపత్తు నిర్వహణ విభాగాల సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. దట్టమైన అటవీ ప్రాంతాలు, ట్రెక్కింగ్ మార్గాలు, గుహలు, లోయలు వంటి ప్రాంతాల్లో జాగిలాలు, డ్రోన్ల సహాయంతో గాలిస్తున్నారు. గోయి క్యాంప్ సమీపంలోని సరస్సులో డైవింగ్ బృందం కూడా అన్వేషణ చేపట్టింది.
ఇదిలా ఉండగా, బబితాతో పాటు వెళ్లిన ఇద్దరు స్నేహితులను పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ ట్రెక్‌కు నకిలీ పర్మిట్‌తో అనుమతి కల్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘ప్రో మౌంటెన్’ ట్రెక్కింగ్ ఏజెన్సీ రిజిస్ట్రేషన్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. అధికారిక పర్యాటక పోర్టల్‌లో బబితా లేదా ఆమె సహచరుల పేర్లపై చెల్లుబాటు అయ్యే డిజిటల్ పర్మిట్లు లేవని ప్రాథమిక విచారణలో తేలినట్లు జిల్లా పర్యాటక శాఖ వెల్లడించింది. బబితా ఆచూకీ కోసం గాలింపు చర్యలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి