కేంద్రంలోని బీజేపీని ఎదుర్కోవడానికి తమకు కాంగ్రెస్‌తో కూటమి అవసరం లేదంటున్నారు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కోల్‌కతాలో సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు అఖిలేశ్. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో గతంలో కాంగ్రెస్ చేసిన తప్పునే బీజేపీ రిపీట్ చేస్తోందన్నారు. కాంగ్రెస్ రహిత విపక్ష కూటమిని ఏర్పాటు చేస్తామని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. దీదీ మమతా బెనర్జీ సహకారంతో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీలను సమదూరంలో పెట్టాలని అటు సమాజ్‌వాదీ పార్టీ ఇటు తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేస్తున్నాయి.
బెంగాల్ సీఎం మమతతో శుక్రవారం అఖిలేశ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విపక్షాల ఐక్యతపై చర్చించారు. రాహుల్‌ను ప్రతిపక్షాలకు నాయకుడిగా చూపాలని బీజేపీ ప్రయత్నిస్తోందని.. దాన్ని అడ్డుకొనే వ్యూహంతో ముందుకు సాగాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. పార్లమెంట్‌లో విపక్షాల గొంతను అధికార పక్షం నొక్కేస్తుందని అన్నారు మమత.
లండన్‌లో రాహుల్ చేసిన వ్యాఖ్యలను వాడుకొని తమను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని ప్రతిపక్ష పార్టీలు అనుమానిస్తున్నాయి. మమతా బెనర్జీ త్వరలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో కూడా భేటీ కాబోతున్నారు. విపక్షాల ఐక్యతపై ఆమె చర్చలు జరిపే అవకాశం ఉంది.
ఉత్తరప్రదేశ్‌లో ఒంటరిగానే బరి లోకి దిగుతామన్నారు అఖిలేశ్‌యాదవ్. కాంగ్రెస్‌తో ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్లో పొత్తుపెట్టుకోమన్నారు మమత. బీజేపీ, కాంగ్రెస్ తీరు పెద్దగా తేడా లేదన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..