AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahatma Gandhi: భారత కరెన్సీ నోట్లపై తొలిసారిగా గాంధీజీ చిత్రాన్ని ఎప్పుడు ముద్రించారో తెలుసా..?

Mahatma Gandhi: భారతీయ కరెన్సీపై మహాత్మగాంధీ బొమ్మ ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇంతకీ భారత కరెన్సీ నోట్లపై ఎవరి బొమ్మలు ఉండాలి..

Mahatma Gandhi: భారత కరెన్సీ నోట్లపై తొలిసారిగా గాంధీజీ చిత్రాన్ని ఎప్పుడు ముద్రించారో తెలుసా..?
Subhash Goud
|

Updated on: Oct 02, 2021 | 6:06 AM

Share

Mahatma Gandhi: భారతీయ కరెన్సీపై మహాత్మగాంధీ బొమ్మ ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇంతకీ భారత కరెన్సీ నోట్లపై ఎవరి బొమ్మలు ఉండాలి..? అది నిర్ణయించేదెవరు..? గాంధీ కంటే ముందు కరెన్సీపై ఎవరి బొమ్మ ఉండేది..? గాంధీ బొమ్మను తొలిసారిగా ఏ నోటుపై ముద్రించారు..? ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అందరికి తెలిసి ఉండవు. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా భారత కరెన్సీపై గాంధీ చిత్రాన్ని ఎప్పుడు ముద్రించారో తెలుసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సెంట్రల్ బ్యాంకులకు ఉన్నట్లే భారత్‌లో కరెన్సీ ముద్రించే అధికారం ఒక్క భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ)కు మాత్రమే ఉంది. అయితే 1947 ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చింది. 1950 జనవరి 26న గణతంత్ర రాజ్యంగా మారింది. అప్పటి నుంచి భారతీయ రిజర్వ్ బ్యాంకు కరెన్సీ ముద్రిస్తూ ఉంది. ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. 1949లో భారత ప్రభుత్వం మొదటి సారి రూపాయి నోటు ఎలా ఉండలన్న డిజైన్‌ను రూపొందించింది.

బ్రిటన్ రాజుకు బదులుగా మహాత్మ గాంధీ బొమ్మను కరెన్సీపై ముద్రించాలని మొదట అనుకున్నారట. ఇందుకోసం డిజైన్లు కూడా రూపొందించారు. కానీ, దీనిపై ఏకాభిప్రాయం కుదరలేదు. చివరికి అశోక స్తంభం ముద్రించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతకుమించి పెద్దగా కరెన్సీ డిజైన్‌లో పెద్ద తేడాలు ఏవీ రాలేదు. 1950లో గణతంత్ర భారత్‌లో తొలిసారి రూ.2, రూ.5, రూ.10, రూ.100 నోట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. వాటి డిజైన్ల మధ్య తేడాలు లేవు గానీ, రంగులు భిన్నంగా ఉన్నాయి. రూ.10 నోటు వెనుకవైపు పడవల బొమ్మలను అలాగే ఉంచారు. 1953లో తెచ్చిన నోట్లలో హిందీని ప్రముఖంగా ముద్రించారు. రూపాయిని బహువచనంలో ఏమనాలన్న చర్చ కూడా అప్పుడు జరిగింది. హిందీలో ఏకవచనంలో రూపయా, బహువచనంలో రూపయేగా అనాలని నిర్ణయించారు.

1954లో రూ.1000, రూ.2000, రూ.10,000 నోట్లను తిరిగి తీసుకువచ్చారు. 1978లో మళ్లీ వీటిని రద్దు చేశారు. రూ.2, రూ.5 నోట్లపై సింహాలు, జింక వంటి వాటిని ముద్రించారు. 1975 నుంచి రూ.100 నోట్లపై వ్యవసాయ స్వయంసమృద్ధి, తేయాకు తోటల్లో ఆకులను తెంపడం వంటి వాటికి సంబంధించిన ఫొటోలు కనిపిస్తాయి. అయితే 1969లో మహాత్మ గాంధీ 100వ జయంతి సందర్భంగా తొలిసారి కరెన్సీ నోట్లపై మహాత్మ గాంధీ బొమ్మను ముద్రించారు. సేవాగ్రామ్ ఆశ్రమం ముందు మహాత్మ గాంధీ కూర్చొని ఉన్న చిత్రాన్ని అచ్చువేశారు. 1972లో రిజర్వు బ్యంకు తొలిసారి రూ.20 నోటును ముద్రించింది. ఆ తర్వాత 1975లో రూ.50 నోటును తీసుకువచ్చింది.

రూ.2 నోటుపై ఆర్యభట్ట ఉపగ్రహం , రూ.1 నోటుపై చమురు బావి, రూ.5 నోటుపై ట్రాక్టర్‌తో పొలం దున్నతున్న రైతు, రూ.10 నోటుపై కోణార్క్ మందిరం చక్రం, నెమలి, శాలిమార్ గార్డెన్ ఫొటోలు ముద్రించారు. దేశ ఆర్థికవ్యవస్థ వేగంగా వృద్ధి చెందింది. ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరుగుతూ వచ్చింది. దీంతో 1987 అక్టోబర్‌లో తొలిసారిగా రిజర్వు బ్యాంకు రూ.500 నోటును ముద్రించింది. దీనిపై గాంధీ బొమ్మను, వాటర్ మార్క్‌లో అశోక స్తంభాన్ని ముద్రించింది. 1996లో కొత్త భద్రత ప్రమాణాలతో మహాత్మ గాంధీ సిరీస్ నోట్ల ముద్రణ మొదలైంది. వాటర్‌మార్క్‌ను కూడా మార్చారు. అంధులు కూడా గుర్తించేలా, వాటిని రూపొందించారు.

ఇక 2000 అక్టోబర్ 9న రూ.1000 నోట్లను రిజర్వు బ్యాంకు జారీ చేసింది. భారత కరెన్సీ చరిత్రలో రెండో అతిపెద్ద సంస్కరణ 2016లో జరిగింది. ఆ ఏడాది నవంబర్ 8న మహాత్మ గాంధీ సిరీస్‌లోని రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొత్తగా రూ.2000 నోటును అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనిపైనా మహాత్మ గాంధీ బొమ్మను కొనసాగించారు. అయితే నోట్లపై ముద్రించిన మహాత్మగాంధీ చిత్రం ప్రస్తుతం రాష్ట్రపతి భవన్‌లో వైస్రాయ్‌ హౌస్‌లో ఉంది. 1946లో గాంధీజీ మయన్మార్‌కు చేరుకున్న సమయంలో అప్పటి బ్రెమా, ఇండియా కార్యదర్శి ఫ్రెడరిక్‌ పెథిక్‌ లారెన్సిని కలిశారు. అక్కడ తీసిన చిత్రం ఇది. అయితే అప్పట్లో ఈ ఫోటోను ఎవరు తీశారనేది క్లారిటీ లేదు. ఇక నోట్ల రద్దు తర్వాత జారీ చేసిన కొత్త నోట్ల రంగులు చాలా మారిపోయాయి. కానీ గాంధీజీ నవ్వుతున్న చిత్రం మాత్రం అలాగే ఉండిపోయింది.

ఇవీ కూడా చదవండి:

ATM: ఇక నుంచి ఏటీఎంలలో డబ్బుల కొరత ఉండదు.. ఆర్బీఐ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ 1 నుంచి అమలు..!

Mahatma Gandhi Jayanti: సేవాగ్రాం .. మహాత్మ గాంధీజీ గుర్తొచ్చే జ్ఞాపకాలు.. బాపూజీ గురించి ఆసక్తికర విషయాలు