Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India: దేశంలోనే తొలి AI యూనివర్సిటీ..ఎక్కడో తెలుసా..?

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌పై ఇండియా ఫోకస్‌ పెంచింది. ఇప్పటికే అమెరికా, చైనా ఈ రేస్‌లో దూసుకుపోతుండగా..భారత్ ఇప్పుడే ఈ పోటీలోకి వచ్చింది. త్వరలోనే ఇండియా సొంతగా AI మోడల్‌ని తయారు చేసుకుంటుందని ప్రకటించారు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్. ఆ తరవాత బడ్జెట్‌లోనూ కేంద్రం ప్రత్యేకంగా AI కి నిధులు కేటాయించింది. ఎక్స్‌లెన్స్ సెంటర్స్ ఏర్పాటు చేసేందుకు రూ.500 కోట్లు నిధుల కేటాయింపులు చేసింది.

India: దేశంలోనే తొలి AI యూనివర్సిటీ..ఎక్కడో తెలుసా..?
Artificial Intelligence
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 03, 2025 | 1:46 PM

ముఖ్యంగా విద్యారంగంలోనే AI ని వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది మోదీ సర్కార్. కేంద్రం ఇచ్చిన ప్రోత్సాహంతో రాష్ట్రాలూ AI బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం కీలక కసరత్తులు మొదలు పెట్టింది. దేశంలోనే తొలి AI యూనివర్సిటీని నెలకొల్పేందుకు ప్లాన్ రెడీ చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టాస్క్‌ఫోర్స్‌ని ఇప్పటికే ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర ఐటీ మంత్రి ఆశిష్ షెలార్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఈ యూనివర్సిటీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని వెల్లడించారు. ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా అకాడమిక్స్‌లో విద్యార్థులకు ఈ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.

అయితే..మహారాష్ట్ర ఏర్పాటు చేసిన ఈ టాస్క్‌ఫోర్స్‌లో ఐటీ ఎక్స్‌పర్ట్‌లున్నారు. వీళ్ల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని AI యూనివర్సిటీ ఏర్పాటుకు ప్లాన్ సిద్ధం చేసుకోనుంది ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా.. ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఉన్నత విద్యామంత్రిత్వ శాఖతో పాటు ఐటీ శాఖ కలిసి ఈ మేరకు సలహాలు, సూచనలు తీసుకుంటున్నాయి. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే..ఈ పని పూర్తి చేస్తామని చెబుతున్నాయి. AI విప్లవంలో మహారాష్ట్ర మార్గదర్శిగా ఉండాలన్నది తమ ఆకాంక్ష అని చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు ఇందులో భాగమేనని వివరించింది. ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు పరిశోధనలకు ఊతం అందించడం, ప్రపంచ స్థాయి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ని ఏర్పాటు చేయడం లాంటి లక్ష్యాలు పెట్టుకుంది ప్రభుత్వం. అయితే..AI యూనివర్సిటీ ఏర్పాటుకు తగ్గట్టుగా సలహాలు, సూచనలు చేయాలని టాస్క్‌ఫోర్స్‌కి నెల రోజుల గడువు ఇచ్చింది ప్రభుత్వం. ముంబయిలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. కేవలం విద్యారంగంలోనే కాకుండా..పరిపాలనా పరంగా కూడా AI ని వినియోగించాలని చూస్తోంది ప్రభుత్వం.