AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబైలో నరమేధానికి భారీ కుట్ర..! మొహర్రం ఊరేగింపులో ఎలుకల మందు కలకలం.. నిందితుడు అరెస్ట్!

ముంబై మహానగరంలో మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకున్న భారీ కుట్రను పోలీసులు భగ్గుం చేశారు. ఊరేగింపులో పాల్గొనే వందలాది మంది ప్రజల ప్రాణాలను బలితీసుకునేందుకు ప్లాన్ చేసిన ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి ఏకంగా 14,900 ఎలుకల విషం నింపిన క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకోవడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

ముంబైలో నరమేధానికి భారీ కుట్ర..! మొహర్రం ఊరేగింపులో ఎలుకల మందు కలకలం.. నిందితుడు అరెస్ట్!
Mubai Massive Conspiracy
Balaraju Goud
|

Updated on: Jun 27, 2026 | 4:32 PM

Share

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకున్న భారీ కుట్రను పోలీసులు భగ్గుం చేశారు. ఊరేగింపులో పాల్గొనే వందలాది మంది ప్రజల ప్రాణాలను బలితీసుకునేందుకు ప్లాన్ చేసిన ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి ఏకంగా 14,900 ఎలుకల విషం నింపిన క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకోవడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

మొహర్రం ఊరేగింపు సందర్భంగా ముంబై వీధుల్లో భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులకు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించాడు. డీసీపీ జయంత్ మీనా తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 26 శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఊరేగింపులో పాల్గొన్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా వాంతులు, కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అప్రమత్తమైన పోలీస్ బృందం, అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా క్యాప్సూల్స్ పంపిణీ చేస్తున్న సదరు నిందితుడిని తక్షణమే అదుపులోకి తీసుకుని విచారించింది.

పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని పూణేకు చెందిన పెయింట్ వ్యాపారి ఫయాజ్ ప్రేమ్‌జీగా గుర్తించారు. మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని, భారీ వినాశనానికి ఇతడు ఒడిగట్టినట్లు ఒప్పుకున్నాడు. ఇందుకోసం ఏకంగా 50 కిలోల జింక్ ఫాస్ఫైడ్ (ఎలుకల మందు) ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు. తన ఇంట్లోనే కూర్చుని ప్రతి క్యాప్సూల్‌లో ఒక గ్రాము చొప్పున విషాన్ని నింపాడు. మొత్తం 30,000 విషపు గుళికలను తయారు చేయాలనేది అతని లక్ష్యం కాగా.. పోలీసులు పట్టుకునే సమయానికి 14,900 క్యాప్సూల్స్ సిద్ధం చేశాడు. అదృష్టవశాత్తూ వీటిని పెద్ద ఎత్తున పంపిణీ చేయకముందే పోలీసులు నిందితుడిని పట్టుకోవడంతో పెను విషాదం తప్పింది.

నిందితుడు ఫయాజ్ గతంలో ఇరాన్, ఇరాక్ దేశాలకు ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పర్యటనల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? ఈ కుట్ర వెనుక ఏదైనా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందా? లేదా స్థానికంగా ఎవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. “ముంబైలో ఒక పెద్ద ఎత్తున ప్రాణనష్టం కలిగించేందుకు కుట్ర జరిగింది. పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి పెను ముప్పును నివారించారు. నిందితుడి పేరు ఫయాజ్ ప్రేమ్‌జీ. ప్రజలకు పెద్ద ఎత్తున హాని కలిగించడమే ఇతని ఉద్దేశం. ప్రస్తుతం మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం.” అని డీసీపీ జయంత్ మీనా వెల్లడించారు.

ఈ ఘటనతో ముంబై పోలీసులు ఒక్కసారిగా ఉల్లిక్కిపడ్డారు. మహానగరవ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పండుగలు, ఊరేగింపుల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే ఎలాంటి పదార్థాలనైనా తినవద్దని, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us