Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ జంట పక్కింటి యువకుడిని ఇంటికి పిలిచి అతని ప్రైవేట్ పార్ట్‌ని కోసేశారు. బాధిత యువకుడు ఎలాగోలా ఆ భార్యాభర్తల నుంచి తప్పించుకుని ఆస్పత్రికి వెళ్లాడు. ప్రస్తుతం అతను తీవ్ర గాయాలతో ఎంవై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, వారు ఇలా చేయడానికి ఓ కారణం ఉందని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు చెబుతున్నారు. బాధిత వ్యక్తి.. పొరుగింట్లో ఉంటున్న వివాహితతో రోజూ మాట్లాడేవాడట. ఇది గమనించిన ఆ వివాహిత భర్త.. తన భార్యకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో అప్పటి నుంచి ఆ మహిళ పక్కింటి వ్యక్తి(బాధితుడు)తో మాట్లాడటం మానేసింది.
అయితే, ఆ వ్యక్తి మాత్రం మహిళతో మాట్లాడేందుకు తెగ ప్రయత్నించాడు. దీంతో మరింత కోపోద్రిక్తుడైన భర్త.. అతనికి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యాడు. తన భార్య సహకారంతో అతన్ని విందు పేరుతో ఇంట్లోకి పిలిపించాడు. ఇద్దరూ కలిసి అతనిపై ప్లాన్ అమలు చేశారు. పక్కింటి వ్యక్తి ఇంట్లోకి రాగానే దంపతులిద్దరూ అతనిపై అటాక్ చేశారు. అతని దుస్తులు విప్పేసి.. జననాంగాన్ని కోసేశారు. వారి చెర నుంచి తప్పించుకున్న బాధితుడు నేరుగా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. వారు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎంవై ఆస్పత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ఆ దంపతులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. భార్యభర్తలిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.