Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Delhi: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై జాగ్రత్తలు అవసరం.. లోక్‌సభ స్పీకర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జవాబుదారీగా, నమ్మదగినదిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. జీ-20 సమావేశాల తరహాలో అందులోని సభ్యదేశాల సభాపతులతో నిర్వహించిన పీ-20 శిఖరాగ్ర సదస్సులో చర్చించిన ఇతర అంశాల గురించి స్పీకర్ ఓంబిర్లా మీడియాకు వివరించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే భారత్ ఉపేక్షించబోదని ఆయన తెలిపారు. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం పిలుపునిస్తూ..

New Delhi: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై జాగ్రత్తలు అవసరం.. లోక్‌సభ స్పీకర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..
Om Birla About AI
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Narender Vaitla

Updated on: Oct 15, 2023 | 11:01 PM

భవిష్యత్తును శాసించబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో జాగ్రత్తలు అవసరమని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రెండ్రోజుల పాటు జరిగిన పీ-20 సమావేశాల్లో చర్చించిన అంశాల్లో కొన్ని దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను విశ్వసనీయమైన, బాధ్యతాయుతంగా ఉపయోగించాలని నొక్కిచెప్పాయని తెలిపారు. బాధ్యతాయుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అభివృద్ధితో పాటు డేటా భద్రతపై అన్ని దేశాలు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని బిర్లా సూచించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జవాబుదారీగా, నమ్మదగినదిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. జీ-20 సమావేశాల తరహాలో అందులోని సభ్యదేశాల సభాపతులతో నిర్వహించిన పీ-20 శిఖరాగ్ర సదస్సులో చర్చించిన ఇతర అంశాల గురించి స్పీకర్ ఓంబిర్లా మీడియాకు వివరించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే భారత్ ఉపేక్షించబోదని ఆయన తెలిపారు. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం పిలుపునిస్తూ.. “శాంతి, అభివృద్ధికి ఉగ్రవాదం అడ్డంకి” అని తేల్చి చెప్పారు. సమిష్టి దృఢ సంకల్పంతో ఉగ్రవాదానికి సంబంధించిన అన్ని వనరులను అడ్డుకోవాలని ఆయన ఉద్ఘాటించారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల పాత్రపై జరిగిన చర్చలో సామాన్య ప్రజల జీవితాల్లో సామాజిక-ఆర్థిక మార్పును తీసుకురావడంలో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల పాత్రను అన్ని దేశాలు అంగీకరించాయని చెప్పారు. దీని వల్ల సర్వీస్ డెలివరీ, ఇన్నోవేషన్‌ను మరింత సులభతరం చేయవచ్చని అన్ని దేశాలు అభిప్రాయపడ్డాయని వెల్లడించారు.

భారతదేశ G20 ప్రెసిడెన్సీ థీమ్‌ ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’కు అనుగుణంగా 9వ P20 సమ్మిట్ థీమ్ ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు కోసం పార్లమెంటులు’ తో జరిగిన శిఖరాగ్ర సమావేశాలు దిగ్విజయంగా ముగిశాయి. జి20 దేశాలతో పాటు మరో 10 దేశాలను ఈ సదస్సుకు ఆహ్వానించగా, ఇందులో ఒక దేశం మినహా అన్ని దేశాలు పాల్గొన్నాయి. 29 దేశాల నుండి మొత్తం 37 మంది ఆయా దేశాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రతినిధి బృందాల నాయకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆఫ్రికన్ యూనియన్‌కు G20లో సభ్యత్వం కల్పించిన తర్వాత మొదటిసారిగా P20 శిఖరాగ్ర సమావేశంలో పాన్-ఆఫ్రికన్ పార్లమెంట్ పాల్గొంది.

G20 సభ్యదేశాలతో పాటు ఆహ్వానిత దేశాల సభాపతులు, ఉప సభాపతులతో పాటు 48 మంది పార్లమెంటు సభ్యులతో సహా మొత్తం 436 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రారంభ సెషన్‌కు సంబంధించి, P20 శిఖరాగ్ర సమావేశాన్ని అక్టోబర్ 13న అత్యాధునిక అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ‘యశోభూమి’లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. మదర్ ఆఫ్ డెమోక్రసీ (ప్రజాస్వామ్యానికి తల్లి)గా భారతదేశం పాత్రను ప్రధాన మంత్రి హైలైట్ చేశారు.

కాన్ఫరెన్స్ విజయవంతం కావడంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఓంబిర్లా.. జి20 సదస్సులో ప్రధాని మోదీ నేతృత్వంలోని జాయింట్ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత, పీ20లో కూడా ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయానికి రాగలిగిందని బిర్లా చెప్పారు. గత ఏడాది ఇండోనేషియాలో ఉమ్మడి ప్రకటనపై అంగీకారం కుదరకపోవడం గమనార్హం. P20లో ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయం భారతదేశ నాయకత్వాన్ని, సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని బిర్లా అన్నారు.

మహిళల సారథ్యంలో అభివృద్ధి..

ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం గురించి మాట్లాడుతున్న తరుణంలో ‘అభివృద్ధిలో మహిళలకు భాగస్వామ్యం’ అన్న నినాదాన్ని భారత్ మార్చేసి ‘మహిళల సారథ్యంలో అభివృద్ధి’ అంటూ వారికి మరింత భాగస్వామ్యాన్ని, నాయకత్వాన్ని అందించే ప్రయత్నం చేస్తోంది. పీ-20 సదస్సులో ఈ ప్రతిపాదనను సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించాలని భారత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. భారత పార్లమెంటు ఆమోదించిన నారీ శక్తి వందన్ బిల్లును అన్ని దేశాలు స్వాగతించాయని ఆయన అన్నారు.

వాతావరణ మార్పులే అతి పెద్ద సవాల్..

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ వాతావరణ మార్పులేనని, ఈ ముప్పును ఎదుర్కోడానికి భారత్ అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఓం బిర్లా తెలిపారు. ప్ర‌ధాన మంత్రి ఇచ్చిన ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ లైఫ్‌స్టైల్ (లైఫ్) కాన్సెప్ట్‌పై జరిగిన చర్చలో, ఈ విషయంలో సరికొత్త ఆవిష్కరణల గురించి అన్ని దేశాలు సమాచారం ఇచ్చాయని చెప్పారు. ఇకపై అన్ని దేశాల పార్లమెంట్‌లలో మిషన్‌ లైఫ్‌పై ప్రత్యేక చర్చ జరుగుతుందని, పర్యావరణానికి అనుకూలమైన జీవనశైలిని అలవర్చుకోవాలని యావత్ దేశానికి, ప్రపంచానికి సందేశం ఇస్తామని చెప్పారు. ఇలా చేయడం ద్వారా భారతదేశ నేతృత్వంలో భూమి, పర్యావరణం, ప్రకృతిని రక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఏకమవతారని, బెస్ట్ ప్రాక్టీసెస్ (ఉత్తమ విధానాలు), కృషిని పరస్పరం పంచుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన, ఆదర్శవంతమైన జీవనశైలి వైపు అడుగులు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..