Dhanunjay Singh: ‘బాహుబలి’ అస్త్ర సన్యాసం వెనుక వ్యూహం ఇదేనా.. ఉత్తరప్రదేశ్ అసలేం జరగుతోంది..?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పూర్వాంచల్‌లో మాత్రమే కాదు, యావత్ 'ఠాకూర్' (క్షత్రియ) సమాజాన్ని ప్రభావితం చేయగల్గిన నేతల్లో ఆయన ఒకరు. మాఫియా సామ్రాజ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చి కనుసైగతో గెలుపోటములను శాసించే శక్తిగా మారిన ధనుంజయ్ సింగ్ 2024 సార్వత్రిక ఎన్నికల వేళ తన మౌనం వహించారు.

Dhanunjay Singh: 'బాహుబలి' అస్త్ర సన్యాసం వెనుక వ్యూహం ఇదేనా.. ఉత్తరప్రదేశ్ అసలేం జరగుతోంది..?
Dhananjay Singh
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 07, 2024 | 3:56 PM

ఎన్నికల రాజకీయాల్లో ప్రభావవంతమైన నేతల ‘మౌనం’ కూడా ఆయుధంగా మారుతుంది. మాటలే తూటాలై పేలుతూ ఓట్లు రాల్చుతున్న కాలంలో ఓ నేత వ్యూహాత్మక మౌనం ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వాంచల్ ప్రాంతంలో కమలదళనానికి ‘ఆయుధం’గా మారింది. మౌనం వహించిన ఆ నేత ధనుంజయ్ సింగ్. 2014 కంటే ముందు ఆయన ఎన్నికల బరిలోకి దిగితే భారతీయ జనతా పార్టీ (BJP) సైతం డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది. 2014 తర్వాత మోదీ-షా ద్వయం హవాలోనూ ఆయన్ను ఎదుర్కోవడం సాధ్యపడలేదు.

రాష్ట్రంలో పూర్వాంచల్‌లో మాత్రమే కాదు, యావత్ ‘ఠాకూర్’ (క్షత్రియ) సమాజాన్ని ప్రభావితం చేయగల్గిన నేతల్లో ఆయన ఒకరు. మాఫియా సామ్రాజ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చి కనుసైగతో గెలుపోటములను శాసించే శక్తిగా మారిన ధనుంజయ్ సింగ్ 2024 సార్వత్రిక ఎన్నికల వేళ తన మౌనం వహించారు. అప్పటికే బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నుంచి జౌన్‌పూర్ బరిలో ఉన్న తన సతీమణి శ్రీకళారెడ్డిని పోటీ నుంచి తప్పించి మరీ మౌనం వహించడం వెనుక వ్యూహం ఏంటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. మొత్తమ్మీద యుద్ధక్షేత్రంలో అస్త్ర సన్యాసం చేయించడంలో కమలదళ అగ్రనేతలు విజయం సాధించారు. తదుపరి ఈ మౌనాన్ని ఆయుధంగా మార్చుకుని ఓట్లు రాల్చుకునే పనిలో పడ్డారు.

బాహుబలి ధనుంజయ్ సింగ్

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్‌పూర్ కేంద్రంగా ఒకప్పుడు నేర సామ్రాజ్యానికి అధిపతిగా వ్యవహరించిన వ్యక్తి ధనుంజయ్ సింగ్. లఖ్‌నవూ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. తొలినాళ్లలో ‘మండల్ కమిషన్’ సిఫార్సులను వ్యతిరేకిస్తూ వార్తల్లోకి నిలిచారు. ఠాకూర్ (క్షత్రియ) సామాజికవర్గానికి చెందిన ఆయన కండలవీరుడిగా పేరొందారు. యూపీ ప్రజలు ధనుంజయ్ సింగ్‌ను ‘బాహుబలి’గా వ్యవహరిస్తారు. 1996 నుంచి 2013 మధ్యకాలంలో ఆయనపై గ్యాంగ్‌స్టర్ యాక్ట్ ప్రకారం 4 పర్యాయాలు అభియోగాలు నమోదయ్యాయి. 1998 అక్టోబర్‌లో బదోహిలో ఓ పెట్రోల్ బంక్‌ను దోపిడీ చేస్తున్న సమయంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ధనుంజయ్ సింగ్ చనిపోయాడని పేర్కొంటూ రిపోర్టు దాఖలు చేయగా, 4 నెలల తర్వాత సింగ్ మళ్లీ ప్రత్యక్షమయ్యారు.

ఈ ఘటనలో తప్పుడు నివేదిక అందించిన 34 మంది పోలీసులపై విచారణ చేపట్టాల్సి వచ్చింది. నిజానికి పూర్వాంచల్ ప్రాంతంలో మాఫియా డాన్‌లా వ్యవహరించిన ముఖ్తార్ అన్సారీకి వ్యతిరేకంగా ధనుంజయ్ సింగ్ నేరసామ్రాజ్యంలోకి అడుగుపెట్టినట్టు చెబుతారు. ఠాకూర్ వర్గానికి చెందిన కండలవీరులు బ్రిజేష్ సింగ్, వినీత్ సింగ్, రఘురాజ్ ప్రతాప్ సింగ్‌తో బాహుబలి ధనుంజయ్ సింగ్‌కు సత్సంబంధాలున్నాయి. ముఖ్తార్ అన్సారీ మరణానంతరం పూర్వాంచల్ ప్రాంతంలో ఈ ఠాకూర్ కండలవీరుల ఆధిపత్యం పెరిగింది.

2002లో తొలిసారిగా యూపీ అసెంబ్లీకి స్వతంత్రంగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన ధనుంజయ్ సింగ్. 2007లో జనతాదళ్ (యునైటెడ్) పార్టీ తరఫున మళ్లీ ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఉండగానే, 2009 సార్వత్రిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున 15వ లోక్‌సభకు ఎంపీగా గెలుపొందారు. అలా మొత్తంగా 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా, 2 పర్యాయాలు ఎంపీగా గెలుపొందిన ధనుంజయ్ సింగ్‍‌పై కిడ్నాప్, దోపిడీ, హత్యాయత్నం సహా అనేక రకాల నేరాలకు సంబంధించిన 41 కేసులు నమోదయ్యాయి.

ధనుంజయ్ ఫ్యాక్టర్

గ్యాంగ్‌స్టర్‌గా నేర సామ్రాజ్యంలోనే కాదు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన ఆధిపత్యాన్ని ధనుంజయ్ సింగ్ కొనసాగించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా… ఏ పార్టీ తరఫున పోటీ చేసినా గెలుపు ఆయన ముంగిట వాలిపోయేది. ఆయనపై నమోదైన కేసుల్లో కొన్నింటిలో 7 ఏళ్ల జైలు శిక్ష పడడంతో ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను ఆయన కోల్పోయారు. అయినప్పటికీ రాజకీయాల్లో ఆయన పట్టును మాత్రం కోల్పోలేదు. తన సతీమణి శ్రీకళారెడ్డిని జిల్లా పంచాయితీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించడమే కాదు, జిల్లా పంచాయితీ (పరిషత్) చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యేలా చేయడంలో ధనుంజయ్ సింగ్ రాజకీయ చతురత కనిపిస్తుంది.

అంతేకాదు ఆయన సన్నిహితుడు బ్రిజేష్ సింగ్ ప్రిన్స్‌ను జౌన్‌పూర్ ప్రాంత ఎమ్మెల్సీగా చేయడంలో ధనుంజయ్‌దే కీలక పాత్ర. జౌన్‌పూర్ రాజకీయాలపై ఆయనకు గట్టి పట్టు ఉండడమే ఇందుకు కారణం. ఈ ఎన్నికల్లో జౌన్‌పూర్ స్థానం నుంచి తానే స్వయంగా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని అనుకున్నారు. కానీ జైలు శిక్ష కారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయినందుకు ఎంపీ టికెట్‌ను తన సతీమణి శ్రీకళారెడ్డికి ఇప్పించుకున్నారు. ఆమె నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేశారు. గత కొన్నాళ్లుగా విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఈలోగా ధనుంజయ్ సింగ్ బెయిల్ మీద జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన తర్వాత భార్య తరఫున ప్రచార పర్వంలో దూసుకెళ్తారని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన ‘మౌనం’ వహించారు. భార్యను కూడా పోటీ నుంచి తప్పించారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో మాయావతి చివరి నిమిషయంలో అభ్యర్థిని మార్చి సిట్టింగ్ ఎంపీ శ్యామ్ సింగ్ యాదవ్‌కు బీ-ఫాం అందించారు.

ధనుంజయ్ తన వైఖరి మార్చుకోవడంలో కమలనాథుల ప్రయత్నం ఫలించినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ బీజేపీ తరఫున కృపాశంకర్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఆయన స్వస్థలం జౌన్‌పూరే అయినప్పటికీ ఇంతకాలం పాటు మహారాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు. సొంత రాష్ట్రానికి తిరిగొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఆయన సొంతూరు జౌన్‌పూర్ నుంచే ఎన్నికల బరిలో నిలిచారు. కృపాశంకర్ సింగ్ కూడా ఠాకూర్ సామాజికవర్గానికి చెందిన నేత కావడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ధనంజయ్ సింగ్ భార్య శ్రీకళా రెడ్డి జౌన్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీలో కొనసాగితే బీజేపీ గెలుపొందడం కష్టంగా మారుతుంది. అందుకే ఆ పార్టీ అగ్రనాయకత్వం ధనుంజయ్ సింగ్‌ను మచ్చిక చేసుకున్నట్టు తెలుస్తోంది.

జౌన్‌పూర్‌లో ధనంజయ్ సింగ్ ప్రభావం కేవలం ‘ఠాకూర్’ వర్గానికే పరిమితం కాలేదు. దళితులు, ఇతర వెనుకబడిన వర్గాల్లో (OBC) కూడా ఆయనకు మంచి ప్రభావం ఉంది. అలాగే జౌన్‌పూర్ ముస్లింలలో కూడా తనదైన ప్రభావాన్ని సింగ్ కలిగి ఉన్నారు. ఠాకూర్‌ల తర్వాత ధనంజయ్‌సింగ్‌కు ఎవరైనా అతిపెద్ద రాజకీయ సాయం అందించారంటే అది మల్లా వర్గీయులే. రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత, ధనంజయ్ వారిని విడిచిపెట్టలేదు. ఆ కులానికి చెందిన ప్రభావవంతమైన నాయకులను తన బృందంలో చేర్చుకున్నారు. స్థానికంగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. ధనంజయ్ జౌన్‌పూర్‌పైనే కాకుండా ఫిష్ సిటీగా పేరొందిన భదోహి లోక్‌సభ స్థానంపై కూడా మంచి ప్రభావం చూపుతున్నారు.

అసలు ఆట ఇప్పుడు మొదలైంది

రాజస్థాన్‌లో రాజ్‌పుత్ (క్షత్రియ) ఆధిపత్యానికి గండికొడుతూ ఓ బ్రాహ్మణ నేతకు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించడం ఉత్తరాదిన ఆ వర్గం నేతలను బాధించింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో ఠాకూర్లకు గతంలో ఇచ్చినన్ని సీట్లు కూడా ఇవ్వకుండా ఓబీసీలు, ఇతర వర్గాలకు ప్రాధాన్యత కల్పించడం వారిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్, కేంద్రంలో రక్షణశాఖ మంత్రిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్, జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న గజేంద్ర సింగ్ షెకావత్ సహా పలువురు క్షత్రియులు బీజేపీలో కీలక పదవుల్లో ఉన్నప్పటికీ, యూపీలో తాము ఆశించిన సీట్లు దక్కకపోవడంతో వారు కమలదళంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

మొదటి దశతో పాటు 2వ దశ పోలింగ్‌లో ఇది స్పష్టంగా కనిపించింది. దీంతో దిద్దుబాటు చర్యలను అధినాయకత్వం ప్రారంభించింది. అందులో భాగంగానే ప్రభావవంతమైన ఠాకూర్ నేతలను సంప్రదించి, మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ క్రమంలో బాహుబలి ధనంజయ్ సింగ్ జైలు నుంచి బయటకు రాగానే ‘ఆట’ మొదలుపెట్టింది. శ్రీకళా రెడ్డి పోటీ నుంచి తప్పుకోవడం జౌన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం సమీకరణాలను పూర్తిగా మార్చడమే కాకుండా పూర్వాంచల్ రాజకీయాల్లో కూడా ‘ధనంజయ్ ఫ్యాక్టర్’ కనిపిస్తోంది. ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున ఠాకూర్ నేత కృపాశంకర్ సింగ్ పోటీ చేస్తుండగా.. సమాజ్‌వాదీ పార్టీ (SP) నుంచి బాబు సింగ్ కుష్వాహా భార్య శివకన్య కుష్వాహాకు పోటీ చేస్తున్నారు.

నిజానికి జైలుకు వెళ్లే ముందు ధనంజయ్ సింగ్ జౌన్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మాఫియా నేపథ్యం కల్గిన ధనంజయ్ సింగ్‌కు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష (I.N.D.I.A) కూటమి నుండి టిక్కెట్ దక్కలేదు. ఈ క్రమంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో కిడ్నాప్, దోపిడీకి సంబంధించిన పాత కేసులో ధనంజయ్ సింగ్‌కు కోర్టు ఏడేళ్ల శిక్ష విధించింది. ధనంజయ్ సింగ్ జైలుకు వెళ్లడంతో ఆయన భార్య శ్రీకళారెడ్డిని జౌన్‌పూర్ స్థానం నుంచి పోటీకి సిద్ధం చేశారు. శ్రీకళారెడ్డికి బీస్పీ టికెట్ ఇవ్వడంతో త్రిముఖ పోరు నెలకొంది.

సరిగ్గా ఇదే సమయంలో ధనుంజయ్ సింగ్ తన వైఖరి మార్చుకుని భార్యను పోటీ నుంచి తప్పించారు. జైలుకు వెళ్లే ముందు, బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ధనంజయ్ సింగ్ వైఖరిలో చాలా మార్పు కనిపిస్తోంది. జైలుకు వెళ్లే ముందు, ధనంజయ్ సింగ్ ఎలాగైనా జౌన్‌పూర్ సీటును గెలుస్తానని చెప్పుకొచ్చారు. బెయిల్ పొంది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీకళారెడ్డి ఎన్నికల ప్రచారానికి మరింత ఊపు వస్తుందని భావించినా అందుకు విరుద్ధంగా జరిగింది. ఆయన తన భార్య కోసం ప్రచారంలో పాల్గొనలేదు, ఒక్కసారి కూడా బీజేపీని, ఆ పార్టీ విధానాలను విమర్శించలేదు.

పూర్వాంచల్‌లో మారిన రాజకీయ సమీకరణాలు!

బీఎస్పీ జోనల్ కోఆర్డినేటర్ ఘనశ్యామ్ ఖర్వార్ టీవీ9తో మాట్లాడుతూ.. మాజీ ఎంపీ ధనంజయ్ సింగ్ భార్య శ్రీకళారెడ్డికి జౌన్‌పూర్ స్థానం నుంచి టిక్కెట్టు రద్దు కాలేదని, ఆమె స్వయంగా ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారని చెప్పారు. ధనంజయ్ సింగ్ ఆదివారం రాత్రి 11:30 గంటలకు ఫోన్ చేసి వ్యక్తిగత కారణాల వల్ల లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేనని చెప్పినట్టుగా తెలిసింది. బీఎస్పీ అధినేత్రి మాయావతికి శ్రీకళారెడ్డి స్థానంలో శ్యామ్ సింగ్ యాదవ్‌ను అభ్యర్థిగా చేశారు. శ్రీకళారెడ్డి ఎన్నికల రంగం నుంచి తప్పుకోవడంతో జౌన్‌పూర్‌ సీటుతో పాటు పూర్వాంచల్‌లోని పలు స్థానాల్లో రాజకీయ సమీకరణాలు మారాయి.

జౌన్‌పూర్‌లో బీజేపీ విజయాన్ని సులభతరం చేయడంతో పాటు, పూర్వాంచల్‌లోని చాలా స్థానాల్లో డ్యామేజ్ కంట్రోల్ జరుగుతుంది. జౌన్‌పూర్‌లో 2 లక్షలకు పైగా ఠాకూర్ ఓటర్లు ఉన్నారు. కృపా శంకర్ సింగ్ కూడా ఠాకూర్ కావడంతో.. ధనంజయ్ భార్య ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ఠాకూర్ ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. జౌన్‌పూర్ ప్రాంతంలో ఠాకూర్ ఓటు బ్యాంకుపై ధనంజయ్ సింగ్‌కు మంచి పట్టు ఉంది. ఇప్పుడు ఆయన ఎన్నికల నుంచి విడిపోవడం బీజేపీకి సైలెంట్‌గా ఉపయోగపడుతుంది.

మరో ఠాకూర్ నేత రఘురాజ్ ప్రతాప్ సింగ్‌ (రాజా భయ్యా)తో ధనంజయ్ సింగ్ చాలా బలమైన సంబంధాలున్నాయి. తాజాగా ఆదివారం బెంగళూరులో అమిత్ షాతో రాజా భయ్యా భేటీ అయ్యారు. ఠాకూర్‌లలో నెలకొన్న అసంతృప్తిని బుజ్జగించేందుకే ఈ భేటీ జరిగినట్టు స్పష్టమవుతోంది. యూపీలో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజా భయ్యా బీజేపీకి బహిరంగంగానే మద్దతిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపాతో పొత్తు పెట్టుకోవాలని రాజా భయ్యా భావించినా ఫలితం లేకపోయింది. ఠాకూర్‌ల అసంతృప్తి మధ్య అమిత్ షాతో రాజా భయ్యా భేటీ ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. సరిగ్గా ఇదే సమయంలో ధనంజయ్ సింగ్ ఎన్నికలలో పోటీ నుంచి తన భార్యను విరమింపజేయడం బీజేపీ పట్ల ఆయన వైఖరి మెత్తబడినట్టుగా అర్థమవుతోంది. రఘురాజ్ ప్రతాప్ సింగ్‌ను ధనుంజయ్ సింగ్ తన పెద్దన్నయ్యగా భావిస్తారు. పెద్దన్న సలహా మేరకే ధనుంజయ్ సింగ్ అస్త్ర సన్యాసం చేసినట్టుగా తెలుస్తోంది.

మౌనమే అభిమానం

లోక్‌సభ ఎన్నికల నుంచి వైదొలిగిన తర్వాత ధనంజయ్ సింగ్ ఇంకా తన తదుపరి కార్యాచరణ వెల్లడించలేదు. ప్రస్తుతానికి ఆయన మౌనాన్ని ఆశ్రయించారు . జౌన్‌పూర్‌ ప్రజలతో సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నారు. ఈ దశలో ధనుంజయ్ మౌనం వహించడం ద్వారా బీజేపీకి రాజకీయంగా సహాయకారిగా మారినట్టుగా కనిపిస్తోంది. అంటే తన మౌనం ద్వారా కమలదళంపై అభిమానాన్ని ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. జౌన్‌పూర్, మచ్లీ సిటీ స్థానాల్లో తన మద్దతు ఉన్న ఓటర్లను బీజేపీకి అనుకూలంగా మలుచుకునే పాత్రను పోషించనున్నారు. అలాగే పూర్వాంచల్‌లో ఠాకూర్ ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నందున ఆ ప్రాంత ఓటర్లను ఠాకూర్లు ప్రభావితం చేయగలరు.

కాగా, జౌన్‌పూర్, ప్రతాప్‌గఢ్, ఘాజీపూర్, బల్లియా, అయోధ్య, భదోహి, చందౌలీ నియోజకవర్గాల్లో ఠాకూర్ ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఠాకూర్ ఓటర్లలో ధనంజయ్ సింగ్ ప్రభావం పూర్వాంచల్‌లోని 12 స్థానాలపై ఉంది. వీటిలో జౌన్‌పూర్, మచ్లి షహర్, ఘోసి, బల్లియా, ఘాజీపూర్, చందౌలీ, అజంగఢ్, లాల్‌గంజ్, వారణాసి, మీర్జాపూర్, సోన్‌భద్ర మరియు భదోహి ఉన్నాయి. ధనంజయ్ సింగ్ నుండి రాజా భయ్యా వరకు ప్రతి ఒక్కరినీ కమలదళం మచ్చిక చేసుకుంటున్న విధానం పూర్వాంచల్‌లో ఆ పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కలిగిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…